అదానీ ముడుపులపై ఎంపీల ఆందోళన

అదానీ ముడుపులపై ఎంపీల ఆందోళన
  • జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్​
  • ‘మోదీ– అదానీ’ బొమ్మలున్న సంచులతో పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శన
  • రాహుల్​తో కలిసి నిరసనలో పాల్గొన్న ఎంపీలు గడ్డం వంశీ, చామల, మల్లు, అనిల్

న్యూఢిల్లీ, వెలుగు: అదానీ ముడుపుల వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో విచారణ జరిపించాలని ఇండియా కూటమి పార్టీలు డిమాండ్​ చేశాయి. ఈ మేరకు మంగళవారం ఐదోరోజు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనను కొనసాగించాయి. పార్లమెంట్ మకర ద్వార్ మెట్ల ముందు ‘మోదీ– అదానీ’ బొమ్మలతో కూడిన సంచులతో నిరసన చేపట్టారు.

లోక్‌‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక, కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్  ఎంపీలు గడ్డం వంశీ కృష్ణ, అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, ఇతర కూటమి పార్టీల ఎంపీలు ఆందోళనలో పాల్గొన్నారు. మోదీ– అదానీ కుమ్మక్కయ్యారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  

ఎంపీలకు రాహుల్ దిశా నిర్దేశం

నిరసన కార్యక్రమానికి ముందు పార్లమెంట్ ఎనెక్స్ లో కాంగ్రెస్ ఎంపీలకు రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేశారు. అదానీ ముడుపుల వ్యవహారం, మణిపూర్ అల్లర్లు, సంభాల్ హింసాత్మక ఘటన, ఢిల్లీలో కాల్పులు, ఈ సమావేశాల్లో తీసుకు రాబోయే బిల్లులపై అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు.

అరగంట పాటు సాగిన ఈ భేటీలో ప్రియాంక, పార్టీ సీనియర్ ఎంపీలతోపాటు తెలంగాణ ఎంపీలు గడ్డం వంశీ కృష్ణ, అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. మీటింగ్ తర్వాత కూటమి పార్టీల ఎంపీలంతా ర్యాలీగా మకర ద్వార్​ వద్దకు చేరుకుని నిరసనలో పాల్గొన్నారు. 

సభ సాగకుండా ఎన్డీఏ సర్కార్ కుట్ర: తెలంగాణ ఎంపీలు

ఎన్డీఏ సర్కార్ కు పార్లమెంట్ ను సజావుగా నడిపించాలనే ఉద్దేశం లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అదానీ ముడుపుల వ్యవహారం, సంభాల్ అంశాలపై చర్చ నుంచి ప్రణాళిక ప్రకారమే కేంద్రం తప్పించుకుంటున్నదన్నారు.  సభను నడిపించాలని కూటమి పార్టీల ఎంపీలు పట్టుబడుతుంటే కావాలనే స్పీకర్ సభను వాయిదా వేస్తున్నారన్నారు.

సభ జరిగినంత సేపు అధికార పార్టీ ఎంపీలకు అవకాశమిచ్చి, వాళ్లతో విపక్ష పార్టీల సభ్యుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే పార్లమెంట్ ను నడపడం లేదని ఎంపీ మల్లు రవి విమర్శించారు.