సింగపూర్ కు బియ్యం ఎగుమతిపై పచ్చజెండా

సింగపూర్‌తో ప్రత్యేక సంబంధాల దృష్ట్యా, ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి బియ్యం ఎగుమతిని అనుమతించాలని భారతదేశం నిర్ణయించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. జూలై 20వ తేదీ నుంచి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని భారత్ నిషేధించింది. ఈ క్రమంలో విదేశాంగ శాఖ తాజాగా చేసిన ప్రకటనతో సింగపూర్ కు కాస్త ఊరట లభించింది. ‘‘భారత్, సింగపూర్ దేశాల మధ్య ఉన్న సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యం, సన్నిహిత ఆర్థిక సంబంధాలను దృష్టిలో ఉంచుకొని సింగపూర్ దేశానికి బియ్యం ఎగుమతిని అనుమతించాలని భారత నిర్ణయించింది’’ అని విదేశీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు.

జూలై 20న కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతి నిబంధనలను సవరించి బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని నిషిద్ధ కేటగిరీలో చేర్చింది. కొన్ని రకాలపై పరిమితులు విధించినప్పటికీ, ప్రస్తుత సంవత్సరంలో బియ్యం ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. తాజాగా సింగపూర్ కి మాత్రం నిషేధానికి మినహాయిస్తూ భారత్ పచ్చజెండా ఊపింది.