
జమ్మాకాశ్మీర్ పహల్గాంలో టూరిస్టులపై టెర్రరిస్టుల దాడి తర్వాత మోదీ ప్రభుత్వం చాలా చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే అన్ని దౌత్య, వాణిజ్య సంబంధాలను పాకిస్తాన్ తో తెగతెంపులు చేసుకున్నది. వీసాలు రద్దు చేసింది. సరిహద్దులు మూసివేసింది. అన్నింటి కంటే ముఖ్యంగా సింధు నది నీటిని నిలిపివేసింది. అన్ని వైపుల నుంచి అష్టదిగ్భందం చేస్తున్న మోదీ ప్రభుత్వం.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. పాకిస్తాన్ దేశానికి చెందిన 16 యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ పై నిషేధం విధించింది. ఆ ఛానెల్స్ భారత్ లో కనిపించకుండా.. ఈ యూట్యూబ్ ఛానెల్స్ ప్లే కాకుండా వాటిని డీ యాక్టివేట్ చేసింది. ఇందులో పాకిస్తాన్ కు చెందిన అన్ని న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి. మొత్తం 16 పాకిస్తాన్ న్యూస్ యూట్యూబ్ ఛానెల్స్ పై నిషేధం విధించటం వెనక కారణాలు ఏంటో తెలుసుకుందాం...
పహల్గాం ఉగ్రదాడితో పాక్ కు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని భావిస్తున్న భారత ప్రభుత్వం.. ఒక్కొక్క నిర్ణయంతో ఇప్పటికే పాకిస్తాన్ కు షాకిచ్చింది. అయితే లేటెస్ట్ గా పాకిస్తాన్ కు చెందిన చానల్స్, పత్రికలను బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఇండియా. ఉగ్రదాడి ఆధారంగా తప్పుడు వార్తలు ప్రచారం చేసి మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా పాక్ యూట్యూబ్ ఛానెల్స్ ప్రాపగాండా మొదలు పెట్టాయి. ఇండియా గురించి అసత్య ప్రచారాలు చేసి జనాల్లో వ్యతిరేకత తీసుకురావడం ఇందులో ముఖ్యమైన అంశం. అందేకాకుండా ఇండియన్ ఆర్మీ, భద్రతా దళాలు, ఏజెన్సీలపై లేనిపోని అసత్య ఆరోపణలతో వాటి విశ్వసనీయత తగ్గించేలా వార్తా కథనాలను ప్రచారం చేస్తు్న్నాయి.
అంతేకాకుండా అంతర్జాతీయంగా ఇండియా గురించ తప్పుడు ఆరోపణలు చేసి సానుభూతి పొందేలా పాక్ యూట్యూబ్ ఛానెల్స్ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అంతకంటే ముఖ్యంగా మతపరంగా విద్వేషవార్తలు ప్రచారం చేస్తూ జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో అల్లర్లను ప్రేరేపించేలా వ్యూహం పన్నినట్లు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందింది. దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పలు చానెల్స్ బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో Dawn News, Samaa TV, ARY News, Geo News తదితర ముఖ్యమైన ఛానెల్స్ కలిపి 16 యూట్యూబ్ ఛానెల్స్ ను బ్యాన్ చేసింది.
BBC వార్తలపై నిఘా..
బీబీసీ న్యూస్ ఛానెల్స్, వెబ్ సైట్స్ రిపోర్టింగ్, కవరేజ్, ప్రచురణలపై కూడా నిఘా పెట్టింది భారత ప్రభుత్వం. పహల్గాం ఉగ్రదాడిని ‘మిలిటెంట్స్ దాడి’ గా అభివర్ణిస్తూ బీబీసీ ప్రచురించింది. అంతేకాకుండా ‘‘కశ్మీర్ మిలిటెంట్ దాడిలో 26 మంది చనిపోయిన తర్వాత భారత వైఖరికి పాకిస్తాన్ టిట్ ఫర్ ట్యాట్ అనే గట్టి సమాధానం ఇచ్చింది’’ అని బీబీసీ వ్యాఖ్యానించింది. బీబీసీ కథనాలపై అమెరికా విదేవాంగ శాఖ తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై బీబీసీ ఇండియా హెడ్ జాకీ మార్టిన్ కు లెటర్ రాసింది. ఇక నుంచి బీబీసీ రిపోర్టింగ్ పై మానిటరింగ్ ఉంటుందని లేఖలో పేర్కొంది.