తిరువనంతపురం: ఇండియన్ యంగ్‌స్టర్స్ మరోసారి ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్ (43 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58), యశస్వి జైస్వాల్ (25 బాల్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53), ఇషాన్ కిషన్ (32 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52), రింకూ సింగ్ (9 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) దంచికొట్టడంతో.. ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 44 రన్స్ తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇండియా 2–0 లీడ్‌లో నిలిచింది. టాస్ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 235/4 స్కోరు చేసింది. తర్వాత ఆసీస్ 20 ఓవర్లలో 191/9 స్కోరు చేసింది. స్టోయినిస్ (25 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45), మాథ్యూ వేడ్ (42 నాటౌట్), టిమ్ డేవిడ్ (37) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. యశస్వికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మంగళవారం గువాహటిలో మూడో టీ20 జరుగుతుంది.
దంచుడే.. దంచుడు..
మంచు ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని వేడ్ బౌలింగ్ ఎంచుకోగా అది తప్పని ఇండియన్ బ్యాటర్లు నిరూపించారు. క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరు భారీ షాట్లతో అల్లాడించారు. ఆరంభంలో యశస్వి జోరు చూపిస్తే.. రుతురాజ్ చివరి వరకు క్రీజులో ఉండి భారీ టార్గెట్‌ను నిర్దేశించాడు. మధ్యలో ఇషాన్, రింకూ సింగ్ అదరగొట్టారు. థర్డ్ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన యశస్వి తర్వాతి ఓవర్‌లో 4, 4, 4, 6, 6తో 24 రన్స్ దంచాడు. ఆ వెంటనే మరో నాలుగు ఫోర్లు కొట్టి 24 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. కానీ ఆరో ఓవర్ ఐదో బాల్‌కు ఎలిస్ (3/45) బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి జైస్వాల్ ఔట్ కావడంతో తొలి వికెట్‌కు 77 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. రుతురాజ్‌తో కలిసి ఇషాన్ కూడా భారీ షాట్లకే మొగ్గడంతో ఫస్ట్ టెన్‌లో ఇండియా 101/1 స్కోరు చేసింది. 12వ ఓవర్‌లో తొలి సిక్స్‌తో బ్యాట్ ఝుళిపించిన ఇషాన్ తర్వాతి ఓవర్‌లో 6, 4తో జోరందుకున్నాడు. ఇదే ఓవర్‌లో రుతురాజ్ కూడా సిక్స్ కొట్టడంతో 23 రన్స్ వచ్చాయి. 15వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు కొట్టిన ఇషాన్ 29 బాల్స్‌లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 16వ ఓవర్‌లో స్టోయినిస్ (1/27) ఇషాన్‌ను ఔట్ చేయడంతో రెండో వికెట్‌కు 87 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఎదుర్కొన్న తొలి బాల్‌ను సిక్స్‌గా మలిచిన సూర్య (19) మరో సిక్స్ కొట్టి ఔటయ్యాడు. 39 బాల్స్‌లో ఫిఫ్టీ చేసిన రుతురాజ్‌తో కలిసి రింకూ సింగ్ ఊచకోత కోశాడు. 19వ ఓవర్‌లో 4, 6, 4, 4, 6తో 25 రన్స్ దంచాడు. 20వ ఓవర్ ఫస్ట్ బాల్‌ను సిక్స్‌గా మలిచి రుతురాజ్ ఔటైనా, తిలక్ వర్మ (7 నాటౌట్) సిక్స్, రింకూ ఫోర్‌తో భారీ టార్గెట్‌ను నిర్దేశించారు.
బిష్ణోయ్ మ్యాజిక్..
భారీ ఛేజింగ్‌కు దిగిన ఆసీస్‌ను స్పిన్నర్ రవి బిష్ణోయ్ (3/32) దెబ్బకొట్టాడు. మూడు, ఐదో ఓవర్‌లో షార్ట్ (19), ఇంగ్లిస్ (2)ను ఔట్ చేసి ఇన్నింగ్స్‌కు బ్రేక్‌లు వేశాడు. స్మిత్ (19), మ్యాక్స్‌వెల్ (12) దూకుడుకు ప్రసిధ్ (3/41), అక్షర్ పటేల్ (1/25) అడ్డుకట్ట వేయడంతో ఆసీస్ 58 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి ఎదురీత మొదలుపెట్టింది. ఇక్కడి నుంచి స్టోయినిస్, టిమ్ డేవిడ్ ఇన్నింగ్స్‌ను బాగు చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇండియా పేస్–స్పిన్ కాంబినేషన్ దీటుగా ఎదుర్కొంటూ సిక్సర్లు బాదారు. పవర్‌ప్లేలో 53/3తో ఉన్న స్కోరును తొలి 10 ఓవర్లలో 104/4కు చేర్చారు. 11వ ఓవర్‌లో డేవిడ్ సిక్స్ కొడితే, 12వ ఓవర్‌లో స్టోయినిస్ 6, 6, 4 బాదాడు. అయితే 14వ ఓవర్‌లో డేవిడ్‌ను ఔట్ చేసి బిష్ణోయ్ మళ్లీ బ్రేక్ ఇచ్చాడు. 15వ ఓవర్‌లో ముకేశ్ (1/43).. స్టోయినిస్‌ను ఔట్ చేయడంతో ఐదో వికెట్‌కు 81 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. 16వ ఓవర్‌లో ప్రసిధ్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఓ ఎండ్‌లో వేడ్ నిలకడగా ఆడినా.. ఆరు బాల్స్ తేడాలో సీన్ అబాట్(1), నేథన్ ఎలిస్ (1)ను ఔట్ చేసి మ్యాచ్‌ను ఇండియా వైపు తిప్పాడు. 17వ ఓవర్‌లో అర్ష్‌దీప్.. జంపా (1)ను వెనక్కి పంపగా, చివర్లో వేడ్ 4 సిక్స్‌లు, ఓ ఫోర్ కొట్టినా ఆసీస్‌ను గెలిపించలేకపోయాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 235/4 (రుతురాజ్ 58, యశస్వి 53, ఇషాన్ 52, నేథన్ ఎలిస్ 3/45). ఆస్ట్రేలియా: 20 ఓవర్లలో 191/9 (స్టోయినిస్ 45, వేడ్ 42*, టిమ్ డేవిడ్ 37, ప్రసిధ్ 3/41, రవి బిష్ణోయ్ 3/32).