కోటి రూపాయలు, SUV కారు తీసుకురా..: కట్నం కోసం భార్యకు దీపక్ హుడా వేధింపులు

కోటి రూపాయలు, SUV కారు తీసుకురా..:  కట్నం కోసం భార్యకు దీపక్ హుడా వేధింపులు

అర్జున అవార్డు గ్రహీత, మాజీ ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ సవీతి బూరా(Saweety Boora) తన భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త, కబడ్డీ ఆటగాడు దీపక్ హుడా(Deepak Hooda).. అతని కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం తనను వేధించారని పోలీసులకు పిర్యాదు చేసింది. దాంతో, వారిపై హర్యానాలోని హిసార్‌లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది.

పెళ్ళై మూడేళ్లు.. రోజూ గొడవలు..!

ఈ జంట మొదటిసారి ఒక మారథాన్‌లో కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. మూడేళ్ల క్రితం జూలై 7, 2022న వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో సవీతి బూరా కుటుంబం.. కోటి రూపాయల నగదు, ఫార్చ్యూనర్ కారు వరుడి కుటుంబానికి బహుమతిగా ఇచ్చారు. అయినప్పటికీ, తన వైవాహిక జీవితంలో ఏనాడూ సంతోషం లేదని బూరా ఆరోపిస్తోంది. పెళ్లైన నెల రోజులకే అదనపు కట్నం కోసం భర్త వేధింపులు మొదలయ్యాయని పేర్కొంది. హుడా తనను బంధించి హింసించి, శారీరకంగా దాడి చేశాడని తెలిపింది. 

కోటి రూపాయల నగదు, ఎస్‌యూవీ(SUV) కారు కట్నంగా డిమాండ్ చేశాడని ఆరోపించింది. ఈ మేరకు భర్త దీపక్ హుడా, వదిన పూనమ్‌పై ఫిర్యాదు చేయడంతో వారిపై BNSలోని సెక్షన్ 85 కింద హర్యానాలోని హిసార్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. దీనిపై హుడాను విచారణకు పిలవగా.. అతడు హాజరు కాలేదని పోలీసులు తెలిపారు. భారత బాక్సర్.. కోర్టులో విడాకుల కేసును కూడా దాఖలు చేశారు.

ALSO READ : Pakistan Cricket: రిటైర్ అవ్వను.. మూడు వారాల్లో మళ్లీ తిరిగొస్తా..: పాకిస్తాన్ ఓపెనర్

ఎవరీ బూరా, హుడాలు..?

సవీతి బూరా భారత మాజీ బాక్సర్. ఈమె లైట్ హెవీ వెయిట్ విభాగంలో 2023 IBA మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని సాధించింది. అలాగే, 2014 AIBA మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని గెలుచుకుంది. 

ALSO READ : Champions Trophy 2025: 5 వికెట్లు, 41 పరుగులు.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు నోచుకోని ఒమర్జాయ్

ఇక హుడా విషయానికొస్తే, భారత కబడ్డీ ప్లేయర్. గతంలో భారత కబడ్డీ జట్టుకు నాయకత్వం వహించాడు. 2016లో దక్షిణాసియా క్రీడల్లో స్వర్ణం, 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత కబడ్డీ జట్టులో ఇతను సభ్యుడు. ప్రో కబడ్డీ లీగ్‌లో కూడా పాల్గొన్నాడు. అంతేకాదు, ఈ ప్లేయర్ రాజకీయ అరంగ్రేటమూ చేశాడు. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రోహ్‌తక్ జిల్లాలోని మెహం నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.