
- రాణించిన కోహ్లీ, షమీ.. సెమీస్‌లో 4 వికెట్లతో ఆస్ట్రేలియాపై గెలుపు..
- వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కంగారూ టీమ్‌పై ప్రతీకారం
ముచ్చటగా మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాలన్న లక్ష్యంతో దూసుకెళ్తున్న టీమిండియా అందులో అత్యంత కీలకమైన అంకాన్ని.. అతి పెద్ద అడ్డును దాటేసింది. మహ్మద్ షమీ నేతృత్వంలోని బౌలర్లకు తోడు కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ చూపెట్టిన వేళ ఐసీసీ టోర్నమెంట్ల నాకౌట్ రౌండ్లలో తమకు కొరకరాని కొయ్యగా మారిన ఆస్ట్రేలియా జట్టును సెమీఫైనల్లో చిత్తుగా ఓడించి ఆఖరాటకు చేరుకుంది. స్వదేశంలో గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో తమకు గుండెకోతను మిగిల్చిన కంగారూ టీమ్‌పై కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. 2011 తర్వాత ఐసీసీ టోర్నీ నాకౌట్ రౌండ్‌లో తొలిసారి ఆసీస్ అంతుచూసి చాంపియన్స్ ట్రోఫీలో రికార్డు స్థాయిలో ఐదోసారి ఫైనల్లో అడుగు పెట్టింది. ఇదే జోరును ఆదివారం జరిగే ఫైనల్లోనూ కొనసాగిస్తే.. రోహిత్‌సేన చేతికి మరో ట్రోఫీ చిక్కడం పక్కా!
దుబాయ్: ఛేజ్ కింగ్ విరాట్ కోహ్లీ (98 బాల్స్‌లో 5 ఫోర్లతో 84) మరోసారి మాస్టర్ క్లాస్ ఆట చూపెట్టడంతో చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఐదోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. అతనికి తోడు శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్ (42 నాటౌట్) అండగా నిలవడంతో.. మంగళవారం జరిగిన తొలి సెమీస్‌లో ఇండియా 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. తొలుత ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 రన్స్‌కు ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (96 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 73), అలెక్స్ క్యారీ (57 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 61) రాణించారు.
ఇండియా బౌలర్లలో మహ్మద్ షమీ (3/48) మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం కోహ్లీ జోరుతో ఇండియా 48.1 ఓవర్లలో 267/6 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. విరాట్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. బుధవారం న్యూజిలాండ్, సౌతాఫ్రికా మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం ఇదే గ్రౌండ్‌లో ఇండియా తుదిపోరులో అమీతుమీ తేల్చుకోనుంది.
ఆదుకున్న స్మిత్, క్యారీ
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ భారీ స్కోరు చేయకుండా ఇండియా బౌలర్లు నిలువరించారు. ఇన్నింగ్స్ తొలి బాల్‌కే ట్రావిస్ హెడ్ (39) క్యాచ్‌ను వదిలేసిన షమీ.. మూడో ఓవర్‌లో కూపర్ కనోలీ (0)ని ఔట్ చేశాడు. దీంతో 4/1 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన స్మిత్ మూడు కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. పవర్‌ప్లేలో భారీ షాట్లు ఆడిన హెడ్ రెండో వికెట్‌కు 52 రన్స్ జోడించి వరుణ్ (2/49) వేసిన 9వ ఓవర్లో గిల్‌కు క్యాచ్ ఇచ్చాడు. లబుషేన్ (29) సింగిల్స్ తీసినా జడేజా (2/40) జడ్డూ టర్నింగ్ బాల్‌కు ఎల్బీ అవడంతో మూడో వికెట్‌కు 54 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది.
జోష్ ఇంగ్లిస్ (11)ను కూడా జడ్డూ ఇబ్బందిపెట్టాడు. 27వ ఓవర్‌లో షార్ట్ లెంగ్త్ బాల్‌ను పుష్ చేయబోయి కవర్స్‌లో కోహ్లీ చేతికి చిక్కాడు. ఈ దశలో క్యారీ, స్మిత్ మెరుగ్గా ఆడారు. దాదాపు 10 ఓవర్లలో మంచి రన్‌రేట్ సాధించారు. ఈ క్రమంలో స్మిత్ 68 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. అయితే క్రీజులో కుదురుకున్న స్మిత్‌ను మళ్లీ బౌలింగ్‌కు దిగిన షమీ ఫుల్ టాస్‌తో దెబ్బకొట్టాడు. క్యారీతో ఐదో వికెట్‌కు 54 రన్స్ భాగస్వామ్యం ముగిసినా ఆసీస్ 198/5తో మంచి స్థితిలోనే కనిపించింది. ఇంకా 13 ఓవర్ల ఆట మిగిలి ఉన్న టైమ్‌లో వచ్చిన మ్యాక్స్‌వెల్ (7) .. అక్షర్ (1/43) బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టాడు.
కానీ తర్వాతి బాల్‌కే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్యారీతో కలిసిన డ్వారిషస్ (19) ఏడో వికెట్‌కు 34 రన్స్ జత చేసినా.. కీలక టైమ్‌లో క్యారీ రనౌట్ కావడం, జంపా (7), ఎలీస్ (10), తన్వీర్ సంగా (1 నాటౌట్) నిరాశపర్చడంతో ఆసీస్ పూర్తి ఓవర్లు ఆడలేకపోయింది.
