- సూర్య దంచెన్..
- 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి
- ఇంగ్లిస్ సెంచరీ వృథా
విశాఖపట్నం: వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై నిరాశపర్చిన సూర్యకుమార్ యాదవ్ (42 బాల్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80) తొందరగానే తేరుకున్నాడు. ఇషాన్ కిషన్ (39 బాల్స్‌లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 58) తో కలిసి కంగారూల బౌలింగ్‌ను చితక్కొట్టాడు. ఫలితంగా గురువారం జరిగిన తొలి టీ20లో ఇండియా 2 వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. టాస్ ఓడిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 208/3 స్కోరు చేసింది. జోష్ ఇంగ్లిస్ (50 బాల్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 110), స్మిత్ (41 బాల్స్‌లో 8 ఫోర్లతో 52) దంచికొట్టారు. తర్వాత ఇండియా 20 ఓవర్లలో 209/8 స్కోరు చేసింది. రింకూ సింగ్ (22) విన్నింగ్ సిక్స్‌తో మ్యాచ్ గెలిపించాడు. సూర్యకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 ఆదివారం తిరువనంతపురంలో జరుగుతుంది.
ఇంగ్లిస్ జోరు..
షార్ట్ (13)తో కలిసి ఓపెనింగ్‌కు వచ్చిన స్మిత్ మూడు ఫోర్లతో టచ్‌లోకి వచ్చాడు. ఫోర్త్ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన షార్ట్‌ను తర్వాతి ఓవర్‌లో రవి బిష్ణోయ్ (1/54) ఔట్ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 31 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయ్యింది. ఈ దశలో వచ్చిన ఇంగ్లిస్ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. పవర్‌ప్లేలో 40/1తో ఉన్న ఆసీస్‌కు భారీ స్కోరు అందించాడు. 8వ ఓవర్‌లో 4, 6, 4, 4, ఆ వెంటనే మరో సిక్స్, ఫోర్ కొట్టడంతో ఫస్ట్ టెన్‌లో కంగారూల స్కోరు 83/1కి పెరిగింది.
సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేసిన స్మిత్ ఎక్కువగా ఇంగ్లిస్‌కు బ్యాటింగ్ ఇచ్చాడు. 12వ ఓవర్‌లో ఇంగ్లిస్ 6, 4, 6తో 18 రన్స్ రాబట్టాడు. ఈ క్రమంలో 29 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతను తర్వాతి ఓవర్లలో మరింత రెచ్చిపోయాడు. ప్రసిధ్ (1/50), రవిని టార్గెట్ చేసి నాలుగు భారీ సిక్సర్లు కొట్టాడు. మధ్యలో ఫోర్, సింగిల్స్ తీసిన స్మిత్ 40 బాల్స్‌లో ఫిఫ్టీ కొట్టి రనౌటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 133 (66 బాల్స్) రన్స్ భాగస్వామ్యం ముగిసింది.17వ ఓవర్‌లో నాలుగు ఫోర్లు కొట్టిన ఇంగ్లిస్ 47 బాల్స్‌లోనే సెంచరీ పూర్తి చేశాడు. కానీ 18వ ఓవర్‌లో ప్రసిధ్ స్లో బాల్‌ను డీప్ స్క్వేర్ లెగ్‌లో ఆడబోయి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చాడు. చివర్లో స్టోయినిస్ (7 నాటౌట్), టిమ్ డేవిడ్ (19 నాటౌట్) మెరుగ్గా ఆడి స్కోరును 200లు దాటించారు.
సూర్య, ఇషాన్ అదుర్స్..
ఛేజింగ్‌లో ఇండియాకు ఆరంభం కలిసి రాలేదు. 22 రన్స్‌కే రుతురాజ్ (0), యశస్వి జైస్వాల్ (21) ఔటయ్యారు. ఇక్కడి నుంచి ఇషాన్, సూర్య కుమార్ దుమ్మురేపారు. ఈ ఇద్దరు పోటీపడి ఫోర్లు, సిక్సర్లు బాదడంతో పవర్‌ప్లేలో ఇండియా 63/2 స్కోరు చేసింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత సూర్య నెమ్మదించినా ఇషాన్ 9వ ఓవర్‌లో 4, 6, 6తో 19 రన్స్ రాబట్టాడు. దీంతో టెన్ ఓవర్స్‌లో ఇండియా 106/2 స్కోరు చేసింది.
ఆ వెంటనే మరో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదిన ఇషాన్ 37 బాల్స్‌లో ఫిఫ్టీ కొట్టాడు. కానీ 13వ ఓవర్‌లో సంగా (2/47) అతన్ని ఔట్ చేయడంతో రెండో వికెట్‌కు 112 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. సూర్య 29 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసినా అవతలి వైపు తిలక్ వర్మ (12) నిరాశపర్చాడు. 154/4 వద్ద వచ్చిన రింకూ సింగ్ (28 నాటౌట్) రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చాడు. సూర్య మూడు ఫోర్లు, సిక్స్‌తో 80లోకి వచ్చాడు. అదే జోరులో బెరెన్‌డార్ఫ్ (1/25) బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔటయ్యాడు.
ఫలితంగా ఐదో వికెట్‌కు 40 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. 6 బాల్స్‌లో 7 రన్స్ చేయాల్సిన దశలో అబాట్ ఓవర్‌లో అక్షర్ పటేల్ (2), రవి బిష్ణోయ్ (0), అర్ష్‌దీప్ (0) ఔట్ కావడంతో ఒత్తిడి పెరిగినా రింకూ విన్నింగ్ సిక్స్ కొట్టాడు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: 20 ఓవర్లలో 208/3 (ఇంగ్లిస్ 110, స్మిత్ 52, ప్రసిధ్ 1/50, రవి బిష్ణోయ్ 1/54). ఇండియా: 20 ఓవర్లలో 209/8 (సూర్య 80, ఇషాన్ 58,సంగా 2/47).