
న్యూఢిల్లీ: పాకిస్తాన్ పౌరులకు మన దేశం జారీ చేసిన మెడికల్ వీసాల గడువు మంగళవారంతో ముగిసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో లాంగ్‌టర్మ్, డిప్లమాటిక్, అఫీషియల్ వీసాలు మినహా పాక్ పౌరులకు జారీ చేసిన మిగతా అన్ని రకాల వీసాలనూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. షార్ట్ టర్మ్ వీసాల గడువు ఈ నెల 27తోనే ముగియగా, తాజాగా మెడికల్ వీసాల గడువు కూడా ముగిసింది. ట్రీట్‌మెంట్ కోసం భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ పౌరులందరూ ఈ నెల 29లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది.
అయితే మెడికల్ వీసాల రద్దు విషయంలో భారత ప్రభుత్వం పునరాలోచించాలని పాకిస్తాన్ పౌరులు కోరుతున్నారు. తాము ట్రీట్‌మెంట్ కోసం వచ్చామని, దాన్ని పరిగణనలోకి తీసుకుని వీసాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, మెడికల్ వీసాల రద్దుతో భారత్, పాక్ మధ్య మెడికల్ టూరిజంపై అనిశ్చితి నెలకొంది. ఇది భవిష్యత్తులో కొనసాగుతుందా? లేదా? అనే దానిపై సందిగ్ధం నెలకొంది.