211 రన్స్ తేడాతో విక్టరీ .. జపాన్‌‌ను చిత్తు చేసిన ఇండియా

211 రన్స్ తేడాతో విక్టరీ .. జపాన్‌‌ను చిత్తు చేసిన ఇండియా

షార్జా: అండర్‌‌‌‌–19 ఆసియా కప్‌‌ తొలి పోరులో దాయాది పాకిస్తాన్‌‌ చేతిలో ఓటమి నుంచి ఇండియా కుర్రాళ్లు వెంటనే తేరుకున్నారు. కెప్టెన్‌‌ మహ్మద్‌‌ అమాన్ (118 బాల్స్‌‌లో 7 ఫోర్లతో 122 నాటౌట్‌‌) అజేయ సెంచరీతో విజృంభించడంతో సోమవారం జరిగిన గ్రూప్‌‌–ఎ మ్యాచ్‌‌లో ఇండియా ఏకంగా 211 రన్స్ తేడాతో జపాన్‌‌ను చిత్తుగా ఓడించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌కు వచ్చిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 339/6 స్కోరు చేసింది. అమాన్‌‌తో పాటు కేపీ కార్తికేయ(57), ఓపెనర్‌‌‌‌ ఆయుష్ మాత్రె (54) ఫిఫ్టీలతో సత్తా చాటారు.  సిద్దార్థ్ (35), హార్దిక్ రాజ్ (25 నాటౌట్‌‌),13 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ (23) కూడా రాణించారు. 

జపాన్ బౌలర్లలో హుగో కెల్లీ, కీఫెర్ లేక్‌‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ టార్గెట్ ఛేజింగ్‌‌కు వచ్చిన జపాన్  ఓవర్లన్నీ ఆడి 128/8 స్కోరు మాత్రమే చేసి ఓడింది. ఓపెనర్ హూగో కెల్లీ (50), చార్లెస్ హింజె (35 నాటౌట్) తప్ప మిగతా బ్యాటర్లు నిరాశ పరిచారు. ఇండియా బౌలర్లలో చేతన్ శర్మ, హార్దిక్ రాజ్‌‌, కేపీ కార్తికేయ తలో రెండు వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశారు. బుధవారం జరిగే తమ గ్రూప్‌‌ చివరి మ్యాచ్‌‌లో యూఏఈతో ఇండియా పోటీ పడనుంది. ప్రతి గ్రూప్‌‌లో టాప్‌‌–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌‌కు అర్హత సాధిస్తాయి.