మేరా భారత్ మహాన్: కర్తవ్యపథ్ వేదికగా ఛబ్బీస్ జనవరి వేడుకలు

మేరా భారత్ మహాన్: కర్తవ్యపథ్ వేదికగా ఛబ్బీస్ జనవరి వేడుకలు
  • త్రివిధ దళాల ఆయుధ ప్రదర్శన
  • అబ్బురపర్చిన డేర్‌‌డెవిల్స్ విన్యాసాలు
  • స్పెషల్ అట్రాక్షన్​గా బ్రహ్మోస్‌‌, ఆకాశ్‌‌ క్షిపణులు
  • 5వేల మంది కళాకారుల సంస్కృతిక ప్రదర్శన.. 
  • 45 రకాల నృత్యాలతో కర్తవ్యపథ్​పై మెరిసిన ‘నారీశక్తి’
  • చీఫ్ గెస్ట్​గా హాజరైన ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో
  • జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ: కర్తవ్యపథ్ వేదికగా 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు. ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి గుర్రపు బండిలో వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం సైనిక దళాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఆ తర్వాత జాతీయ జెండాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ‘జన్ భాగీదారి’లో భాగంగా సుమారు 10వేల మంది ఈ వేడుకలకు అతిథులుగా అటెండ్ అయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 300 మంది సాంస్కృతిక కళాకారులు.. తమ తమ వాయిద్యాలతో ‘సారే జహా సే అచ్ఛా’ గీతాన్ని ప్లే చేశారు.

ఈ వేడుకల్లో వికసిత్‌‌ భారత్‌‌, నారీ శక్తి అంశాలు స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచాయి. ‘సశక్త్‌‌ ఔర్‌‌ సురక్షిత్ భారత్‌‌’ అనే థీమ్​తో త్రివిధ దళాలు సంయుక్తంగా రూపొందించిన శకటం.. అందరినీ ఆకట్టుకున్నది. ‘స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్’ పేరుతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 16 శకటాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, వివిధ సంస్థలకు చెందిన 15 శకటాలతో మొత్తం 31 శకటాలు కర్తవ్యపథ్‌‌ వేదికగా తమ థీమ్​ను ప్రదర్శించాయి. బ్రహ్మోస్‌‌, ఆకాశ్‌‌ మిసైల్స్, పినాక మల్టీబ్యారెల్‌‌ రాకెట్‌‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కర్తవ్య పథ్‌‌పై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి.

రాష్ట్రపతి భవన్‌‌ నుంచి ఎర్రకోట వరకు 9 కిలోమీటర్ల మేర రిపబ్లిక్‌‌ డే పరేడ్‌‌ ఏర్పాటు చేశారు. అదేవిధంగా, ఇండోనేషియాకు చెందిన 152 మంది సైనికులు, 190 ఆ దేశ మిలటరీ అకాడమీ సభ్యులు.. ఈ కవాతులో పాల్గొన్నారు. కాగా, ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగదీప్‌‌ ధన్‌‌ఖడ్‌‌, ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. అమెరికా, నేపాల్, ఆస్ట్రేలియా, సింగపూర్ ప్రధానులు, అధ్యక్షులు ఛబ్బీస్ జనవరి విషెస్ చెప్పారు. ఆయా దేశాల్లోని ఇండియన్ ఎంబసీల్లో త్రివర్ణ పతకాలను ఆవిష్కరించారు. కాగా, 29వ తేదీన విజయ్ చౌక్‌‌లో నిర్వహించే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంతో ఈ రిపబ్లిక్ వేడుకలు ముగియనున్నాయి.

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

కర్తవ్యపథ్​పై 5వేల మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్టిస్టులు.. మొత్తం 45 రకాల నృత్యాలను ప్రదర్శించారు. ‘జయతి జయ మహాభారతం’ పేరుతో ప్రదర్శించిన 11 నిమిషాల సాంస్కృతిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నది. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని సంగీత్ నాటక్ అకాడమీ దీన్ని ప్రదర్శించింది. ‘వికసిత్ భారత్’, ‘విరాసత్ బీ.. వికాస్​బీ’, ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్’ థీమ్​తో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సుమారు 5వేల మంది కళాకారులు ట్రెడిషనల్ డ్రెస్సులు, జ్యూవెలరీ, డ్రమ్ములతో ప్రదర్శన ఇచ్చారు. 

