రష్యా నుంచి ఇండియా కొన్న ఆయిల్​ విలువ రూ.1.5 లక్షల కోట్లు: యూరోపియన్ సంస్థ సీఆర్‌‌‌‌ఈఏ వెల్లడి

రష్యా నుంచి ఇండియా కొన్న ఆయిల్​ విలువ రూ.1.5 లక్షల కోట్లు: యూరోపియన్ సంస్థ  సీఆర్‌‌‌‌ఈఏ వెల్లడి

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌‌–రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి రూ.1.5 లక్షల కోట్ల (112.5 బిలియన్ యూరోల) విలువైన రష్యన్ క్రూడాయిల్‌‌ను ఇండియా కొనుగోలు చేసిందని  సెంటర్ ఫర్ రీసెర్చ్‌‌ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్‌‌‌‌ (సీఆర్‌‌‌‌ఈఏ) పేర్కొంది. ఫిబ్రవరి 24, 2022 నుంచి  రష్యా ఆయిల్‌‌, గ్యాస్‌‌, బొగ్గు కోసం జరిగిన పేమెంట్స్‌‌పై రిపోర్ట్‌‌ను విడుదల చేసింది. యుద్ధం మొదలైన తర్వాత నుంచి  చూస్తే క్రూడాయిల్‌‌, గ్యాస్‌‌, బొగ్గు  వంటి ఫాజిల్ ఫ్యూయల్‌‌ను ఎగుమతి చేయడం ద్వారా 835 బిలియన్ యూరోల (రూ.79 లక్షల కోట్ల)  రెవెన్యూని రష్యా సంపాదించిందని  వివరించింది. 

ఈ రిపోర్ట్ ప్రకారం,  రష్యా నుంచి క్రూడాయిల్‌‌ను  ఎక్కువగా చైనా కొనుగోలు చేసింది. ఇందుకోసం 170 బిలియన్ యూరోలను ఖర్చు చేసింది.  గ్యాస్ కోసం 30.5 బిలియన్ యూరోలను, బొగ్గు కోసం 34.3 బిలియన్ యూరోలను ఖర్చు చేసింది. ఇండియా 205.84 బిలియన్ యూరోల విలువైన ఫాసిల్ ఫ్యూయల్‌‌ను  రష్యా నుంచి కొన్నది. ఇందులో 112.5 బిలియన్ యూరోల విలువైన క్రూడాయిల్‌‌, 13.25 బిలియన్ యూరోల విలువైన బొగ్గు ఉన్నాయి. 

ఆయిల్ కంపెనీల షేర్లు అప్‌‌..

క్రూడాయిల్ ధరలు ఆరు నెలల కనిష్టానికి పడడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీల) షేర్లు దూసుకుపోతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌‌కు 70 డాలర్ల దిగువకు పడింది. ఫలితంగా హెచ్‌‌పీసీఎల్‌‌, బీపీసీఎల్‌‌, ఐఓసీ షేర్లు గురువారం మూడున్నర శాతం వరకు పెరిగాయి. ఏవియేషన్ ఫ్యూయల్ ధరలు తగ్గడంతో స్పైస్‌‌జెట్‌‌, ఇండిగో షేర్లు లాభాల్లో కదిలాయి.  ఏషియన్ పెయింట్స్‌‌, ఇండిగో పెయింట్స్‌‌, కన్సయి నెరోలాక్‌‌ వంటి పెయింట్ కంపెనీల షేర్లు కూడా గురువారం 3 శాతం వరకు లాభపడ్డాయి. ఆయిల్ ముడిసరుకు కావడంతో  టైర్ల కంపెనీల షేర్లూ పెరిగాయి.