మనదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటితో 72 ఏండ్లయ్యింది. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతల దార్శనికతకు, రాజ్యాంగ సూత్రాలకు బద్దులమై ఏక్ భారత్, శ్రేష్ట భారత్ నిర్మాణానికి మనందరం నడుం బిగించాలి. నరేంద్ర మోడీ సర్కారు కూడా భారతావని ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. మోడీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలోనూ దేశమే కీలక ప్రాతిపదికగా ఉంటోంది. కాంగ్రెస్ హయాంలో కొన్ని వర్గాల ప్రజలు సమానత్వం, న్యాయం కోల్పోయామని భావించేవారు. అందుకే ఏడేండ్లుగా ప్రజల హక్కులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది మోడీ ప్రభుత్వం. ప్రజల హక్కులతో పాటు, బాధ్యతలనూ స్పష్టం చేయడం మన రాజ్యాంగం ప్రత్యేకత. బాధ్యతలను నిర్వర్తించకుండా హక్కులను కాపాడుకోవడం సాధ్యం కాదు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను అనుభవించడంతోపాటు ప్రాథమిక విధులను నెరవేర్చేందుకు దేశ పౌరులు అధిక ప్రాధాన్యమివ్వాలి.
‘‘భారతదేశ ప్రజలమైన మేము..’’ అనే వాక్యంతో మన రాజ్యాంగం ప్రారంభమవుతుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలను పాలనలో భాగస్వామ్యం చేయడం.. ప్రజాప్రతినిధులు, అధికారులు, న్యాయమూర్తులు ప్రజానీకానికి జవాబుదారీ వహించడం కీలకం. వీటికి చట్టబద్ధత కల్పించిందే రాజ్యాంగం. రాజ్యాంగ బద్దత ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ప్రతి ఏటా నవంబర్ 26ను సంవిధాన(రాజ్యాంగ) దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1949 నవంబర్ 26న మన రాజ్యాంగం ఆమోదం పొందింది. ఇది హక్కులకు చుక్కానిగా, ప్రజాస్వామ్య కరదీపికగా, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వాలకు ఆయువుగా ఉంటోంది. శ్రేయోరాజ్యం, సమసమాజ స్థాపనకు దోహదపడుతోంది. ఎన్నెన్నో విశిష్ట లక్షణాలు కలిగిన రాజ్యాంగ నిర్మాణం ఆద్యంతం ఆసక్తికరం.
అంబేద్కర్ సారథ్యంలో..
ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత అనేక మతాలు, తెగలు, ఆదివాసీలు, దళితులు, అణగారిన, పీడనకు గురైన వర్గాలున్న మనదేశంలో అందరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రచించడం పెద్ద సవాల్‌గా మారింది. దేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారథిగా డ్రాఫ్టింగ్ కమిటీని నియమించింది. అంబేద్కర్ ఆహర్నిశలు శ్రమించి సమగ్ర రాజ్యాంగ గ్రంథాన్ని మనకు అందించారు. దేశ భవిష్యత్ రాజ్యాంగంలోనే ఉందని, దానిని సక్రమంగా అమలు చేయడం ద్వారా ప్రజలకు మంచి ఫలితాలు అందించవచ్చని చెప్పారాయన. రాజ్యాంగ రచనా ప్రక్రియలో బాబూ రాజేంద్రప్రసాద్, జవహర్‌లాల్ నెహ్రూ, అంబేద్కర్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, సుచేతా కృపలానీ, సరోజినీ నాయుడు, బీఎన్ రావు, పండిట్ గోవింద వల్లబ్ పంత్, శరత్ చంద్ర బోస్, రాజగోపాలాచారి, గోపాలస్వామి అయ్యంగార్, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, గోపీనాథ్ బార్లాబోయ్ వంటి మహామహులు పాలుపంచుకున్నారు. వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, విస్తృతంగా చర్చలు జరిపి మన రాజ్యాంగాన్ని ఖరారు చేశారు. రాజ్యాంగ రచనా సంఘం రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజుల్లో 141 సార్లు చర్చలు, సమావేశాలు జరిపి మరీ రాజ్యాంగ పీఠికకు, 135 అధికరణలు, ఎనిమిది షెడ్యూళ్లకు తుదిరూపునిచ్చింది. ఇది ఏడు దశాబ్దాలుగా మన దేశాన్ని ముందుకు నడిపిస్తోంది.
