
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ ఇండియా సిమెంట్స్ లిమిటెడ్, మార్చి 2025తో ముగిసిన క్వార్టర్లో రూ.14.68 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) సంపాదించింది. కంపెనీకి గత సంవత్సరం జనవరి-–మార్చి కాలంలో రూ.60.55 కోట్ల నష్టం వచ్చింది. కార్యకలాపాల నుంచి వచ్చే దాని ఆదాయం 2025 ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో 3.11 శాతం తగ్గి రూ.1,197.30 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.1,235.74 కోట్లు వచ్చాయి.
మార్చి క్వార్టర్లో ఇండియా సిమెంట్స్ మొత్తం ఖర్చులు స్వల్పంగా తగ్గి రూ.1,313.2 కోట్లకు పడిపోయాయి. ఇతర ఆదాయంతో సహా మొత్తం ఆదాయం 2.52 శాతం తగ్గి రూ.1,255.66 కోట్లకు చేరుకుంది.మార్చి 31, 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి, ఇండియా సిమెంట్స్ తన నికర నష్టాన్ని రూ.143.88 కోట్లకు తగ్గించుకుంది.
2024 ఆర్థిక సంవత్సరంలో రూ.227.34 కోట్ల నష్టవచ్చింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయం రూ.4,357.41 కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 13.81 శాతం తగ్గింది. ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్స్ గత ఏడాది డిసెంబర్‌లో ఇండియన్ సిమెంట్స్ లిమిటెడ్‌లో ప్రమోటర్ల వాటాను కొనుగోలు చేసింది.