పుణె: ఆల్‌రౌండ్ షోతో చెలరేగిన ఇండియా.. నాలుగో టీ20లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌లో శివమ్ దూబే (34 బాల్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53), హార్దిక్ పాండ్యా (30 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53)కు తోడు బౌలింగ్‌లో హర్షిత్ రాణా (3/33), రవి బిష్ణోయ్ (3/28) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 15 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌పై నెగ్గింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే 3–1తో సొంతం చేసుకుంది.టాస్ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 181/9 స్కోరు చేసింది. రింకూ సింగ్ (30), అభిషేక్ శర్మ (29) ఫర్వాలేదనిపించారు. తర్వాత ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 రన్స్‌కే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ (51) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. దూబేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఐదో టీ20 ఆదివారం ముంబైలో జరుగుతుంది.
టాప్ ఫెయిల్.. ఆదుకున్న దూబే, పాండ్యా
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియాను రెండో ఓవర్‌లోనే సకీబ్ మహ్ముద్ (3/35) దెబ్బకొట్టాడు. ఆరు బాల్స్ తేడాలో శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ (0)ను ఔట్ చేశాడు. 12/3 స్కోరు వద్ద వచ్చిన రింకూ 3 ఫోర్లు, ఓ సిక్స్ కొట్టడంతో పవర్‌ప్లేలో ఇండియా 47/3 స్కోరు చేసింది. 8వ ఓవర్‌లో ఆదిల్ రషీద్ (1/35).. అభిషేక్ వికెట్ తీయడంతో నాలుగో వికెట్‌కు 45 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. తర్వాతి రెండు ఓవర్లలో ఆర్చర్, రషీద్ రన్స్ కట్టడి చేశారు. దీంతో ఫస్ట్ టెన్‌లో ఇండియా 72/4తో నిలిచింది. 11వ ఓవర్‌లో రింకూను కార్సీ (1/39) ఔట్ చేయడంతో స్కోరు 79/5గా మారింది. ఈ దశలో హార్దిక్, దూబే మెరుపు బ్యాటింగ్ చేశారు.14వ ఓవర్‌లో దూబే 4, 6 కొడితే.. 16, 17వ ఓవర్లలో పాండ్యా మూడు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో రెచ్చిపోయాడు.18వ ఓవర్‌లో 5 నోబాల్స్, ఓ సిక్స్‌తో పాండ్యా 27 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసి ఒవర్టన్ (2/32)కు వికెట్ ఇచ్చాడు. ఆరో వికెట్‌కు 87 రన్స్ జతయ్యాయి. చివర్లో దూబే రెండు ఫోర్లతో 31 బాల్స్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆఖరి ఓవర్‌లో అక్షర్ పటేల్ (5), అర్ష్‌దీప్ (0), దూబే ఔటైనా ఇండియా మంచి టార్గెట్‌ను ఉంచింది.
బ్రూక్ ఒక్కడే..
ఛేజింగ్‌లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (23), డకెట్ (39) తొలి వికెట్‌కు 62 రన్స్ జోడించి ఇంగ్లండ్‌కు మంచి ఆరంభాన్నిచ్చారు. కానీ మధ్యలో అక్షర్ (1/26), రవి బిష్ణోయ్ స్పిన్ దెబ్బకు 9 బాల్స్ తేడాలో ఓపెనర్లతో పాటు బట్లర్ (2) కూడా వెనుదిరగడంతో స్కోరు 67/3గా మారింది. ఈ దశలో హ్యారీ బ్రూక్ నిలకడగా ఆడినా.. రెండో ఎండ్‌లో సరైన సహకారం దక్కలేదు. దీనికి తోడు హర్షిత్ రాణా కీలక టైమ్‌లో వికెట్లు తీసి స్కోరును అడ్డుకున్నాడు. లివింగ్‌స్టోన్ (9)తో నాలుగో వికెట్‌కు 28, బెతెల్ (6)తో ఐదో వికెట్‌కు 34 రన్స్ జోడించి బ్రూక్ వెనుదిరిగాడు. ఫలితంగా స్కోరు 129/5గా మారింది. చివర్లో ఒవర్టన్ (19) ఫర్వాలేదనిపించినా అవతలి వైపు కార్సీ (0), ఆర్చర్ (0) నిరాశపర్చారు. 13 రన్స్ తేడాలో మూడు వికెట్లు పడటంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. 19వ ఓవర్‌లో ఒవర్టన్, చివరి ఓవర్‌లో సకీబ్ మహ్ముద్ (1) ఔట్ కావడంతో బట్లర్‌సేన టార్గెట్‌ను అందుకోలేకపోయింది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 181/9 (పాండ్యా 53, దూబే 53, సకీబ్ మహ్మద్ 3/35). ఇంగ్లండ్: 19.4 ఓవర్లలో 166 ఆలౌట్ (బ్రూక్ 51, బిష్ణోయ్ 3/28 హర్షిత్ రాణా 3/33, ).
కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి..
యంగ్ పేసర్ హర్షిత్ రాణా అనూహ్య పరిణామాల మధ్య ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగి టీ20 అరంగేట్రం చేయడమే కాకుండా మూడు కీలక వికెట్లతో జట్టును గెలిపించాడు. ముందుగా తుది జట్టులో రాణా పేరే లేదు. ఇండియా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఒవర్టన్ వేసిన బౌన్సర్ శివమ్ దూబే హెల్మెట్‌కు తగిలింది. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత అతను ఫీల్డింగ్‌కు దూరంగా ఉండగా.. రమణ్‌దీప్ సింగ్ సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్ చేశాడు. కానీ, ఎనిమిదో ఓవర్లో దూబేకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రాణా వచ్చాడు. 12వ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన రాణా తన రెండో బాల్‌కే డేంజర్ మ్యాన్ లివింగ్‌స్టోన్‌ను ఔట్ చేసి ఆటను టర్న్ చేశాడు. ఆపై,16వ ఓవర్లో బెతెల్‌తో పాటు దూకుడుగా ఆడుతున్న ఒవర్టన్‌ను 19వ ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా అరంగేట్రం చేసిన తొలి ప్లేయర్‌గా హర్షిత్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.