- ఫైనల్లో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై గెలుపు
- చెలరేగిన కోహ్లీ, అక్షర్, హార్దిక్
- క్లాసెన్, డికాక్ పోరాటం వృథా
7 నెలల కిందటి గాయం మానింది..13 ఏండ్ల పోరాటం ఫలించింది.. 17 ఏండ్ల కిందట దక్కిన తొలి పొట్టి కప్ మరోసారి ఒళ్లో వాలింది..! తృటిలో వన్డే వరల్డ్ కప్ చేజారిపోయిందని బాధపడిన సగటు అభిమాని ఆవేదన ఎట్టకేలకు తీరింది..!అప్పుడెప్పుడో 2011లో వరల్డ్ కప్ నెగ్గి ధోనీసేన ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించినా దొరకని మెగా ట్రోఫీని ఎట్టకేలకు రోహిత్ బృందం సగర్వంగా అందుకుంది..! నెగ్గిన కప్‌లో తేడా ఉండొచ్చేమో గానీ.. టీమిండియా ఆట మాత్రం సేమ్ టు సేమ్..! ఆస్ట్రేలియా అహం అణిచాం.. ఇంగ్లండ్‌ను ఇరగదీశాం.. చివర్లో సౌతాఫ్రికా బెట్టు చేసినా ఆఖర్లో అద్భుతం చేసిన మన బౌలర్లు నాలుగో వరల్డ్ కప్‌తో త్రివర్ణాన్ని రెపరెపలాడించారు..! ఫలితంగా జయహో టీమిండియా.. అంటూ అభిమానుల జయజయ ధ్వానాల మధ్య సగటు భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగి పోయింది..! ఈ సంతోషాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించకముందే కింగ్ కోహ్లీ టీ20లకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించి అభిమానులకు కాస్త నిరాశ కలిగించాడు..!
టీమిండియా కల నిజమైంది. 13 ఏండ్ల నిరీక్షణకు తెర పడింది. అసాధారణ పోరాటానికి ఫలితం దక్కింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని మన జట్టు మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని గెలిచింది. వెస్టిండీస్ గడ్డపై తిరుగులేని ఆటతో టీ20 వరల్డ్ కప్‌లో రెండోసారి విజేతగా నిలిచింది. విశ్వ వేదికపై మన మువ్వన్నెల జెండా రెపరెపలాడించింది. తన చివరి ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లో కింగ్ విరాట్ కోహ్లీ (76) బ్యాట్‌తో మెరిపించగా.. బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా (3/20), జస్‌ప్రీత్ బుమ్రా (2/18), అర్ష్‌దీప్ సింగ్ (2/20) మురిపించగా.. శనివారం జరిగిన టైటిల్ ఫైట్‌లో సౌతాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత ఇండియా 20 ఓవర్లలో 176/7 స్కోరు చేయగా.. ఛేజింగ్‌లో సౌతాఫ్రికా 169/8 స్కోరు మాత్రమే చేసి ఓడిపోయింది. విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, జస్‌ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డులు లభించాయి. ఇండియాకు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ దిగ్గజాలు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ సరసన నిలిచాడు.
బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): టీ20 వరల్డ్ కప్ టీమిండియా మహాద్భుతం చేసింది. దాదాపుగా చేజారిపోయిన మ్యాచ్‌ను ఆఖర్లో అత్యద్భుతంగా ఒడిసి పట్టింది. లాస్ట్ ఓవర్ వరకు థ్రిల్లింగ్‌గా సాగిన హై ఓల్టేజ్ టైటిల్ ఫైట్‌లో సూర్య కుమార్ సూపర్ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పితే.. హార్దిక్ పాండ్యా (3/20) తనదైన బౌలింగ్‌తో ఏకంగా కప్‌నే పట్టేశాడు. దీంతో శనివారం జరిగిన ఫైనల్లో ఇండియా 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై గెలిచింది. విరాట్ కోహ్లీ (59 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76), అక్షర్ పటేల్ (31 బాల్స్‌లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 47) దంచికొట్టిన వేళ.. టాస్ గెలిచిన ఇండియా 20 ఓవర్లలో 176/7 స్కోరు చేసింది. తర్వాత సౌతాఫ్రికా 20 ఓవర్లలో 169/8 స్కోరుకే పరిమితమైంది. క్లాసెన్ (27 బాల్స్‌లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52) టాప్ స్కోరర్. డికాక్ (39) రాణించాడు. కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు లభించాయి.
‘టాప్’ ఫెయిలైనా..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియా టాప్ ఆర్డర్‌లో కోహ్లీ మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. తొలి ఓవర్‌లోనే కోహ్లీ మూడు ఫోర్లతో దూకుడు చూపెట్టినా.. రెండో ఎండ్‌లో వరుస విరామాల్లో వికెట్లు పడ్డాయి. రెండో ఓవర్‌లో కేశవ్ మహారాజ్ (2/23) వరుస బాల్స్‌లో రోహిత్ (9), రిషబ్ పంత్ (0)ను ఔట్ చేసి షాకిచ్చాడు. ఇద్దరూ స్వీప్ చేయబోయి ఔటయ్యారు. దీంతో ఇండియా 23/2తో కష్టాల్లో పడింది. సింగిల్స్‌తో కుదురుకునే ప్రయత్నం చేసిన సూర్యకుమార్ (3)ను ఐదో ఓవర్‌లో రబాడ (1/36) పెవిలియన్‌కు పంపడంతో పవర్ ప్లేలో ఇండియా 45/3 స్కోరుకే పరిమితమైంది.
