పాకిస్తాన్​.. ఓ దుష్ట శక్తి .. యూఎన్‌‌‌‌‌‌‌‌లో పాక్‌‌‌‌‌‌‌‌పై భారత్‌‌‌‌‌‌‌‌ ఫైర్

పాకిస్తాన్​.. ఓ దుష్ట శక్తి .. యూఎన్‌‌‌‌‌‌‌‌లో పాక్‌‌‌‌‌‌‌‌పై భారత్‌‌‌‌‌‌‌‌ ఫైర్
  • టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నామని ఆ దేశమే ఒప్పుకున్నది 
  • ఇకపై ప్రపంచం కళ్లు మూసుకుని ఉండదు 

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్ తీరును భారత్ మరోసారి ఎండగట్టింది. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని, ఆ దేశం ఓ దుష్ట శక్తి అని మండిపడింది. యూఎన్‌‌‌‌‌‌‌‌లో విక్టిమ్స్ ఆఫ్‌‌‌‌‌‌‌‌ టెర్రరిజం అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యూఎన్‌‌‌‌‌‌‌‌లో ఇండియా డిప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ యోజనా పటేల్ మాట్లాడారు. ‘టెర్రరిస్టులకు మేం మద్దతిస్తున్నది నిజమే’ అని ఇటీవల పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒప్పుకున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. 

దశాబ్దాలుగా టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నామని, ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌తో పాటు నిధులు సమకూర్చుతున్నామని పాక్ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్‌‌‌‌‌‌‌‌ ఒప్పుకున్నారు. ఆయన మాటలను ప్రపంచం మొత్తం విన్నది. టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నామని పాక్ బహిరంగంగా ఒప్పుకున్నా ఎవరూ ఆశ్చర్యపోలేదు. ఆ దేశం ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దుష్ట శక్తి అని మరోసారి నిరూపితమైంది. ప్రపంచం ఇకపై కళ్లు మూసుకుని కూర్చోదు” అని హెచ్చరించారు. భారత్‌‌‌‌‌‌‌‌పై నిరాధారమైన ఆరోపణలు చేయడానికి యూఎన్ అంతర్జాతీయ వేదికను పాక్ దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు.

ప్రపంచ దేశాలకు కృతజ్ఞతలు.. 

పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయని యోజనా పటేల్ తెలిపారు. అన్ని దేశాలు భారత్‌‌‌‌‌‌‌‌కు మద్దతుగా నిలిచాయని, అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని అన్ని దేశాలు దృఢసంకల్పంతో ఉన్నాయని, అందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ‘‘భారత్‌‌‌‌‌‌‌‌లో 2008 ముంబై దాడుల తర్వాత ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. దశాబ్దాలుగా భారత్ ఉగ్రవాద బాధిత దేశం. ఉగ్రవాద బాధితులు, వాళ్ల కుటుంబాల బాధేంటో భారత్‌‌‌‌‌‌‌‌కు బాగా తెలుసు.  

విక్టిమ్స్ ఆఫ్‌‌‌‌‌‌‌‌ టెర్రరిజం అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయడం ఉగ్రవాదంపై పోరులో ఒక ముందడుగు. వాళ్లకు సాయం చేయడానికి, వాళ్ల గొంతును వినిపించడానికి ఇదొక మంచి వేదిక అవుతుంది. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలను ఒక్కటి చేసేందుకు ఇలాంటి వేదికలు అవసరమని భారత్ భావిస్తున్నది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, దాన్ని ఖండించాల్సిందే” అని పేర్కొన్నారు.