బయట పడలేదు కానీ లవ్ స్టోరీ నడిపాడు.. మహిళా ఎంపీతో భారత క్రికెటర్ పెళ్లి

బయట పడలేదు కానీ లవ్ స్టోరీ నడిపాడు.. మహిళా ఎంపీతో భారత క్రికెటర్ పెళ్లి

భారత క్రికెటర్, టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ రింకూ సింగ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ప్రియా సరోజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని వధువు తరుపు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. 

ప్రియా సరోజ్ తండ్రి, ప్రస్తుత కేరాకట్ నియోజకవర్గం ఎమ్మెల్యే తుఫానీ సరోజ్ పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చారు. పెళ్లి ప్రతిపాదనపై రింకూ సింగ్ కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు, ఇరు కుటుంబాలు అందుకు అంగీకరించినట్లు తెలిపారు. వారిద్దరికీ ఇప్పటికే పరిచయం ఉన్నట్లు, ఒకరినొకరు ఇష్టపడినట్లు వెల్లడించారు. అయితే, ఇప్పటికే నిశ్చితార్థం జరిగిపోయినట్లు వస్తున్న వార్తలో వాస్తవం లేదన్నారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత రింకూ, ప్రియా తమ నిశ్చితార్థం, పెళ్లి పనులు మొదలవుతాయని అన్నారు.

లవ్..

"ప్రియా తన స్నేహితుల ద్వారా రింకూ సింగ్‌ను కలిశారు. ఇద్దరి మధ్య ఏడాది కంటే ఎక్కువే పరిచయముంది. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే ఆ బంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇరు కుటుంబసభ్యుల అనుమతి అవసరం. మా దృష్టికి తీసుకొచ్చారు. వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి.." అని ప్రియా తండ్రి తుఫానీ సరోజ్ చెప్పారు.

Also Read : ఛాంపియన్స్ ట్రోఫితో వాంఖడేలో అడుగుపెడతాం

ఎవరీ ప్రియా సరోజ్‌?

ప్రియా సరోజ్‌ విషయానికొస్తే.. 1998లో వారణాసిలో జన్మించింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ పట్టా పొందిన ఈమె, న్యాయవాద వృత్తిపై ఆసక్తితో ప్రియా అమిటీ యూనివర్శిటీ నుండి ఎల్‌ఎల్‌బి పూర్తి చేసింది. 

ఈమె రాజకీయ నాయకుడి కుమార్తె.. తండ్రి పేరు తుఫాని సరోజ్. ఈయన మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని కెరకట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. తండ్రి అడుగుజాడల్లోనే రాజకీయాలపై ఆసక్తితో ప్రియా సరోజ్‌ 2024 సాధారణ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున మచ్లిశహర్‌ లోక్‌సభ నియోజక వర్గం పోటీ చేసి విజయం సాధించింది. తన ప్రత్యర్థి బీపీ సరోజ్‌పై 35850 ఓట్ల తేడాతో గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టింది. ఈమె దేశంలో అతి పిన్న వయస్కురాలైన పార్లమెంటేరియన్‌లలో ఒకరిగా గుర్తింపు పొందారు.

ఇక రింకూ విషయానికొస్తే.. వచ్చే వారం నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. గతేడాది ఆగస్టు 2023లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రింకూ.. ఇప్పటివరకు రెండు వన్డేలు, 30 టీ20లు ఆడాడు. మొత్తంగా 562 పరుగులు చేశాడు.