Under 19 Womens T20 World Cup Final: బౌలింగ్‌లో చెలరేగిన టీమిండియా.. టార్గెట్ 83 పరుగులే

Under 19 Womens T20 World Cup Final: బౌలింగ్‌లో చెలరేగిన టీమిండియా.. టార్గెట్ 83 పరుగులే

అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌‌ ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సౌతాఫ్రికాకు చుక్కలు చూపించారు. బౌలర్లందరూ సమిష్టిగా రాణించడంతో సఫారీ జట్టు కేవలం 82 పరుగులకే ఆలౌటైంది. గొంగడి త్రిష, పరునికా సిసోడియా,ఆయుషి శుక్లా,వైష్ణవి శర్మ ఇన్నింగ్స్ అంతటా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టును స్వల్ప స్కోర్ కే పరిమితం చేశారు. వరుసగా రెండో సారి అండర్ 19 వరల్డ్ కప్ గెలవడానికి భారత మహిళలకు ఇదే మంచి అవకాశం. 

వరుస విరామాల్లో వికెట్లు 

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సౌతాఫ్రికాకు ఆరంభం నుంచి షాకుల మీద షాకులు తగిలాయి. భారత బౌలర్లను వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఏ దశలోనూ కోలుకోలేపోయింది. 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన సఫారీలు.. 20 పరుగుల వద్ద మరో వికెట్ చేజార్చుకుంది. 44 పరుగులే సగం జట్టు పెవిలియన్ కు చేరగా.. 82 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.

ALSO READ : IND vs ENG: ఆ తప్పు ఏదో ఒకరోజు టీమిండియాకు శాపంలా మారుతుంది: అశ్విన్

మైకే వాన్ వూర్స్ట్ 23 పరుగులు చేసి పర్వాలేదనిపించగా.. మిగిలిన వారందరూ విఫలమయ్యారు. భారత బౌలర్లలో  గొంగడి త్రిష మూడు వికెట్లతో రాణించింది. పరునికా సిసోడియా,ఆయుషి శుక్లా తలో రెండు వికెట్లు తీసుకోవడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ టోర్నీలో హ్యాట్రిక్ తో మెరిసిన వైష్ణవి శర్మకు రెండు వికెట్లు దక్కాయి.