IND vs AUS: ప్రపంచకప్ ఓటమికి బదులు తీర్చుకున్నాం.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా

IND vs AUS: ప్రపంచకప్ ఓటమికి బదులు తీర్చుకున్నాం.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం(మార్చి 4) జరిగిన సెమీఫైనల్ పోరులో 4 వికెట్ల తేడాతో  ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది. ఛేదనలో భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీ(84) మరోసారి అదరగొట్టాడు. 98 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. కొహ్లీకిది 74వ వన్డే హాఫ్ సెంచరీ.

ఈ విజయంతో టీమిండియా.. 2023 వన్డే ప్రపంచకప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. అప్పుడు కంగారూలు కొట్టిన దెబ్బ అంత ఈజీగా మరిచిపోయేది కాదు. అప్పటివరకూ వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిచిన రోహిత్ సేనను ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టించి కప్ ఎగరేసుకుపోయారు. అందుకు భారత జట్టు ఇప్పుడు బదులు తీర్చుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 264 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా చేధించింది. 6 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(84), శ్రేయాస్ అయ్యర్(45), కెఎల్ రాహుల్ (42 నాటౌట్), హార్దిక్ పాండ్యా(28), రోహిత్ శర్మ(28), అక్షర్ పటేల్(27) పరుగులు చేశారు. నిజానికి కోహ్లీ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 84 పరుగుల వద్ద అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. ఆ సమయంలో కాస్త ఉత్కంఠను తలపించినా.. అప్పటికే మ్యాచ్ టీమిండియా చేతుల్లో ఉండటంతో పాండ్యా- రాహుల్ జోడి ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యానికి చేరువగా తీసుకొచ్చారు. చివరలో పాండ్యా ఔటవ్వగా.. రాహుల్ సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవ‌ర్లలో 264 ప‌రుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (73; 96 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌), అలెక్స్ కేరీ (61; 57 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌) హాఫ్ సెంచరీలు చేశారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో వీరిద్దరూ చాలా ఓపిగ్గా బ్యాటింగ్ చేశారు. మిగిలిన వారిలో ట్రావిస్ హెడ్ (39; 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్నస్ లబుషేన్ (29) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3, రవీంద్ర జడేజా 2, వరుణ్‌ చక్రవర్తి 2, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య ఒక్కో వికెట్ పడగొట్టారు.

బుధవారం(మార్చి 5) న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. ఫైనల్లో భారత్‌తో తలపడనుంది. టీమిండియా ఫైనల్ చేరింది కనుక ఫైనల్ దుబాయ్ గడ్డపైనే.