రాజ్యాంగ హక్కులు.. సవరణలు
ఈ 72 ఏండ్లలో మన రాజ్యాంగం ఎన్నో మార్పుచేర్పులకు గురైంది. కాలానుగుణంగా మారుతున్న పౌరుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి కావలసిన సవరణలను చేసుకున్నది. మారుతున్న పరిస్థితులు, ఎదురవుతున్న సవాళ్లు, పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగం కలగకుండా వివిధ లక్ష్యాలతో రాజ్యాంగాన్ని ఇప్పటివరకు 105 సార్లు సవరించారు. భారత రాజ్యాంగ ప్రథమ లక్ష్యం.. ప్రజలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని అందించడమే. రాజ్యాంగం అనేది కేవలం ఓ చట్టపరమైన పత్రం కాదు. సమాజంలో అన్ని వర్గాల హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు భరోసా ఇచ్చే ముఖ్యమైన సాధనం. కుల, మత, లింగ, ప్రాంతీయ, భాషా పరమైన వివక్షకు ఆస్కారం ఇవ్వకుండా పౌరులందరికీ సమానత్వాన్ని ప్రసాదిస్తోంది. ఇందులో ముఖ్యమైనవి ఆరు ప్రాథమిక హక్కులు. అవి- సమానత్వ హక్కు, స్వేచ్ఛా హక్కు, దోపిడీ నుంచి రక్షణ పొందే హక్కు, మత స్వేచ్ఛ హక్కు, విద్యా, సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ హక్కుల రక్షణే మన రాజ్యాంగానికి ప్రధాన స్ఫూర్తి. ప్రాథమిక హక్కులు పౌర స్వేచ్ఛను పరిరక్షిస్తూ, రాజ్యాధికారాన్ని పరిమితం చేస్తాయి. ఆదేశిక సూత్రాలు, సామాజిక, ఆర్థిక న్యాయాన్ని సాధించేందుకు రాజ్యాన్ని ఆదేశిస్తాయి. రాజ్యాంగం ప్రసాదించిన మత స్వాతంత్ర్యపు హక్కు మతపరమైన అల్పసంఖ్యాక వర్గాల్లో భద్రతాభావాన్ని కలిగిస్తుంది. మత, సాంస్కృతిక విషయాల్లో రాజ్యపు జోక్యాన్ని నిషేధిస్తుంది. రాజ్యాంగంలోని 17వ ప్రకరణ అనాదిగా కొనసాగుతున్న అంటరానితనమనే సాంఘిక దురాచారాన్ని నిషేధించింది.