ఈ దశలో వచ్చిన అక్షర్ పటేల్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ నెమ్మదించినా.. అతను సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఫలితంగా ఫస్ట్ టెన్‌లో స్కోరు 75/3కి పెరిగింది. 11వ ఓవర్ నుంచి ఎక్కువగా స్ట్రయిక్ చేసిన అక్షర్.. రబాడ, షంసిని టార్గెట్ చేసి మళ్లీ సిక్సర్లు బాదాడు. కానీ 14వ ఓవర్‌లో అనూహ్యంగా రనౌట్ కావడంతో నాలుగో వికెట్‌కు 72 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. 48 బాల్స్‌లో ఫిఫ్టీ కొట్టిన కోహ్లీకి శివమ్ దూబే (16 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 27) అండగా నిలిచాడు. 18వ ఓవర్‌లో 6, 4 కొట్టిన విరాట్ తర్వాతి ఓవర్‌లోనూ 4, 6 కొట్టి వెనుదిరిగాడు. దీంతో ఐదో వికెట్‌కు 57 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఇక హార్దిక్ (5 నాటౌట్) ఫోర్‌తో ఖాతా తెరిస్తే, లాస్ట్ ఓవర్‌లో అన్రిచ్ (2/26) రెండు వికెట్లు తీసి స్కోరుకు కళ్లెం వేశాడు. మూడు బాల్స్ తేడాలో దూబే, జడేజా (2)ను ఔట్ చేశాడు.
బౌలర్లు అదుర్స్..
ఛేజింగ్‌లో సౌతాఫ్రికా వణికించినా ఆఖర్లో మన బౌలర్లు అద్భుతం చేశారు. వరుస ఓవర్లలో బుమ్రా (2/18), అర్ష్‌దీప్ (2/20).. హెండ్రిక్స్ (4), మార్‌క్రమ్ (4)ను ఔట్ చేశారు. దీంతో 12/2తో కష్టాల్లో పడిన ప్రొటీస్‌ను డికాక్, ట్రిస్టాన్ స్టబ్స్ (31) కాసేపు ఆదుకున్నారు. మూడో ఓవర్‌లో డికాక్ రెండు ఫోర్లతో స్టబ్స్ ఓ ఫోర్‌తో కుదురుకున్నారు. దీంతో పవర్‌ప్లేలో సఫారీ జట్టు 42/2 స్కోరు చేసింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత అక్షర్‌ను టార్గెట్ చేసిన స్టబ్స్ రెండు ఫోర్లు, ఓ సిక్స్ కొడితే.. డికాక్ కూడా సిక్స్ దంచాడు. కానీ 9వ ఓవర్‌లో స్టబ్స్‌ను ఔట్ చేసి అక్షర్ ప్రతీకారం తీర్చుకున్నా మూడో వికెట్‌కు 58 రన్స్ జతయ్యాయి.
దీంతో10 ఓవర్లలో ప్రొటీస్ 81/3తో మంచి స్థితిలోనే నిలిచింది. ఇక్కడి నుంచి క్లాసెన్ రెండు సిక్స్‌లతో జోరందుకున్నా.. 13వ ఓవర్‌లో అర్ష్‌దీప్.. డికాక్ వికెట్ తీసి కాస్త ఉపశమనం కలిగించాడు. నాలుగో వికెట్‌కు 36 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. మిల్లర్ (21) 4, 6తో మళ్లీ జోష్ పెరిగితే, 15వ ఓవర్‌లో క్లాసెన్ 4, 6, 6, 4తో 24 రన్స్ దంచి రెట్టింపు చేశాడు. ఇక 30 బాల్స్‌లో 30 రన్స్ కావాల్సిన టైమ్‌లో హార్దిక్.. క్లాసెన్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. తర్వాతి ఓవర్‌లో బుమ్రా వేసిన యార్కర్‌కు జెన్‌సెన్ (2) క్లీన్ బౌల్డ్ కావడం మ్యాచ్‌కే హైలెట్. ఇక12 బాల్స్‌లో 20 రన్స్ అవసరం కాగా అర్ష్‌దీప్ 4 రన్సే ఇవ్వగా, లాస్ట్ ఓవర్‌లో సూర్య అద్భుతం చేశాడు. హార్దిక్ బాల్‌ను మిల్లర్ భారీ షాట్ కొడితే బౌండ్రీ లైన్ వద్ద సూర్య పట్టిన క్యాచ్ టోర్నీకే సూపర్ హైలైట్. రబాడ (4) ఫోర్ కొట్టినా ఐదో బాల్‌కు ఔట్‌కావడంతో కప్ ఇండియా సొంతమైంది.
