![దేశాన్ని దద్దరిల్లిస్తాం..: ఇండియా కూటమి పొలిటికల్ స్ట్రాటజీ](https://static.v6velugu.com/uploads/2023/12/india-co-committee-meeting-ended-in-delhi-took-many-important-decisions_mZh9uTaB6q.jpg)
ఇండియా కూటమి సమావేశం ముగిసింది. నేతలు పార్లమెంట్ నుంచి 141 మంది ఎంపీల సస్పెన్షన్ ఖండిస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేశారు. ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా డిసెంబర్ 22న దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది ఇండియా కూటమి. దేశవ్యాప్తంగా 8-10 సభలు నిర్వహించాలని నిర్ణయించారు. సమస్యలపై సమిష్టిగా పోరాటం చేయాలని సమావేశంలో కూటమి నిర్ణయించారు.
సమావేశం అనంతరం మల్లిఖార్జున్ ఖర్డే మాట్లాడుతూ.. ఇండియా కూటమిలోని 28 పార్టీలు ఐక్యంగా ఉన్నాయని.. సీట్ల సర్దుబాటుపై రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో సీట్ల సర్దుబాటు కుదరకపోతే ఇండియా కూటమిలోని నేతలు సీట్ల అంశాన్ని నిర్ణయిస్తారని ఖర్గే తెలిపారు. ప్రధాని అభ్యర్థి కన్నా ముందు గెలవడం ముఖ్యమని స్పష్టం చేశారు. మా లక్ష్యం ముందు గెలవడం.. గెలిచిన తరువాత ప్రధాని ఎవరనేది ఎంపీలు నిర్ణయిస్తారని ఖర్గే అన్నారు.
ఇండియా కూటమి సమావేశంలో ప్రధాని అభ్యర్థి పై కూడా చర్చించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమి అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారు. అయితే ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవాలని మిత్ర పక్షాలు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూటమి ఫోకస్ అంతా పార్లమెంట్ ఎన్నికలపైనే దృష్టి పెట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
ఢిల్లీ అశోక హోటల్ లో మూడు గంటల పాటు ఇండియా కూటమి నేతలు భేటీ అయ్యారు.ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పార్లమెంటులో చోటు చేసుకున్న ఘటనలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపి అగ్రనేత శరద్ పవార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, జేడియూ అగ్ర నేత నితీష్ కుమార్, ఆర్జెడి అగ్రనేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ నేత అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆప్ సహా పలు పార్టీల నేతలు హాజరయ్యారు.