IND vs ZIM 2024: టీమిండియా భారీ విజయం.. పాకిస్థాన్, ఆస్ట్రేలియా ఆల్‌టైం రికార్డ్ బ్రేక్

IND vs ZIM 2024: టీమిండియా భారీ విజయం.. పాకిస్థాన్, ఆస్ట్రేలియా ఆల్‌టైం రికార్డ్ బ్రేక్

జింబాబ్వే పర్యటనలో గిల్ సారధ్యంలోని టీమిండియాకు తొలి టీ20లో ఊహించని షాక్ తగిలింది. 116 పరుగుల లక్ష్య ఛేదనలో 102 పరుగులకే చేతులెత్తేశారు. దీంతో 13 పరుగుల తేడాతో ఆతిధ్య జట్టు సంచలన విజయం నమోదు చేసింది. అయితే ఆదివారం (జూలై 7) జరిగిన రెండో టీ20లో మన క్రికెట్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ లో చెలరేగి 234 పరుగులు చేశారు. ఆ తర్వాత బౌలింగ్ లోనూ రాణించి జింబాబ్వేను 134 పరుగులకే ఆలౌట్ చేసి 100 పరుగుల విజయాన్ని అందుకున్నారు.

ఈ విజయంతో భారత క్రికెట్ జట్టు ఒక రికార్డ్ తమ ఖాతాలో వేసుకున్నారు. టీ20 క్రికెట్ లో 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగులతో విజయాలు సాధించిన జట్టుగా భారత్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటివరకు టీమిండియా 5 సార్లు ఈ ఘనతను అందుకుంది. దీంతో పాకిస్థాన్,ఆస్ట్రేలియా రికార్డ్ ను బ్రేక్ చేసింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 4 సార్లు 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగులతో విజయం సాధించాయి. ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ మూడు సార్లు ఈ ఫీట్ అందుకొని తర్వాత స్థానాల్లో నిలిచాయి. 

2023 అహ్మదాబాద్‌లో టీమిండియా న్యూజిలాండ్‌పై 168 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. పరుగుల పరంగా భారత్ కు టీ 20ల్లో ఇదే అతి పెద్ద విజయం. ఐర్లాండ్‌పై 143 పరుగులు.. దక్షిణాఫ్రికాపై 106 పరుగులు.. ఆఫ్ఘనిస్థాన్‌పై 101 పరుగుల తేడాతో విజయం సాధించారు. తాజాగా జింబాబ్వేపై 100 పరుగులతో నెగ్గింది. జింబాబ్వేపై మరో మూడు టీ20 మ్యాచ్ లు ఉండడంతో భారత్ ఈ రికార్డ్ ను మరింత మెరుగుపరచుకునే అవకాశముంది.