
- వేయకూడదని నిర్ణయించుకున్న ఇండియా
- టారిఫ్‌లు తగ్గించుకునేందుకు చర్చలు ముమ్మరం
- మరిన్ని యూఎస్ ప్రొడక్ట్‌లపై సుంకాలు తగ్గించే ప్లాన్
- ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు షురూ
న్యూఢిల్లీ: యూఎస్ ట్రంప్ ప్రభుత్వం వేసిన 26 శాతం టారిఫ్‌పై ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవడం లేదు. సుంకాలకు సంబంధించి ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయని, మనపై టారిఫ్‌లు తగ్గొచ్చని ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. "ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని సరిచేసుకోవడానికి గణనీయమైన చర్యలు తీసుకునే" వాణిజ్య భాగస్వాములకు టారిఫ్ రిలీఫ్ ఉంటుందని ట్రంప్ ఉత్తర్వుల్లో ఉంది. ఈ పాయింట్‌ను సరిగ్గా వాడుకోవాలని ప్రభుత్వం చూస్తోంది.
ఇరు దేశాల మధ్య వ్యాపారాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి యూఎస్ ప్రతినిధులతో చర్చలు ముమ్మరం చేసింది. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాతో చర్చలు మనమే మొదట మొదలు పెట్టాం. చైనా, వియత్నాం, ఇండోనేషియా వంటి ఇతర ఆసియా దేశాలు టారిఫ్‌లపై ఇంకా అమెరికాతో చర్చలు మొదలు పెట్టలేదు. చైనా అయితే యూఎస్‌పై డైరెక్ట్‌గా 34 శాతం ప్రతీకార టారిఫ్ వేసింది. చైనీస్ కంపెనీలు అమెరికాలో ఇన్వెస్ట్ చేయడంపై రిస్ట్రిక్షన్లు కూడా పెట్టింది.
రూ.2 లక్షల కోట్ల ప్రొడక్ట్‌లపై సుంకాల తగ్గింపు..!
ట్రంప్ టారిఫ్‌లపై ఎటువంటి ప్రతీకార టారిఫ్‌లు వేయమని తైవాన్, ఇండోనేషియా దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ సరసన ఇండియా కూడా చేరింది. మరోవైపు చైనా ప్రతీకార టారిఫ్‌లు వేయగా, కెనడా, యూరోపియన్ యూనియన్ కూడా ప్రతీకార టారిఫ్‌లు వేసేందుకు రెడీ అవుతున్నాయి. కాగా, ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్‌ను వీలున్నంత తొందరగా కుదుర్చుకుంటామని ఇండియా, యూఎస్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించాయి. ఇరు దేశాల మధ్య వ్యాపారాన్ని 500 బిలియన్ డాలర్ల (రూ.43 లక్షల కోట్ల)కు పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాయి.
ఇది ప్రస్తుతం జరుగుతున్న వ్యాపారానికి రెండింతలు. కాగా, యూఎస్‌ను బుజ్జగించేందుకు ప్రభుత్వం చాలా అమెరికా ప్రొడక్ట్‌లపై టారిఫ్‌లు తగ్గించాలని ప్లాన్ చేస్తోంది. సుమారు 23 బిలియన్ల డాలర్ల (రూ.2 లక్షల కోట్ల) విలువైన దిగుమతులపై సుంకాలను తగ్గించడానికి సుముఖంగా ఉందని రాయిటర్స్ కిందటి నెలలో రిపోర్ట్ చేసింది. ఇప్పటికే ప్రీమియం బైక్‌లు, బోర్బన్‌పై సుంకాలను తగ్గించింది.
అలాగే యూఎస్ టెక్ దిగ్గజాలను ప్రభావితం చేసే డిజిటల్ సేవలపై పన్నును కూడా తొలగించింది. మరోవైపు ట్రంప్ సుంకాల ప్రభావంతో ఇండియన్ జీడీపీ వృద్ధి రేటు కొద్దిగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్ రేటు 20 నుంచి 40 బేసిస్ పాయింట్ల మేర పడిపోవచ్చని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు.
ఇండియా సుమారు 750 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరుపుతుండగా, ఇందులో సుమారు 120–130 బిలియన్ డాలర్ల విలువైన ప్రొడక్ట్‌లు, సేవలు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో ఫార్మా, ఐటీ సేవల వాటానే ఎక్కువగా ఉంది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం ఫార్మా సెక్టార్‌పై ఎటువంటి టారిఫ్ వేయలేదు. అందువలన ఇండియా ఎగుమతులపై ట్రంప్ వేసిన టారిఫ్‌ల ప్రభావం తక్కువగా ఉంటుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. ముఖ్యంగా రొయ్యలు, జ్యుయెలరీ వంటి సెక్టార్లు ఇబ్బంది పడొచ్చని తెలిపారు.