- 79 రన్స్ తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా
- రాణించిన హర్జాస్, వీబ్జెన్, పీక్
- లింబానీ, ఆదర్ష్, అభిషేక్ పోరాటం వృథా
బెనోని: అండర్–19 వరల్డ్ కప్‌లో యంగ్ టీమిండియా ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టింది. బ్యాటింగ్ వైఫల్యంతో.. ఆదివారం జరిగిన ఫైనల్లో 79 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో కంగుతిన్నది. దీంతో రెండున్నర నెలల కిందట రోహిత్‌సేన మాదిరిగానే ట్రోఫీ లేకుండా రిక్త హస్తాలతో వెనుదిరిగింది. టాస్ గెలిచిన ఆసీస్ 50 ఓవర్లలో 253/7 స్కోరు చేసింది.
హర్జాస్ సింగ్ (55), హ్యూ వీబ్జెన్ (48), హ్యారీ డిక్సన్ (42), ఒలివర్ పీక్ (46 నాటౌట్) రాణించారు. తర్వాత ఇండియా 43.5 ఓవర్లలో 174 రన్స్‌కే కుప్పకూలింది. ఆదర్ష్ సింగ్ (47), మురుగన్ అభిషేక్ (42) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. బియర్డ్‌మన్ (3/15)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, క్వెనా ఎంపాక (సౌతాఫ్రికా)కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ఆసీస్‌కు ఇది నాలుగో టైటిల్ కావడం విశేషం.
ఆదుకున్న వీజ్జెన్, హర్జాస్..
ఆసీస్‌కు ఇన్నింగ్స్ 3వ ఓవర్‌లోనే రాజ్ లింబానీ (3/38) షాకిచ్చాడు. సామ్ కాన్‌స్టాస్ (0)ను డకౌట్ చేశాడు. దీంతో 16/1 స్కోరు వద్ద వచ్చిన కెప్టెన్ వీబ్జెన్ ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు. నమన్ తివారీ (2/63) లైన్ లెండ్ లెంగ్త్‌తో హడలెత్తించినా మరో ఓపెనర్ హ్యారీ డిక్సన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. 18.1 ఓవర్లలో ఈ జోడీ రెండో వికెట్‌కు 78 రన్స్ జత చేసింది.
అయితే నమన్ వరుస ఓవర్లలో ఈ ఇద్దర్ని ఔట్ చేయడంతో ఆసీస్ 99/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో హర్జాస్, రైన్ హిక్స్ (20) నిలకడగా ఆడారు. అయితే 35వ ఓవర్‌లో హిక్స్‌ను ఔట్ చేయడంతో నాలుగో వికెట్‌కు 11.2 ఓవర్లలో 66 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. 59 బాల్స్‌లో హర్జాస్ హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, కొత్తగా వచ్చిన ఒలివర్ పీక్ నిలకడగా ఆడాడు. ఐదో వికెట్‌కు 16 రన్స్ జత చేసి హర్జాస్ వెనుదిరిగినా లోయర్ ఆర్డర్‌లో మెక్‌మిలన్ (2), అండర్సన్ (13), స్ట్రాకెర్ (8 నాటౌట్) అండగా నిలిచారు. ఈ ముగ్గురితో కలిసి 72 రన్స్ జోడించారు.
ఇద్దరే ఆడిన్రు..
ఛేజింగ్‌లో ఇండియాకు ఏదీ కలిసి రాలేదు. ఓపెనర్ ఆదర్ష్ సింగ్ పోరాడినా.. రెండో ఎండ్‌లో సహకారం కరువైంది. 3వ ఓవర్‌లో అర్షిన్ కులకర్ణి (3)తో మొదలైన వికెట్ల పతనానికి ఎక్కడా అడ్డుకట్ట పడలేదు. ముషీర్ ఖాన్ (22) రెండో వికెట్‌కు 37 రన్స్ జోడించి ఔటయ్యాడు. దీంతో 40/2తో కష్టాల్లో పడిన ఇండియాను మిడిలార్డర్‌లో ఒక్కరు కూడా ఆదుకోలేదు.
ఆదర్ష్ నిలకడగా ఆడినా.. అవతలి వైపు ఉదయ్ (8), సచిన్ దాస్ (9), ప్రియాన్షు మోలియా (9), అరవల్లి అవనీశ్ (0) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 51 రన్స్ తేడాలో 4 వికెట్లు పడటంతో ఇండియా ఇన్నింగ్స్ కోలుకోలేదు. చివర్లో అభిషేక్ బ్యాట్ అడ్డేసినా చేయాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగింది. 31వ ఓవర్‌లో ఆదర్ష్ ఔట్‌కావడంతో ఇండియా ఆశలు సన్నగిల్లాయి. రాజ్ లింబానీ (0) ఫెయిలైనా, నమన్ తివారీ (14 నాటౌట్) ఆడే ప్రయత్నం చేశాడు. కానీ 41వ ఓవర్‌లో అభిషేక్, ఆ వెంటనే సౌమీ పాండే (2) ఔట్‌కావడంతో ఇండియా విజయానికి చాలా దూరంలో ఆగిపోయింది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: 50 ఓవర్లలో 253/7 (హర్జాస్ సింగ్ 55, హ్యూ వీబ్జెన్ 48, ఒలివర్ పీక్ 46*, రాజ్ లింబానీ 3/38).
ఇండియా: 43.5 ఓవర్లలో 174 ఆలౌట్ (ఆదర్ష్ సింగ్ 47, అభిషేక్ 42, బియర్డ్‌మన్ 3/15, మెక్‌మిలన్ 3/43).