
- సింధూ జలాల ఒప్పందం రద్దయితే పాకిస్తాన్ కు నీటి కటకటే
న్యూఢిల్లీ: భారత్ పైకి తరచూ టెర్రరిస్టులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ కు.. సింధు జలాల ఒప్పందం(ఇండస్ వాటర్స్ ట్రీటీ) రద్దు నిర్ణయం కుక్క కాటుకు చెప్పుదెబ్బలా తగలనుందని విశ్లేషకులు చెప్తున్నారు. తాజాగా పహల్గాంలో అత్యంత క్రూరమైన రీతిలో టెర్రర్ అటాక్ కు ఊతం అందించిన దాయాది దేశం.. భారత్ వాటర్ దెబ్బతో మరింత తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ ఒప్పందం? దీనిని భారత్ రద్దు చేసుకుంటే పాక్ కు వచ్చే నష్టం ఏమిటన్నది చూద్దాం.
ఏమిటీ ఒప్పందం?
సింధూ నది (ఇండస్ రివర్) టిబెట్ లో పుట్టి.. భారత్, పాక్ మీదుగా 3,180 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. మార్గమధ్యంలో ఈ నదిలోకి ప్రధానంగా ఆరు ఉపనదులు కలుస్తుంటాయి. అయితే, దేశ విభజన తర్వాత సింధు జలాల నిర్వహణపై భారత్, పాక్ మధ్య ప్రాజెక్టులు కట్టడం, నీటిని వాడుకోవడం, ఇతర విషయాల్లో తలెత్తిన వివాదాలు వచ్చాయి. దీంతో 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ ఆయూబ్ ఖాన్ సింధు జలాల ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం.. సింధు నదీ వ్యవస్థలో తూర్పు భాగంలోని రావి, బియాస్, సట్లెజ్ నదులను భారత్ కు, పశ్చిమ భాగంలోని ఇండస్, ఝీలం, చీనాబ్ నదులను పాకిస్తాన్ కు కేటాయించారు. మొత్తంగా సింధు జలాల్లో దిగువన ఉన్న పాకిస్తాన్ 80% జలాలను వాడుకుంటుండగా.. పైన ఉన్న ఇండియా మాత్రం కేవలం 20% జలాలనే వాడుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాకుండా పశ్చిమ నదుల్లో ఇండియా హైడ్రోపవర్ కు, తాగునీటికి మాత్రం అది కూడా పరిమితంగానే నీటిని వాడుకోవాలని, పాకిస్తాన్ కు నీటిని అడ్డుకోవడం లేదా వరదలను సృష్టించడం వంటివి చేయరాదని ఒప్పందంలో పేర్కొన్నారు.
ఒప్పందం రద్దయితే పాక్ కకావికలం!
సింధు జలాల ఒప్పందం రద్దయితే.. పైన ఉన్న భారత్ ఆ నదీ జలాలు పాక్ కు వెళ్లకుండా ఆనకట్టలు కట్టుకోవచ్చు. లేదా భారత్ లోని ఇతర ప్రాంతాలకు నీటిని మళ్లించుకోవచ్చు. ఇదే గనక జరిగితే.. పాకిస్తాన్ లోని పంజాబ్, సింధు ప్రావిన్స్ లు ఎడారిగా మారే ప్రమాదంలో పడతాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ లోని వ్యవసాయ భూముల్లో 80% (పంజాబ్, సింధు ప్రావిన్స్ లోనే ఉన్నాయి) భూములకు సింధు జలాలే కీలకం. ఈ రెండు ప్రావిన్స్ లలో వ్యవసాయ రంగానికి సింధు నదీ జలాల నుంచే 93% సాగునీళ్లు అందుతున్నాయి. పాక్ గ్రామీణ జనాభాలో దాదాపు 61% మంది (23.7 కోట్ల మంది) ఇండస్ బేసిన్ లోనే నివసిస్తున్నారు.
