క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించడానికి మరో ఐసీసీ టోర్నీ సిద్ధంగా ఉంది. ఏడేళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండడంతో ఈ టోర్నీకి భారీ హైప్ నెలకొంది. పాకిస్థాన్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది. మరోవైపు 2013లో భారత్ ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. ఇటీవలే వరుస టెస్ట్ ఓటముల నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ఈ టైటిల్ ఎలాగైనా గెలవాలని కోరుకుంటుంది. ఇందులో భాగంగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియాను ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు రెడీ అవుతున్నారు.
పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీకి జట్టును ప్రకటించేందుకు ఈ నెల 12వ తేదీ వరకు గడువు ఉంది. రెండు, మూడు రోజుల్లో జరిగే సెలెక్షన్ కమిటీ సమావేశంలో టీమ్‌ను ఖరారు చేయనుంది. మరో రెండు రోజుల్లో స్క్వాడ్ ను ప్రకటించనున్నారు. ఈ లీగ్ స్క్వాడ్ లో ఆసక్తికర ఎంపికలు ఉన్నపటికీ.. తుది జట్టు మాత్రం 2023 వన్డే వరల్డ్ కప్ లో భారత్ ఆడిన జట్టు రిపీట్ కానుందని సమాచారం. ఒకటి రెండు మార్పులకు తప్పితే దాదాపు 2023 వరల్డ్ కప్ తుది జట్టే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది.
Also Read :- శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు వన్డేల్లో అద్భుతమైన రికార్డ్ ఉన్న గిల్ ఓపెనింగ్ కు దిగడం ఖాయం. మూడో స్థానంలో కోహ్లీ బ్యాటింగ్ చేస్తాడు. ఇటీవలే సూపర్ ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానానికి ఆడడడం దాదాపుగా ఖాయం. మొదటి వికెట్ కీపర్ గా రాహుల్ తుది జట్టులో ఉంటాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్య, స్పిన్ ఆల్ రౌండర్ గా జడేజా స్థానాలకు ఢోకా లేదు. వీరి అనుభవం జట్టుకు ఎంతో అవసరం. ఏకైక స్పిన్నర్ గా కుల్దీప్ విషయంలో కాస్త అనిశ్చితి నెలకొంది. అతని స్థానంలో ఫామ్ లో ఉన్న సుందర్ కు అవకాశం ఇస్తారేమో చూడాలి.
ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ ఆడనున్నారు. సరిగా గమనిస్తే ఈ జట్టు 2023 వన్డే వరల్డ్ జట్టే కావడం విశేషం. అనుభవం దృష్ట్యా ఈ మెగా టోర్నీకి ఇదే జట్టు కొనసాగనుంది. బ్యాకప్ ఓపెనర్ గా జైశ్వాల్ ఎంపికవుతాడనే టాక్ ఉంది. రాహుల్ కు బ్యాకప్ గా రిషబ్ పంత్ స్క్వాడ్ లో చోటు దక్కించుకోనున్నాడు. అక్షర్ పటేల్, సుందర్, ప్రసిద్ కృష్ణ, రియాన్ పరాగ్, తిలక్ వర్మ రేస్ లో ఉన్నారు. వచ్చే నెల 19 నుంచి జరిగే ఈ మెగా టోర్నీలో ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌లకు దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది.