దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా–డి పై ఇండియా–సి ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో తొలి ఫలితం వచ్చిన మ్యాచ్ ఇది. ఇండియా–డి జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ కాగా..ఇండియా–సి కి గైక్వాడ్ సారధ్యం వహిస్తున్నాడు. ఇద్దరూ భారత టెస్టు జట్టులో చోటు కోసం ఆరాటపడుతున్నారు. అయ్యర్ ఇప్పటికే భారత జట్టులో స్థానం దక్కించుకొని నిలకడ లేమి కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. మరోవైపు గైక్వాడ్ క్రికెట్ లోకి దూసుకొస్తున్నాడు.
అనంతపురంలో జరిగిన ఈ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు సాగింది. మ్యాచ్ ఆధ్యంతం ఇరు జట్ల బౌలర్లు ఆధిపత్యం చూపించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా–డి బ్యాటింగ్‌లో ఫెయిలైంది. అక్షర్ పటేల్ (86) ఒంటరి పోరాటం చేసినా తొలి ఇన్నింగ్స్‌లో 48.3 ఓవర్లలో 164 రన్స్‌కే కుప్పకూలింది. విజయ్‌కుమార్ (3/19), అన్షుల్ కాంబోజ్ (2/47), హిమాన్షు చౌహాన్ (2/22) దెబ్బకు ఇన్నింగ్స్‌లో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
అంతరం బ్యాటింగ్ చేసిన ఇండియా–సి 168 పరుగులకే ఆలౌట్ కావడం విశేషం. హర్షిత్ రానా 4 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో ఇండియా–డి 236 పరుగులకే ఆలౌటై ప్రత్యర్థి ముందు 233 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని ఇండియా-సి 6 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసి గెలిచింది. రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీసిన మానవ్ సుతార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.