- 20 రన్స్ తేడాతో ఓడిన ఆస్ట్రేలియా
- 3-1తో సిరీస్ టీమిండియా సొంతం
రాయ్‌పూర్ : కీలక టైమ్‌లో బౌలర్లందరూ సమయోచితంగా రాణించడంతో.. చిన్న టార్గెట్‌ను టీమిండియా అద్భుతంగా కాపాడుకుంది. అక్షర్ పటేల్ (3/16) స్పిన్ మ్యాజిక్‌కు తోడు పేసర్ దీపక్ చహర్ (2/44) అండగా నిలవడంతో.. శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో ఇండియా 20 రన్స్ తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే 3–1తో సొంతం చేసుకుంది. టాస్ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 174/9 స్కోరు చేసింది.
రింకూ సింగ్ (29 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), యశస్వి జైస్వాల్ (28 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 37), జితేశ్ శర్మ (19 బాల్స్‌లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 35) చెలరేగారు. తర్వాత ఆసీస్ 20 ఓవర్లలో 154/7 స్కోరుకే పరిమితమైంది. మాథ్యూ వేడ్ (36 నాటౌట్), ట్రావిస్ హెడ్ (31) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. అక్షర్ పటేల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఐదో టీ20 బెంగళూరులో ఆదివారం జరుగుతుంది.
రింకూ జోరు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు ఆరోన్ హార్డీ (1/20) మెయిడెన్ ఓవర్‌తో స్వాగతం పలికాడు. రెండో ఓవర్‌లో ఫోర్‌తో టచ్‌లోకి వచ్చిన యశస్వి.. తర్వాతి ఓవర్‌లో మూడు బౌండ్రీలు బాదాడు. నాలుగో ఓవర్‌లో బ్యాటింగ్ చాన్స్ తీసుకున్న రుతురాజ్ (32) కట్ షాట్‌తో ఫోర్ కొట్టాడు. మధ్యలో డెబ్యూ స్పిన్నర్ క్రిస్ గ్రీన్ బౌలింగ్‌లో సిక్స్‌తో రెచ్చిపోయిన జైస్వాల్ పవర్‌ప్లేలో ఇండియాకు 50 రన్స్ అందించి ఔటయ్యాడు. ఈ దశలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (8), సూర్య కుమార్ (1) నిరాశపర్చారు. సంగా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ట్రై చేసి శ్రేయస్, డ్వారిషస్ బాల్‌ను సింపుల్‌గా ఆడబోయి సూర్య ఔటయ్యారు. మూడు బాల్స్ తేడాలో ఈ ఇద్దరూ వెనుదిరగడంతో ఇండియా 63/3తో కష్టాల్లో పడింది.
ఈ టైమ్‌లో వచ్చిన రింకూ సింగ్ తన పవర్ హిట్టింగ్ షాట్స్‌తో అలరించాడు. కంగారూల బౌలింగ్‌ను ఉతికి ఆరేస్తూ రుతురాజ్‌తో నాలుగో వికెట్‌కు 48 రన్స్, జితేశ్‌తో ఐదో వికెట్‌కు 56 రన్స్ జోడించాడు. 18.3 ఓవర్లలో 167/4తో ఉన్న ఇండియాను చివర్లో ఆసీస్ బౌలర్లు దెబ్బకొట్టారు. చివరి రెండు ఓవర్లలో కేవలం 7 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీసి భారీ స్కోరుకు అడ్డుకట్ట వేశారు. అక్షర్ పటేల్ (0), దీపక్ చహర్ (0), రవి బిష్ణోయ్ (4), అవేశ్ ఖాన్ (1 నాటౌట్) నిరాశపర్చారు. బెన్ డ్వారిష 3, తన్వీర్ సంగా, బెరెన్‌డార్ఫ్ చెరో 2 వికెట్లు తీశారు.
బౌలర్లు సూపర్..
టార్గెట్ ఛేజింగ్‌లో ఆసీస్‌ను ఇండియా బౌలర్లు అద్భుతంగా నిలువరించారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ మెరుపు ఆరంభాన్నిచ్చినా అక్షర్ పటేల్ టాపార్డర్‌ను దెబ్బకొట్టాడు. నాలుగో ఓవర్‌లో జోష్ ఫిలిప్స్ (8)ను రవి బిష్ణోయ్ (1/17) ఔట్ చేయగా, అక్షర్ వరుస ఓవర్లలో హెడ్, ఆరోన్ హార్డీ (8)ని వెనక్కి పంపాడు. దీంతో పవర్‌ప్లేలో కంగారూలు 52/3 స్కోరుతో ఎదురీత మొదలుపెట్టారు. ఇక్కడి నుంచి బెన్ మెక్‌డెర్మాట్ (19), టిమ్ డేవిడ్ (19) ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేసినా పేసర్లు దీపక్, అవేశ్ ఖాన్ (1/33) అడ్డుకున్నారు. నాలుగో వికెట్‌కు 35 రన్స్ జోడించిన మెక్‌డెర్మాట్‌ను 12వ ఓవర్‌లో అక్షర్ పెవిలియన్‌కు పంపడంతో ఆసీస్ 87/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో డేవిడ్, షార్ట్, మాథ్యూ వేడ్ మెరుగ్గా ఆడే ప్రయత్నం చేశారు. అయితే 15, 17వ ఓవర్‌లో దీపక్.. డేవిడ్, షార్ట్‌ను ఔట్ చేయడంతో కంగారూలు 126/6తో వెనుకబడింది. చివరి వరకు నిలబడిన వేడ్ భారీ షాట్లతో రెచ్చిపోయినా ఓవర్లు పూర్తవడంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. ఇండియాకు వరుసగా ఇది ఐదో టీ20 సిరీస్ విజయం కావడం విశేషం.
స్టేడియంలో కరెంటు తిప్పలు..
ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ స్టేడియానికి కరెంట్ కష్టాలు వచ్చాయి. 2018 నుంచి కరెంట్ బిల్లు (రూ. 3.16 కోట్లు) చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు గతంలోనే కనెక్షన్లు తొలగించారు. దీంతో ఉన్న ఫళంగా రూ. 10 లక్షలు డిపాజిట్ చేసి మ్యాచ్ టైమ్‌కు టెంపరరీ కనెక్షన్‌ను తీసుకున్నారు. ఆటకు రెండు గంటల ముందు వరకు పలు గ్యాలరీల్లో కరెంట్ లేకపోవడం గమనార్హం.
వరల్డ్ రికార్డు విక్టరీ
టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన టీమ్‌గా ఇండియా వరల్డ్ రికార్డు సృష్టించింది. 213 మ్యాచ్‌ల్లో 136వ విజయంతో పాకిస్తాన్ (135) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా : 20 ఓవర్లలో 174/9 (రింకూ సింగ్ 46, యశస్వి 37, జితేశ్ 35, బెన్ డ్వారిషస్ 3/40).
ఆస్ట్రేలియా : 20 ఓవర్లలో 154/7 (మాథ్యూ వేడ్ 36*, ట్రావిస్ హెడ్ 31, అక్షర్ పటేల్ 3/16).