- తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా రికార్డు విక్టరీ
- బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్
పెర్త్ : స్టాండిన్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా (8/72) ముందుండి నడిపించిన వేళ కంగారూల గడ్డపై కసిగా ఆడిన టీమిండియా రికార్డు విక్టరీతో అదరగొట్టింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయాన్ని మరిపించేలా పెర్త్ గడ్డపై విజయ గర్జన చేసింది. బోర్డర్–గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో ఇండియా 295 రన్స్ తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. రన్స్ పరంగా ఆసీస్‌లో అతి పెద్ద విజయంతో చరిత్ర సృష్టించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి రావడంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో 61.11 పర్సెంటేజక్ పాయింట్లతో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది.
నాలుగో రోజు, సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో 534 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో ఆసీస్ 58.4 ఓవర్లలో 238 స్కోరుకే కుప్పకూలింది. ట్రావిస్ హెడ్ (87), మిచెల్ మార్ష్ (47) కాసేపు ప్రతిఘటించారు. బుమ్రా, సిరాజ్ చెరో మూడు వికెట్లు, సుందర్ రెండు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి ఒక్కో వికెట్ తీశారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఎనిమిది వికెట్లు తీసిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో రెండో (డే నైట్) టెస్టు జరుగుతుంది.
ప్రతిఘటన కొద్దిసేపే..
ఆదివారమే మ్యాచ్ ఇండియా చేతుల్లోకి వచ్చేయగా.. నాలుగో రోజు ట్రావిస్ హెడ్, మార్ష్ ప్రతిఘటనతో ఆసీస్ రెండు సెషన్లు పోరాడింది. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఓవర్‌నైట్ స్కోరు 12/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టును సిరాజ్ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఆట మొదలైన రెండో ఓవర్లోనే కీపర్ పంత్ క్యాచ్‌తో ఓవర్‌నైట్ బ్యాటర్ ఖవాజా (4)ను వెనక్కుపంపాడు.
ఈ దశలో స్టీవ్ స్మిత్ (17), హెడ్ క్రీజులో నిలిచే ప్రయత్నం చేశారు. కానీ, ఆఫ్ స్టంప్‌పై వేసిన లెంగ్త్ బాల్‌తో స్మిత్‌ను కూడా సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. అయితే, మార్ష్‌తో కలిసి దూకుడుగా ఆడిన హెడ్ 63 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకొని.. 104/5తో తొలి సెషన్ ముగించాడు. లంచ్ తర్వాత ఈ ఇద్దరూ ఇండియా బౌలర్లను మెరుగ్గా ఎదుర్కొన్నారు. అయితే, సెంచరీ దిశగా దూసుకెళ్తున్న హెడ్‌ను బుమ్రా ఔట్ చేయగా.. కాసేపటికే మార్ష్‌ను బౌల్డ్ చేసిన నితీశ్ రెడ్డి టెస్టుల్లో తొలి వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.
182/7తో నిలిచిన ఆసీస్ రెండో సెషన్‌లోనే ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ, అలెక్స్ క్యారీ (36), స్టార్క్ (12) ఆటను మూడో సెషన్‌కు తీసుకెళ్లారు. రెండో సెషన్ చివరి బాల్‌కు స్టార్క్‌ను ఔట్ చేసిన సుందర్ బ్రేక్ నుంచి రాగానే లైయన్ (0)ను బౌల్డ్ చేశాడు. కొద్దిసేపటికే క్యారీని హర్షిత్ స్లో బాల్‌తో బౌల్డ్ చేయడంతో ఇండియా చిరస్మరణీయ విజయం సొంతం చేసుకుంది.
1పరుగుల పరంగా ఆస్ట్రేలియాలో ఇండియాకు ఇదే అతి పెద్ద విజయం. 1977–78లో మెల్‌బోర్న్‌లో 222 రన్స్ తేడాతో ఆసీస్‌ను ఓడించిన రికార్డు మెరుగైంది.
2 తొలి ఇన్నింగ్స్‌లో 150 అంతకంటే తక్కువ స్కోరుకు ఆలౌటైన తర్వాత ఒక జట్టు సాధించిన రెండో అతి పెద్ద విజయం ఇది. 1991లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 149 రన్స్‌కు ఆలౌటైన తర్వాత వెస్టిండీస్ 343 రన్స్ తేడాతో ఆసీస్‌ను ఓడించింది.
3 విదేశాల్లో ఇండియాకు ఇది మూడో అతి పెద్ద టెస్టు విజయం. 2019లో విండీస్‌పై 318తో, 2017లో శ్రీలంకపై 304 రన్స్ తేడాతో గెలిచింది.
0 స్వదేశంలో 1970 నుంచి తొలి టెస్టులో ఓడిన తర్వాత ఆస్ట్రేలియా ఒక్కసారి కూడాసిరీస్ నెగ్గలేదు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్ : 150 ఆలౌట్; ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 104 ఆలౌట్ ; ఇండియా రెండో ఇన్నింగ్స్ : 487/6 డిక్లేర్డ్ ; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ (టార్గెట్ :534): 58.4 ఓవర్లలో 238 ఆలౌట్ (హెడ్ 89, మార్ష్ 47, బుమ్రా 3/42, సిరాజ్ 3/51)