జొహర్ బారు (మలేసియా) : సుల్తాన్ ఆఫ్ జొహార్ కప్‌లో ఇండియా హాకీ జట్టు కాంస్యంతో మెరిసింది. శనివారం జరిగిన కాంస్య పతక పోరులో ఇండియా పెనాల్టీ షూటౌట్లో 3–2తో న్యూజిలాండ్‌పై గెలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన షూటౌట్లో స్ట్రయికర్ గుర్జోత్ సింగ్, మన్మీత్ సింగ్, సౌరభ్ ఆనంద్ కుష్వా పెనాల్టీలను గోల్స్‌గా మలిచారు. గోల్ కీపర్ బిక్రమ్‌జీత్ కివీస్ ప్లేయర్లు కొట్టిన మూడు పెనాల్టీలను అద్భుతంగా అడ్డుకున్నాడు.
అంతకుముందు నిర్ణీత సమయంలో ఇరు జట్లూ 2–2తో సమంగా నిలిచాయి. ఇండియా తరఫున దిల్‌రాజ్ సింగ్ (11వ ని), మన్మీత్ (20వ ని) గోల్స్ చేయగా, ఓవెన్ బ్రౌన్ (51వ ని), జాంటీ ఎల్మిస్ (57వ ని) కివీస్‌కు గోల్స్ అందించారు. జపాన్, మలేసియాకు గోల్డ్, సిల్వర్ లభించాయి.