
- 2013 లో రూ.87 లక్షల కోట్లే: డెలాయిట్ రిపోర్ట్
న్యూఢిల్లీ: ఇండియాలో వినియోగం 2024 లో 2.1 ట్రిలియన్ డాలర్లు(రూ.183 లక్షల కోట్లు) గా నమోదైందని డెలాయిట్ ఇండియా, రిటైలర్స్ అసోసియేషన్ కలిసి విడుదల చేసిన రిపోర్ట్ పేర్కొంది. 2013 లో ఒక ట్రిలియన్ డాలర్ల ( రూ.87 లక్షల కోట్ల) ను కన్జూమర్లు ఖర్చు చేశారు. ఏడాదికి 7.2 శాతం గ్రోత్ నమోదు అయ్యింది. యూఎస్, చైనా, జర్మనీలో కంటే ఇండియాలో వేగంగా వినియోగం పెరుగుతోంది.
2026 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కన్జూమర్ మార్కెట్‌గా ఎదగాలని ఇండియా చూస్తోంది. అధిక జనాభా, భిన్నమైన అలవాట్లు వంటివి వినియోగం పెరగడానికి కారణంగా ఉన్నాయి. డెలాయిట్ రిపోర్ట్ ప్రకారం, ఇంకో ఐదేళ్లలో ఏడాదికి 10 వేల డాలర్ల (రూ.8.70 లక్షల) ఆదాయం సంపాదించే వారి సంఖ్య మూడు రెట్లు పెరుగుతుంది. 2024 లో 6 కోట్లుగా ఉన్న వీరు, 2030 నాటికి 16.5 కోట్లకు పెరుగుతారు.
దీనిని బట్టి దేశంలో మిడిల్ క్లాస్ మెరుగవుతోందనే విషయం తెలుస్తోంది. వీరు చేసే అత్యవసరం కాని ఖర్చులు కూడా పెరుగుతాయి. కన్జూమర్ల అలవాట్లలో మార్పులొచ్చాయని, ప్రీమియం ప్రొడక్ట్‌లకు డిమాండ్ పెరుగుతోందని, క్వాలిటీ బాగుంటే ఖర్చు పెట్టడానికి వెనకడుగేయడం లేదని డెలాయిట్– రిటైలర్స్ అసోసియేషన్ రిపోర్ట్ వివరించింది. ప్రీమియం బ్రాండ్లను జెన్ జెడ్, మిలినియల్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
వీటి సేల్స్‌లో వీరి వాటా 52 శాతంగా ఉంది. అంతేకాకుండా 2030 నాటికి ప్రజల సగటు ఆదాయం (జీడీపీ పర్ క్యాపిటా) 4 వేల డాలర్ల (రూ.3.48 లక్షల) ను దాటుతుందని అంచనా. దీంతో చాలా బిజినెస్‌లకు ఇండియాలో బోలెడు అవకాశాలు దొరుకుతాయి.
అలానే క్రెడిట్ కార్డుల వాడకం ఎక్కువవుతుందని రిపోర్ట్ అంచనా వేసింది. క్రెడిట్ కార్డులు ప్రస్తుతం ఉన్న 10 .2 కోట్ల నుంచి 2030 నాటికి 29.6 కోట్లకు పెరుగుతాయని, యూపీఐ వంటి డిజిటల్ పేమెంట్స్ విధానాల ద్వారా వినియోగం మరింత ఊపందుకుంటుందని వివరించింది.