కప్పు తెచ్చిన క్యాచ్
- హార్దిక్ వేసిన చివరి ఓవర్ తొలి బాల్‌కు క్లాసెన్ ఇచ్చిన క్యాచ్‌ను సూర్య బౌండ్రీలైన్ వద్ద తన బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ అందుకున్నాడు. తను క్యాచ్ మిస్ చేస్తే ఆ బాల్ సిక్స్‌గా వెళ్లేది.
- టీ20 వరల్డ్ కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ట్రోఫీ నెగ్గిన తొలి టీమ్ ఇండియా. ఒక ఎడిషన్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్లుగా ఇండియా, సౌతాఫ్రికా (8) నిలిచాయి.
- 20 వరల్డ్ కప్‌లో రెండుసార్లు నెగ్గిన మూడో జట్టు ఇండియా. వెస్టిండీస్ (2012, 2016), ఇంగ్లండ్ (2010, 2022) ముందున్నాయి.
- టీమిండియాకు ఇది ఆరో ఐసీసీ ట్రోఫీ. రెండు వన్డే వరల్డ్ కప్స్ (1983, 2011), రెండు చాంపియన్స్ ట్రోఫీలు (2002, 2013), రెండు టీ20 వరల్డ్ కప్స్ (2007, 2024) గెలిచింది.
- టీ20ల్లో కోహ్లీ అందుకున్న ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు ఈ ఫార్మాట్‌లో అత్యధికం. సూర్యకుమార్ (15)ను వెనక్కునెట్టాడు.
50
- టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా రోహిత్ విజయాలు. 48 విజయాలతో బాబర్ ఆజమ్ రెండో ప్లేస్‌లో ఉన్నాడు.
- ఇండియాకు వరల్డ్ కప్ అందించిన మూడో కెప్టెన్ రోహిత్. 1983లో కపిల్ దేవ్, 2007, 2011లో ధోనీ టీ20, వన్డే వరల్డ్ కప్స్ అందుకున్నారు.
- టీమిండియాకు ఇది ఆరో ఐసీసీ ట్రోఫీ. రెండు వన్డే వరల్డ్ కప్స్ (1983, 2011), రెండు చాంపియన్స్ ట్రోఫీలు (2002, 2013), రెండు టీ20 వరల్డ్ కప్స్ (2007, 2024) గెలిచింది.
- టీ20ల్లో కోహ్లీ అందుకున్న ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు ఈ ఫార్మాట్‌లో అత్యధికం. సూర్యకుమార్ (15)ను వెనక్కునెట్టాడు.
- ఈ టోర్నీలో అర్ష్‌దీప్ సింగ్, అఫ్గాన్ బౌలర్ ఫజల్ హక్ ఫారూఖీ తీసిన వికెట్లు. ఓ టీ20 వరల్డ్ కప్‌లో అత్యధికం. 2021లో లంక బౌలర్ వానిందు హసరంగ 16 వికెట్లు పడగొట్టాడు.
స్కోరు బోర్డు
ఇండియా: రోహిత్ (సి) క్లాసెన్ (బి) మహారాజ్ 9, కోహ్లీ (సి) రబాడ (బి) జెన్‌సెన్ 76, పంత్ (సి) డికాక్ (బి) మహారాజ్ 0, సూర్య (సి) క్లాసెన్ (బి) రబాడ 3, అక్షర్ పటేల్ (రనౌట్) 47, శివమ్ దూబే (సి) మిల్లర్ (బి) నోర్జ్ 27, హార్దిక్ (నాటౌట్) 5, జడేజా (సి) మహారాజ్ (బి) నోర్జ్ 2, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 176/7. వికెట్లపతనం: 1–23, 2–23, 3–34, 4–106, 5–163, 6–174, 7–176. బౌలింగ్: జెన్‌సెన్ 4–0–49–1, మహారాజ్ 3–0–32–2, రబాడ 4–0–36–1, మార్‌క్రమ్ 2–0–16–0, నోర్జ్ 4–0–26–2, షంసి 3–0–26–0.
సౌతాఫ్రికా: హెండ్రిక్స్ (బి) బుమ్రా 4, డికాక్ (సి) కుల్దీప్ (బి) అర్ష్‌దీప్ 39, మార్‌క్రమ్ (సి) పంత్ (బి) అర్ష్‌దీప్ 4, స్టబ్స్ (బి) పటేల్ 31, క్లాసెన్ (సి) పంత్ (బి) పాండ్యా 52, మిల్లర్ (సి) సూర్య (బి) పాండ్యా 21, జెన్‌సెన్ (బి) బుమ్రా 2, కేశవ్ (నాటౌట్) 2, రబాడ (సి) సూర్య (బి) పాండ్యా 4, నోర్జ్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 169/8. వికెట్లపతనం: 1–7, 2–12, 3–70, 4–106, 5–151, 6–156, 7–161, 8–168. బౌలింగ్: అర్ష్‌దీప్ 4–0–20–2, బుమ్రా 4–0–18–2, అక్షర్ 4–0–49–1, కుల్దీప్ 4–0–45–0, హార్దిక్ 3–0–20–3, జడేజా 1–0–12–0.