పోర్బందర్: గుజరాత్లోని పోరుబందరులో ఇండియన్ నేవీకి చెందిన కోస్ట్ గార్డ్ హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సాధారణ శిక్షణలో భాగంగా వెళ్తుండగా హెలికాఫ్టర్ కూలింది. మధ్యాహ్నం 12.10కి ఈ దుర్ఘటన జరిగినట్లు పోరుబందర్ సూపరింటెండెంట్ భగీరథ్ సిన్హ్ జడేజా తెలిపారు. కోస్ట్ గార్డ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాఫ్టర్ (ALH) ల్యాండింగ్ సమయంలో కూలింది. రొటీన్ ట్రైనింగ్లో భాగంగా వెళ్లి ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాల పాలైన ముగ్గురిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తూ ముగ్గురూ చనిపోయారు. ఈ విషయాన్ని కమలాబాగ్ ఇన్ స్పెక్టర్ రాజేష్ నిర్ధారించారు. సరిగ్గా రెండు నెలల క్రితం ఇదే తరహాలో ఒక కోస్ట్ గార్డ్ హెలికాఫ్టర్ సముద్రంలో కుప్పకూలింది.
ఇండియన్ నేవీ పరిధిలో మొత్తం 325 ALH ధృవ్ హెలికాఫ్టర్స్ ఉండగా.. 2023లో వరుస ప్రమాదాల కారణంగా టెక్నికల్ చెక్స్ చేశాకే రెగ్యులర్ ఆపరేషన్స్ లో ఈ హెలికాఫ్టర్స్ను వినియోగిస్తున్నారు. టెక్నికల్ చెక్స్లో సేఫ్టీ ఆడిట్ను కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా హెలికాఫ్టర్ ప్రమాదం జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో హెలికాఫ్టర్ పూర్తిగా కాలిపోయింది. మంటల్లో తగలబడిపోయింది. హెలికాఫ్టర్ లో ఉన్న ముగ్గురిని ఈ మంటలు దహించాయి. తీవ్రంగా కాలిన గాయాల కారణంగా ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ హెలికాఫ్టర్ ప్రమాద ఘటనపై దర్యాప్తు మొదలైంది.
— Ramesh B (@RameshB44515147) January 5, 2025