- 86 రన్స్ తేడాతో ఓడిన బంగ్లాదేశ్..2-0తో సిరీస్ టీమిండియా సొంతం
న్యూఢిల్లీ : తెలుగు బ్యాటర్ నితీశ్ కుమార్ (34 బాల్స్‌లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 74), రింకూ సింగ్ (29 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) దుమ్మురేపడంతో.. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లోనూ ఇండియా 86 రన్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. స్వదేశంలో ఇండియాకు ఇది వరుసగా 16వ సిరీస్ విజయం కావడం విశేషం. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో.. టాస్ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 221/9 స్కోరు చేసింది. హార్దిక్ పాండ్యా (32) మెరుగ్గా ఆడాడు.
రషీద్ హుస్సేన్ 3 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 135/9 స్కోరుకే పరిమితమైంది. మహ్మదుల్లా (41) టాప్ స్కోరర్. మెహిదీ హసన్ (16), పర్వేజ్ ఇమన్ (16), లిటన్ దాస్ (14)తో సహా అందరూ విఫలమయ్యారు. ఇండియా బౌలర్లలో నితీశ్, వరుణ్ చెరో రెండు వికెట్లు తీశారు. నితీశ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య శనివారం మూడో టీ20 హైదరాబాద్‌లో జరుగుతుంది.
కీలక భాగస్వామ్యం..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియాను బంగ్లా పేస్ త్రయం తన్జిమ్ హసన్ (2/50), ముస్తాఫిజుర్ (2/36), తస్కిన్ అహ్మద్ (2/16) కట్టడి చేశారు. ఫలితంగా ఓపెనర్లు సంజూ శాంసన్ (10), అభిషేక్ శర్మ (15)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ (8) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. దీంతో ఇండియా 41/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన నితీశ్, రింకూ సింగ్ బంగ్లా బౌలింగ్‌ను ఉతికి ఆరేశారు. పవర్‌ప్లేలో 45/3తో ఉన్న టీమిండియాకు భారీ స్కోరు అందించారు. లాంగాన్, లాంగాఫ్, మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్లతో రెచ్చిపోయిన నితీశ్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.
రెండో ఎండ్‌లో రింకూ కూడా బ్యాట్ ఝుళిపించాడు. రషీద్ బౌలింగ్‌లో తొలి సిక్స్‌తో జోష్‌లోకి వచ్చిన రింకూ ఉన్నంతసేపు అల్లాడించాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 108 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను పటిష్టం చేశారు. అయితే 14వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన ముస్తాఫిజుర్.. నితీశ్‌ను ఔట్ చేసి ఇన్నింగ్స్‌కు బ్రేక్‌లు వేశాడు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా అదే జోరును కంటిన్యూ చేయడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. ఈ క్రమంలో పాండ్యాతో ఐదో వికెట్‌కు 36 రన్స్ జత చేసి రింకూ వెనుదిరిగాడు.
రియాన్ పరాగ్ (15) కాసేపు అండగా నిలవడంతో ఇండియా స్కోరు రెండొందలు దాటింది. చివర్లో భారీ హిట్టింగ్‌కు దిగిన ఇండియా వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకుంది. 19వ ఓవర్ చివరి బాల్‌కు రింకూ ఔట్ కావడంతో ఆరో వికెట్‌కు 28 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఆఖరి ఓవర్‌లో రషీద్.. పాండ్యా, వరుణ్ చక్రవర్తి (0), అర్ష్‌దీప్ సింగ్ (6) ఔట్ చేసినా అప్పటికే ఇండియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.