16 పాక్ యూట్యూబ్ చానళ్ల నిషేధం..

16 పాక్ యూట్యూబ్ చానళ్ల నిషేధం..
  • ఇండియానే దాడిచేసిందన్నట్టుగా బీబీసీ హెడ్డింగ్..
  • భారత్ సీరియస్ వార్నింగ్

న్యూఢిల్లీ: పహల్గాం టెర్రరిస్టు ఎటాక్ తరువాత రెచ్చగొట్టే, తప్పుదోవ పట్టించే, ఇండియా సైన్యానికి వ్యతిరేకమైన, సున్నితమైన మతపరమైన అంశాలను వ్యాప్తి చేసినందుకు పాకిస్తాన్​కు చెందిన మొత్తం 16 యూట్యూబ్ చానెళ్లను ఇండియా నిషేధించింది. ఈ చానెళ్లకు దాదాపు 63 మిలియన్ల మంది సబ్​స్ర్కైబర్స్​ ఉన్నారు. 

నిషేధించిన వాటిలో డాన్, సమా టీవీ, ఏఆర్​వై న్యూస్, బోల్ న్యూస్, రఫ్తార్, జియో న్యూస్, సునో న్యూస్, ది పాకిస్తాన్ రిఫరెన్స్, సమా స్పోర్ట్స్, ఉజైర్ క్రికెట్, రాజీనామా తదితర యూట్యూబ్ చానళ్లు ఉన్నాయి. సీనియర్ జర్నలిస్టులు ఇర్షాద్ భట్టి, ఆస్మా సిరాజ్, ఉమర్ చీమా, మునీబ్ ఫరూక్ కు చెందిన యూట్యూబ్ చానెళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. 

మరోవైపు కాశ్మీర్​లో టూరిస్టులపై దాడికి ఇండియానే కారణమనేలా హెడ్డింగ్​ పెట్టిన బీబీసీకి ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ‘‘కాశ్మీర్ పర్యాటకులపై ఘోరమైన దాడి.. భారతీయుల వీసాలను నిలిపివేసిన పాకిస్తాన్’’ అనే హెడ్డింగ్​ను బీబీసీ పెట్టింది. ఈ హెడ్డింగ్ టూరిస్టులపై దాడికి ఇండియానే కారణమనే అర్థం వచ్చేలా ఉందని.. సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీబీసీ ఇండియా హెడ్ జాకీ మార్టిన్​కు తీవ్ర నిరసన తెలిపినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.