పార్లమెంటరీ తరహా ప్రభుత్వమే బెస్ట్
సమాఖ్య వ్యవస్థకు నాంది పలికిన అమెరికా రాజ్యాంగం మనల్ని ప్రభావితం చేసినప్పటికీ.. మన రాజ్యాంగ నిర్మాతలు అర్థ సమాఖ్య వ్యవస్థ వైపు మొగ్గు చూపారు. బలమైన కేంద్ర ప్రభుత్వం, కేంద్రం సహకారంతో పనిచేసే రాష్ట్ర ప్రభుత్వాలతో కూడినదే అర్థ సమాఖ్య పార్లమెంటరీ ప్రభుత్వం. భారత ప్రజలకు అధ్యక్ష, పార్లమెంటరీ తరహా వ్యవస్థల్లో ఏది బెస్ట్ అని పరిశీలించిన రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్నే ఎంపిక చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు, వర్గాలకు పాలన బాధ్యతల్లో సముచిత స్థానాన్ని కల్పిస్తూ, అధ్యక్ష తరహా వ్యవస్థలో తలెత్తే అధికార కేంద్రీకరణను ఇది నివారిస్తుంది. ప్రజాస్వామ్య దేశాల్లో మూడింట రెండొంతుల ప్రభుత్వాలు దీనివైపు మొగ్గు చూపాయి. రాజ్యాంగానికి లోబడే న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు తమ విధులను నిర్వహించాల్సి ఉన్నదని, ఈ మూడు వ్యవస్థలు తమ పరిధిలో తాము పని చేస్తేనే సమన్వయం ఏర్పడుతుందని స్పష్టం చేసింది. కీలకమైన ఈ మూడు వ్యవస్థలు ఒక దాని విధుల్లో మరొకటి జోక్యం కారణంగా దేశ సమగ్రతకు, రాజ్యాంగ పవిత్రతకు భంగం ఏర్పడుతుంది. ఈ మూడు వ్యవస్థలు రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను అధిగమించి లక్ష్మణరేఖలను దాటకూడదు.
ప్రజాస్వామ్యమే గెలిచింది..
1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమెర్జెన్సీ విధించారు. 21 నెలల పాటు దేశంలో అప్రకటిత నియంతృత్వం రాజ్యమేలింది. మానవ హక్కులు అణచివేతకు గురయ్యాయి. పౌరుల ప్రాథమిక హక్కులు రద్దయ్యాయి. ప్రజా నిరసనలతో దిగొచ్చిన ఇందిర 1977లో సాధారణ ఎన్నికలకు సిద్ధమై ఎమెర్జెన్సీని ఎత్తివేశారు. ఆ ఎన్నికల్లో ఇందిర ఘోరపరాజయం పాలయ్యారు. నిరంకుశ, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన దేశ ప్రజలు.. జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దీంతో నియంతృత్వంపై ప్రజాస్వామ్యం విజయం సాధించింది. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసిన ఇందిర ప్రజాస్వామ్యాన్ని విస్మరిస్తే ప్రజలు తిరగబడ్డారు, పోరాడారు, చివరకు నియంతృత్వాన్ని ఓడించారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు. ఇది మన రాజ్యాంగం గొప్పదనం.
బీజేపీ.. దళితుల పక్షపాతి
పార్లమెంట్లో అంబేద్కర్‌ను అడుగు పెట్టనివ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఆయనను ఓడించింది. అంతేకాక బాబూ జగ్జీవన్‌రాంను ప్రధాని కాకుండా కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించింది. భారతీయ జనతా పార్టీ మాత్రం దళితుడైన రామ్ నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిని చేసింది. 2015లో మోడీ ప్రభుత్వం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా అంబేద్కర్‌ను, ఆయన భావజాలాన్నీ ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 6 వరకు సంవిధాన్ గౌరవ్ అభియాన్ పేరుతో 12 రోజులు రాజ్యాంగ ప్రాధాన్యతలు, అంబేద్కర్ దూరదృష్టి, ప్రజల హక్కులు, బాధ్యతల గురించి తెలియపరచడమే ప్రాధాన్య అంశంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అంబేద్కర్ పుట్టిన గ్రామం ‘మావ్’ను మోడీ ప్రధాని హోదాలో సందర్శించి.. ఆ గ్రామాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. అంబేద్కర్ చరిత్ర, గొప్పతనం భవిష్యత్ తరాలకు తెలిసేలా ఆయన జీవితంతో ముడిపడి ఉన్న 5 ప్రదేశాలను పంచతీర్థాలని నామకరణం చేసి, వాటిని పర్యాటక, విజ్ఞాన, స్ఫూర్తి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ ప్రభుత్వం నడుం బిగించింది.
- డా. కె.లక్ష్మణ్, జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఓబీసీ మోర్చా