- బీజేపీకి 370 పైబడి సీట్లు రావొద్దని ప్రయత్నిస్తోంది : మోదీ
- చాలాస్థానాల్లో కాంగ్రెస్‌పార్టీకి అభ్యర్థులే దొరకట్లేదు
- అవినీతిపరులను కాపాడేందుకు కాంగ్రెస్ ర్యాలీలు తీస్తోందని ఫైర్
- యూపీ, రాజస్థాన్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ
సహారన్పూర్(యూపీ): అధికారంలోకి వస్తే కమీషన్లు సంపాదించాలని ఇండియా కూటమి లక్ష్యంగా పెట్టుకున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఇండియా కూటమి అంటే కమీషన్.. ఎన్డీఏ అంటే మిషన్ అని భాష్యం చెప్పారు. బీజేపీ 370 ఎంపీ స్థానాలు దాటకుండా అడ్డుకోవాలని మాత్రమే ఇండియా కూటమి పోరాడుతోందని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన యూపీలోని సహారన్పూర్, రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ‘కాంగ్రెస్.. అధికారంలో ఉన్నప్పుడు కమీషన్ల సంపాదనమీదే దృష్టిపెట్టింది. ఇప్పుడు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కమీషన్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ ఎన్డీఏ, మోదీ సర్కారు అభివృద్ధి మిషన్ కోసం పనిచేస్తున్నది’ అని వ్యాఖ్యానించారు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) గంటకో అభ్యర్థిని మారుస్తుండగా.. కాంగ్రెస్‌కు పోటీలో నిలిపేందుకు అభ్యర్థులే దొరకడంలేదని ఎద్దేవా చేశారు. స్వాతంత్రోద్యమ సమయంలో ముస్లిం లీగ్ ఆలోచనలను నేటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రతిబింబిస్తోందని చెప్పారు. మహాత్మా గాంధీలాంటి ఎందరో మహానుభావులు కాంగ్రెస్‌తో అనుబంధం కలిగి ఉన్నారని, కానీ ఆ కాంగ్రెస్ ఆనాడే అంతరించిపోయిందని చెప్పారు. నేటి కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రయోజనాలకు సంబంధించిన విధానాలు, దేశాభివృద్ధికి సంబంధించిన దృక్పథాలు లేవని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తే దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలనుంచి ఆ పార్టీ పూర్తిగా దూరమైనట్టు కనిపిస్తోందని అన్నారు.
అస్థిరత, అనిశ్చితికి పర్యాయపదం ఆ కూటమి..
అస్థిరత, అనిశ్చితికి పర్యాయపదంగా ఇండియా కూటమి మారిందని ప్రధాని మోదీ విమర్శించారు. ఆ కూటమిని దేశప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. ‘శక్తి’కి వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిపక్ష కూటమి అనుకోవడం దేశ దౌర్భాగ్యమని మండిపడ్డారు. ‘యూపీలో గత ఎన్నికల్లో ఇద్దరు బాయ్స్ నటించిన సినిమా ప్లాఫ్ అయ్యింది. ఆ సినిమానే ఈసారి కూడా రిలీజ్ చేస్తున్నారు. చెక్కతో చేసిన కుండను ఎన్నిసార్లు పొయ్యి మీద పెడతారు’ అని అఖిలేశ్, రాహుల్‌గాంధీలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు.
మాదే నిజమైన లౌకికవాదం
కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే నిజమైన లౌకికవాదమని, బీజేపీ పాలనలో అదే జరుగుతోందని మోదీ తెలిపారు. శతాబ్దాలుగా తమ మెడలపై వేలాడుతున్న కత్తిలాంటి ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని తొలగించినందుకు ముస్లిం మహిళలు తనను ఆశీర్వదించారని తెలిపారు.
అవినీతిపరులను కోసం ‘ఇండియా’ ర్యాలీ
దేశంలో దోపిడీ దుకాణాన్ని బీజేపీ మూసివేయడంతో కాంగ్రెస్ పార్టీ భయాందోళనకు గురవుతోందని ప్రధాని మోదీ విమర్శించారు. అందుకే ఎన్నికల్లో గెలిచేందుకు కాకుండా.. అవినీతిపరులను కాపాడేందుకు కాంగ్రెస్ ర్యాలీలు తీస్తున్నదని అన్నారు. ఆ పార్టీ సిద్ధాంతాలు, విధానాలను గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. ‘కాంగ్రెస్ ఉన్నచోట అభివృద్ధి ఉండదు. పేదలు, యువత, బడుగు, బలహీనవర్గాల గురించి ఆ పార్టీ ఆలోచించదు. ప్రజల సొమ్మును దోచుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంది. ఆ పార్టీ రోగానికి నేను శాశ్వత చికిత్స చేశా’ అని వ్యాఖ్యానించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో అవినీతికి వ్యతిరేకంగా చాలా పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు ప్రధాని చెప్పారు. రాబోయే వందేండ్ల దేశ భవిష్యత్తును నిర్ణయించేందుకు 2024 ఎన్నికలు ప్రజలకు మంచి అవకాశమని మోదీ తెలిపారు.
ప్రజలను కష్టాలను తీర్చడమే మోదీ గ్యారంటీ
సింగ్రౌలి: ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించడమే ప్రధాని మోదీ గ్యారంటీ అని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ప్రతిపక్షం మాత్రం విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని చెప్పారు. శనివారం రాజ్ నాథ్ సింగ్ మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. “ప్రధాని మోదీ నిజం మాట్లాడుతారు. ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించడమే మోదీ గ్యారంటీ. భారతీయ జనసంఘ్ కాలం నుంచి మేం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నెరవేరుస్తుంది. రామ మందిరం నిర్మిస్తామని చెప్పినప్పుడు అందరు మమ్మల్ని ఎగతాళి చేశారు. కానీ, మేం దానిని నిర్మించాం. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేశాం. ప్రతిపక్షం మాత్రం విద్వేషం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రజలను పరిపాలించదు, వారికి సేవ చేస్తుందని రాజ్ నాథ్ వెల్లడించారు.