కవాతులో మెరిసిన ‘నారీశక్తి’

తొలి సారిగా 100 మంది మహిళలు శంఖం, నాదస్వరం వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ కర్తవ్యపథ్‌‌లో పరేడ్‌‌ను ప్రారంభించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌‌లో నారీ శక్తికి ప్రాతినిథ్యం వహిస్తూ మహిళా అధికారులు తమ ప్రదర్శన ఇచ్చారు. అధునాతన రక్షణ సాంకేతికతల ద్వారా దేశ భద్రతను బలోపేతం చేయడంలో మహిళలు అందించిన కీలకమైన సహకారాన్ని ప్రదర్శించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌‌కు చెందిన 148 మంది సభ్యుల మహిళా బృందం, ఆర్పీఎఫ్​ బృందం పరేడ్‌‌లో పాల్గొన్నాయి.

కర్తవ్యపథ్​పై త్రివిధ దళాల సత్తా 

మిలిటరీ కవాతులో త్రివిధ దళాలు తమ సత్తా చాటాయి. బ్రహ్మోస్‌‌, ఆకాశ్‌‌ క్షిపణులు, పినాక మల్టీ బ్యారెల్‌‌ రాకెట్‌‌ లాంచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ట్యాంక్‌‌ టీ-90 (భీష్మ), బీఎంపీ-2 శరత్‌‌తో పాటు నాగ్‌‌,   అగ్నిబాణ్‌‌ మల్టీ బ్యారెల్‌‌ రాకెట్‌‌ లాంచర్లు, ఆకాశ్‌‌ వెపన్ సిస్టమ్‌‌, చేతక్‌‌, బజరంగ్‌‌, ఐరావత్‌‌తో సహా పలు ఆయుధాలను ప్రదర్శించారు. ఆర్మీకి చెందిన యుద్ధ నిఘా వ్యవస్థ ‘సంజయ్’ డీఆర్‌‌డీవో ‘ప్రళయ్’ వ్యూహాత్మక క్షిపణిని తొలిసారిగా ప్రదర్శించారు. దేశంలోని సాయుధ దళాల మధ్య ఐక్యత స్ఫూర్తికి ప్రతీకగా త్రివిధ దళాల సేవలు ఉమ్మడి ప్రదర్శన ఇచ్చాయి. డీఆర్‌‌డీవో ‘రక్షా కవచ్’ థీమ్‌‌ను ప్రదర్శించింది.

మోటారు సైకిళ్లపై డేర్‌‌డెవిల్స్ చేసిన విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. బుల్లెట్ సెల్యూట్, ట్యాంక్‌‌ టాప్‌‌, డబుల్‌‌ జిమ్మీ, డెవిల్స్ డౌన్‌‌ వంటి అంశాలను ప్రదర్శించారు.  22 ఫైటర్ జెట్‌‌లు, 11 ట్రాన్స్‌‌పోర్ట్‌‌ ఎయిర్‌‌క్రాఫ్ట్‌‌లు, ఏడు హెలికాప్టర్‌‌లు ప్రదర్శన ఇచ్చాయి. వీటిలో రాఫెల్‌‌, సుఖోయ్​-30, జాగ్వార్‌‌, సీ-130, సీ-295, సీ-17, డోర్నియర్‌‌-228, ఏఎన్‌‌-31 విమానాలతో పాటు ఎమ్‌‌ఐ- 17 హెలికాప్టర్లు ఉన్నాయి. ధ్వజ్, అజయ్, సట్లేజ్, రక్షక్, అర్జన్, నేత్రా, భీమ్, అమృత్, వజ్రంగ్, త్రిశూల్, విజయ్ అనే ట్రాన్స్​పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్​లను ప్రదర్శించారు. 

పరేడ్​లో రోబో డాగ్స్

కోల్​కతా: బెంగాల్​లోని కోల్​కతాలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో రోబో డాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇవి ఆర్మీలోని వివిధ యూనిట్లలో ఉన్నాయి. మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్ మెంట్ (మూలే)గా పేర్కొంటున్న వీటికి ‘సంజయ్’ అని పేరు పెట్టారు. ఈ రోబో డాగ్స్ –40 డిగ్రీల నుంచి 55 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ పని చేస్తాయి. కొండలు, గుట్టలు ఎక్కుతాయి. ఎలాంటి అడ్డంకులు ఉన్నా దాటుకుని ముందుకెళ్తాయి. 15 కిలోల బరువును మోసుకెళ్తాయి. ఆర్మీ వీటిని వివిధ ఆపరేషన్ల కోసం వినియోగిస్తున్నది.

