Duleep Trophy 2024: కెప్టెన్‌గా గిల్‌కు పరాభవం.. దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఓటమి

Duleep Trophy 2024: కెప్టెన్‌గా గిల్‌కు పరాభవం.. దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఓటమి

టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ గా కితాబులందుకుంటున్న శుభమాన్ గిల్ కు దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ కలిసి రాలేదు. అతను కెప్టెన్ గా ఉంటున్న ఇండియా-ఏ జట్టు అభిమన్యు ఈశ్వరన్ సారధ్యం వహిస్తున్న ఇండియా-బి జట్టుపై ఓడిపోయింది. నాలుగో రోజు ముగిసిన ఈ మ్యాచ్ లో ఇండియా-బి 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం గిల్ టీమిండియా వన్డే, టీ20 జట్లకు కెప్టెన్సీ చేస్తున్నాడు. త్వరలో అతనికి టెస్ట్ వైస్ కెప్టెన్ పగ్గాలు అప్పజెప్పే అవకాశం ఉంది.
 
కెప్టెన్సీలో తన మార్క్ చూపించలేని గిల్.. బ్యాటర్ గాను విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 25.. రెండో ఇన్నింగ్స్ లో 21 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. భారత్ రానున్న నాలుగు నెలల్లో 10 టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గిల్ ఫామ్ లో లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. అయితే ఈ ఏడాది ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో గిల్ అద్భుతంగా రాణించడం ఊరటనిచ్చే విషయం. బంగ్లాదేశ్ తో సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కు గిల్ ను ఎంపిక చేయడం ఖాయమైనా.. అతనికి కెప్టెన్సీ ఇస్తారో లేదో చూడాలి. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా–బి తొలి ఇన్నింగ్స్ లో 321 పరుగులకు ఆలౌటైంది. జట్టు చేసిన 321 పరుగుల్లో ఒక్కడే 181 పరుగులు చేయడం విశేషం. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ 231 పరుగులు మాత్రమే చేయగలిగింది. 90 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన  ఇండియా-బి 184 పరుగులకు ఆలౌటైంది. 275 పరుగుల లక్ష్య ఛేదనలో ఇండియా-ఏ 198 పరుగులకే ఆలౌటైంది.