ముంబై: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సెంచరీలు చేయడం గురించి నేర్పాల్సిన అవసరం లేదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. కాకపోతే హిట్‌మ్యాన్ ఎక్కువగా మ్యాచ్ గెలవడంపైనే దృష్టి పెడతాడన్నాడు. ‘రోహిత్ క్రీజులో ఉంటే సెంచరీ చేస్తాడని అందరూ అంటారు. అది నిజం కూడా. అలాగని సెంచరీలు ఎలా చేయాలో అతనికి నేర్పాల్సిన పని లేదు. కాకపోతే రోహిత్ ఉద్దేశం భిన్నంగా ఉంటుంది.
వేగంగా ఆడి టీమ్‌కు మంచి స్కోరు అందిస్తే బాగుంటుందని ఆలోచిస్తాడు. తన వల్ల టీమ్‌కు మంచి జరుగుతుందని తెలిస్తే దానికే కట్టుబడి ఆడతాడు’ అని అశ్విన్ పేర్కొన్నాడు. ఫైనల్లో ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం తనను షాక్‌కు గురి చేసిందన్నాడు. అహ్మదాబాద్ పిచ్‌ను కమిన్స్ చాలా బాగా అర్థం చేసుకున్నాడని చెప్పాడు. ‘ఇండియాలో ఎర్రమట్టి పిచ్‌లు మ్యాచ్ జరిగేకొద్ది విచ్ఛిన్నమవుతాయి. కానీ నల్ల మట్టి పిచ్‌లు కాంక్రీట్ మాదిరిగా మారిపోతాయి.
అందుకే సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని ఊహించి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నామని ఆసీస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలిపాడు. ఈ నిర్ణయం నన్ను చాలా ప్రభావితం చేసింది’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.