కోహ్లీ సూపర్..
ఛేజింగ్‌లో ఇండియాకు సరైన ఆరంభం దక్కలేదు. రెండో ఓవర్‌లో ఎలీస్ (2/49) బౌలింగ్‌లో రోహిత్ (28) ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో కనోలీ వృథా చేసినా హిట్‌మ్యాన్ దీన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఐదో ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ (8) ఔట్‌కావడంతో తొలి వికెట్‌కు 30 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. కాసేపటికే రోహిత్ వెనుదిరగడంతో ఇండియా 43/2తో ఎదురీత మొదలుపెట్టింది. ఇక్కడి నుంచి కోహ్లీ, శ్రేయస్ అద్భుతంగా ఆడారు.
ఆసీస్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటూ ఒక్కో రన్‌తో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. 53 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసిన కోహ్లీ26వ ఓవర్ లాస్ట్ బాల్‌కు ఇచ్చిన క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్ డ్రాప్ చేశాడు. కానీ తర్వాతి ఓవర్ ఫస్ట్ బాల్‌కే జంపా(2/60).. శ్రేయస్‌ను వెనక్కి పంపడంతో స్కోరు 134/3గా మారింది. కోహ్లీ, శ్రేయస్ మూడో వికెట్‌కు 91 రన్స్ జోడించారు. ఈ దశలో అక్షర్ పటేల్ (27) నిలకడగా ఆడాడు. కోహ్లీతో నాలుగో వికెట్‌కు 44 రన్స్ జత చేసి ఔటయ్యాడు.
ఈ దశలో విరాట్‌తో కలిసి రాహుల్ స్వేచ్ఛగా ఆడాడు. అవతలివైపు సెంచరీ దిశగా సాగుతున్న కోహ్లీని అనూహ్యంగా జంపా ఔట్ చేయడంతో ఐదో వికెట్‌కు 47 రన్స్ భాగస్వామ్యం బ్రేక్ అయ్యింది. 44 బాల్స్‌లో 40 రన్స్ అవసరమైన దశలో వచ్చిన హార్దిక్ (28) భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఆరో వికెట్‌కు 34 రన్స్ జోడించి ఔటయ్యాడు. చివర్లో రాహుల్ సిక్స్‌తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: 49.3 ఓవర్లలో 264 ఆలౌట్ (స్మిత్ 73, క్యారీ 61, షమీ 3/48, జడేజా 2/40)).
ఇండియా: 48.1 ఓవర్లలో 267/6 (కోహ్లీ 84, శ్రేయస్ 45, ఎలీస్ 2/49).
ఛేజింగ్ లో 8 వేల రన్స్
వన్డేల్లో టార్గెట్ ఛేజింగ్‌లో కోహ్లీ 8 వేల రన్స్ మైలురాయి దాటాడు. ఈ జాబితాలో సచిన్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. వన్డే ఛేజింగ్స్‌లో సచిన్ 8,720 రన్స్ చేశాడు.
1 అన్ని రకాల ఐసీసీ టోర్నమెంట్లలో ఫైనల్ చేరిన ఇండియా తొలి కెప్టెన్ రోహిత్. అతని కెప్టెన్సీలో 2023లో డబ్ల్యూటీసీ, వన్డే వరల్డ్ కప్, గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరిన ఇండియా చాంపియన్స్ ట్రోఫీలోనూ తుది పోరుకు వెళ్లింది.
3-0 చాంపియన్స్ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఇండియా నెగ్గింది. 1998, 2000 ఎడిషన్ క్వార్టర్స్‌లో గెలిచిన ఇండియా ఈసారి సెమీస్‌లో ఆ టీమ్‌ను ఓడించింది.
65 ఐసీసీ వన్డే టోర్నీల్లో (వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ) అత్యధికంగా 65 సిక్సర్లు కొట్టిన రోహిత్.. గేల్ (64) రికార్డును బ్రేక్ చేశాడు.
335మూడు ఫార్మాట్లలో కలిపి ఇండియా తరఫున విరాట్ అత్యధికంగా 335 క్యాచ్‌లు అందుకున్నాడు. రాహుల్ ద్రవిడ్ (334)ను దాటాడు.
11 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో రోహిత్ వరుసగా టాస్ ఓడిపోవడం ఇది 11వ సారి. వెస్టిండీస్ కెప్టెన్ బ్రియాన్ లారా వరుసగా 12 సార్లు టాస్ కోల్పోయాడు.
శివాల్కర్‌కు ఆటగాళ్ల నివాళి
సోమవారం మృతి చెందిన డొమెస్టిక్ క్రికెట్ లెజెండరీ స్పిన్నర్ పద్మాకర్ శివాల్కర్‌కు నివాళిగా టీమిండియా ప్లేయర్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. టీమిండియాలో చోటు దక్కకపోయినా డొమెస్టిక్ క్రికెట్‌లో శివాల్కర్ గొప్ప స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ముంబై తరఫున 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 589 వికెట్లు తీశాడు.