మాలే: మాల్దీవుల నుంచి భారత బలగాలు వెనక్కి వస్తున్న ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. తాజాగా రెండో విడత కింద మన బలగాలు మాల్దీవుల నుంచి ఇండియాకు తిరిగి వచ్చాయి. వీరిలో మాల్దీవులకు భారత్ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది ఉన్నారని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు తెలిపారు. ‘‘ఇప్పటికే మొదటి బృందం వెళ్లిపోయింది. ఏప్రిల్ 9న రెండో విడతలో భాగంగా మరో సైనికుల బృందం తాజాగా వెళ్లిపోయింది. దేశంలో ఇంకో టీమ్ ఇండియన్ బలగాలు మాత్రమే ఉన్నాయి.
వారు కూడా ఇరు దేశాల ఒప్పందంలో భాగంగా మే 10 వరకు వెళ్లిపోతారు”అని మొయిజ్జు చెప్పినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, రెండో బ్యాచ్‌లో ఎంతమంది సోల్జర్లు మాల్దీవుల నుంచి వెనక్కి వచ్చారో ఆయన చెప్పలేదు. వారి స్థానంలో శిక్షణ పొందిన ఇండియన్ పౌరులను అపాయింట్ చేశారా.. లేదా అనే విషయాలపై కూడా క్లారిటీ లేదు. మాల్దీవుల ప్రభుత్వం లెక్కల ప్రకారం.. ఆ దేశంలో 88 మంది భారత సైనికులు అడ్డూ, లాము కథూలో హెలికాప్టర్లను, హనిమాధూలో ఒక డోర్నియర్ విమానాన్ని ఆపరేట్ చేయడానికి ఉన్నారు. ఇందులో మిలిటరీ హాస్పిటల్ డాక్టర్లు కూడా ఉన్నారు.