వావ్.. డేర్ డెవిల్  కెప్టెన్  భాటీ

ఆర్మీ ఆఫీసర్ కెప్టెన్  డింపుల్  సింగ్  భాటీ 12 అడుగుల నిచ్చెనపై నిల్చుని, బుల్లెట్  బైక్ పై వెళుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సెల్యూట్  చేసి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. అలా సెల్యూట్  చేసిన మొదటి మహిళా ఆర్మీ ఆఫీసర్ గా ఆమె నిలిచారు. కదులుతున్న బుల్లెట్ పై ఎక్కడా బ్యాలెన్స్  తప్పకుండా రాష్ట్రపతికి ఆమె వందనం సమర్పించారు. డేర్ డెవిల్స్ (మన ఆర్మీ జవాన్లు చేసే విన్యాసాలు) ప్రత్యేకతను ఘనంగా చాటారు భాటీ.

ప్రేలే క్షిపణి పరిచయం

దేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్ రేంజ్  క్వాసీబాలిస్టిక్  క్షిపణి ప్రేలేను రిపబ్లిక్ డే సందర్భంగా ప్రవేశపెట్టారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్  కోసం ఈ మిసైల్​ను తయారు చేశారు.
 

నిఘానేత్రం సంజయ్

యుద్ధ రంగంలో నిఘాపెట్టే సర్వైలెన్స్  సిస్టమ్  సంజయ్​ను కూడా వేడుకల్లో ప్రదర్శించారు. నేలమీద, గాలిలోనూ సెన్సార్ల ద్వారా ఇది ఇన్ పుట్​ను సేకరించి అప్రమత్తం చేస్తుంది.

ఇండోనేసియా దళం

కర్తవ్యపథ్​ లో 352 మందితో కూడిన ఇండోనేసియన్ల కంటింజెంట్ (దళం) నిర్వహించిన ప్రదర్శన కూడా చూపరులను ఆకట్టుకుంది. రిపబ్లిక్ డే రోజు ఇండోనేసియా కంటింజెంట్  కవాతు నిర్వహించడం ఇది మొదటిసారి. అలాగే, ఆ దేశ మిలిటరీ బ్యాండ్  కూడా ప్రదర్శన చేసింది. దానితో పాటు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను అలరించాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 5 వేలకుపైన జానపద, గిరిజన 
కళాకారులు 45 రకాల డాన్స్  చేశారు.

అమర జవాన్లకు మోదీ నివాళి

నేషనల్​ వార్​ మెమోరియల్​ వద్ద అమర జావన్లకు ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఇండియా గేట్​ ముందు ఉన్న ఈ స్మారకం వద్దకు 76వ రిపబ్లిక్​ డే సందర్భంగా ఆదివారం ఉదయం ప్రధాని మోదీ చేరుకోగా.. రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ స్వాగతం పలికారు. అమరజ్యోతి ముందు ప్రధాని పూలబొకే ఉంచి నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించి.. అమర జవాన్ల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. కాగా, ప్రధాని మోదీ  తలకు మల్టికలర్​ టర్బన్ ధరించారు.

వైమానిక విన్యాసాలు

గణతంత్ర వేడుకల్లో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కర్తవ్య పథ్ లో తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ​ రాఫెల్​ఎయిర్​క్రాఫ్ట్స్​ప్రదర్శన చూపరులను కట్టిపడేసింది. దాదాపు 40 విమానాలు  వివిధ ఆకారాల్లో  ప్రదర్శించిన విన్యాసాలు ఆహ్వానితులను చూపులు తిప్పుకోనివ్వలేదు. రాఫెల్ యుద్ధ విమానాలు ప్రదర్శించిన వజ్రాంగ్ విన్యాసం అందరినీ ఆకట్టుకుంది.

పీ-8ఐ ఎయిర్‌‌క్రాఫ్ట్, సుఖోయ్, జాగ్వార్, సీ-17.. వంటివి ఇందులో పాల్గొన్నాయి.3 సుఖోయ్​–30 యుద్ధ విమానాలు 900 కి.మీ. వేగంతో దూసుకొస్తూ ఇండియా గేట్​ ఎగువన త్రిశూలం ఆకారంలో ఏర్పడి మంత్రముగ్ధులను చేశాయి. ఈ విన్యాసాలను చూస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో  చప్పట్లు కొడుతూ కనిపించారు.