కరాచీ, లాహోర్, ముల్తాన్ వంటి ప్రధాన నగరాలకు సింధు నదీ వ్యవస్థ నుంచే తాగునీరు సరఫరా అవుతోంది. అంతేకాకుండా తర్బెలా, మంగ్లా వంటి హైడ్రో పవర్ ప్లాంట్లు కూడా పాక్ కు కరెంట్ సప్లైలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇండస్ బేసిన్ లో పండే గోధుమలు, వడ్లు, చెరకు, పత్తి వంటి పంటల ద్వారా ఇండస్ బేసిన్ ప్రాతం నుంచే పాకిస్తాన్ జీడీపీకి 25% వాటా సమకూరుతోంది. అందుకే ఇండస్, ఝీలం, చీనాబ్ నదుల నుంచి నీటి ప్రవాహాలు తగ్గిపోతే పాక్ లోని ఇండస్ బేసిన్ అంతా తీవ్రమైన నీటి కరువు ఏర్పడుతుంది.
వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది. కోట్లాది మందికి ఆహార భద్రత కరువవుతుంది. అనేక సిటీలకు నీటి సప్లై నిలిచిపోయి గందరగోళం తలెత్తుతుంది. ఇండ్లకు, ఇండస్ట్రీలకు కరెంట్ సప్లైకి ఇబ్బందులు వస్తాయి. ఉపాధి పడిపోతుంది. నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరుగుతాయి. దీర్ఘకాలం నీటి ప్రవాహాలను అడ్డుకుంటే పంజాబ్, సింధు ప్రావిన్స్ లు కాలక్రమంలో ఎడారులుగా మారతాయని అంటున్నారు. చివరకు ఇండస్ బేసిన్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రజల వలసపోయే పరిస్థితులు వస్తాయని చెప్తున్నారు.
దౌత్య, న్యాయ అడ్డంకులు
సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు భారత్ ప్రకటించినా.. ఇది అనుకున్నంత ఈజీగా ఉండబోదని విశ్లేషకులు అంటున్నారు. ఇది అంతర్జాతీయ ఒప్పందం కావడంతోపాటు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం ఉన్నందున భారత్ కు దౌత్య, న్యాయపరమైన అడ్డంకులూ ఎదురవుతాయని చెప్తున్నారు.
ప్రధానంగా పాక్ కు చైనా, టర్కీ, ఇతర ఇస్లామిక్ దేశాల నుంచి మద్దతు లభించవచ్చని.. చైనా తన భూభాగం నుంచి భారత్ లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిని కంట్రోల్ చేయడం ద్వారా పాక్ కు సహకరించవచ్చని భావిస్తున్నారు. అలాగే తమ దేశ మనుగడను దెబ్బతీసేలా భారత్ ఏకపక్ష నిర్ణయం తీసుకుందంటూ ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కోర్టులను పాక్ ఆశ్రయించే అవకాశాలూ ఉంటాయని అంటున్నారు.
యుద్ధాలు జరిగినా.. ఒప్పందానికి కట్టుబడి..
గత ఆరు దశాబ్దాల కాలంలో భారత్, పాక్ మధ్య1965, 1971, 1999లో మూడు యుద్ధాలు జరిగినా.. అనేక సార్లు సరిహద్దు ఘర్షణలు, సీమాంతర ఉగ్రవాద దాడుల వంటివి జరిగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా.. ఇప్పటివరకూ రెండు దేశాలూ ఈ ఒప్పందానికి కట్టుబడుతూనే వస్తున్నాయి. దిగువన ఉన్న పాకిస్తాన్ కు నీళ్లు వెళ్లకుండా అడ్డుకునేందుకు భారత్ ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు.
గతంలో టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు సింధు జల ఒప్పందాన్ని పున:సమీక్షిస్తామని భారత్ హెచ్చరికలతోనే సరిపెట్టింది. కానీ, తాజాగా పహల్గాం ఉగ్రదాడి తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో చరిత్రలోనే తొలిసారిగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి పాక్ కు షాక్ ఇచ్చింది.