రాజ్‌గిర్ (బిహార్): డిఫెండింగ్ చాంపియన్ ఇండియా విమెన్స్ హాకీ టీమ్.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో దుమ్మురేపింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 3–0తో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ చైనాకు చెక్ పెట్టి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఇండియా తరఫున సంగీతా కుమారి (32వ ని), సలీమా టీటీ (37వ ని) ఫీల్డ్ గోల్స్ చేయగా, దీపిక (60వ ని) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది.
ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇండియాకు ఇది వరుసగా నాలుగో విజయం. మొత్తం 12 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. చైనా (9) రెండో ప్లేస్‌లో ఉంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఇండియా.. చైనా డిఫెన్స్‌లోకి చొచ్చుకుపోయింది. రెండో హాఫ్‌లో స్ట్రాటజీ మార్చి అటాకింగ్ పెంచింది. దీంతో ఐదు నిమిషాల వ్యవధిలోనే రెండు ఫీల్డ్ గోల్స్ వచ్చాయి. ఈ దశలో స్కోరు సమం చేసేందుకు చైనీయులు చేసిన ప్రయత్నాన్ని ఇండియా డిఫెన్స్ సమర్థంగా నిలువరించింది. ఇక చివరి నిమిషంలో లభించిన పెనాల్టీని దీపిక గోల్‌గా మలిచి చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఆదివారం జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇండియా.. జపాన్‌తో తలపడుతుంది. ఇతర మ్యాచ్‌లో జపాన్ 2–1తో మలేసియాపై, కొరియా 4–0తో థాయ్‌లాండ్‌పై గెలిచాయి.