ఇక చాలు.. మా వాళ్లను త్వరగా తిరిగి పంపండి: రష్యాకు భారత్ డిమాండ్

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య దాదాపు రెండు సంవత్సరాలుగా భీకర యుద్ధం జరుగుతూనే ఉంది. ఉక్రెయిన్‎తో యుద్ధం కోసం రష్యా కొందరు భారతీయులను తమ ఆర్మీలో జాయిన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ సైనికుల చేతిలో ఇప్పటికే కొందరు భారతీయ జవాన్లు హతం కాగా.. తాజా మరో భారతీయుడు యుద్ధంలో మృతి చెందాడు. మరో ఇండియన్ సోల్జర్ తీవ్రంగా గాయపడ్డాడు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయుల మృతిపై కేంద్ర ప్రభుత్వం ఘాటు రియాక్ట్ అయ్యింది. 

రష్యన్ ఆర్మీలో ఉన్న భారతీయ సైనికులను త్వరగా తిరిగి ఇండియాకు పంపాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘రష్యన్ ఆర్మీలో పనిచేయడానికి రిక్రూట్ అయిన కేరళకు చెందిన భారతీయుడు దురదృష్టవశాత్తు మరణించినట్లు మాకు తెలిసింది. మృతుడి కుటుంబానికి మేము మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అదే విధంగా కేరళకు చెందిన మరో ఇండియన్ గాయపడి మాస్కోలో చికిత్స పొందుతున్నాడు’ అని పేర్కొన్నారు. 

ALSO READ | 2024 ఎన్నికల్లో నిజంగా మోడీ ఓడిపోయారా..?: జుకర్ బర్గ్‎కు పార్లమెంటరీ కమిటీ నోటీసులు

యుద్ధంలో మరణించిన భారతీయ పౌరుడి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి మాస్కోలోని రాయబార కార్యాలయం కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. మృతుడి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. డెడ్ బాడీని ఇండియాకు తీసుకొచ్చేందుకు రష్యా అధికారులతో కలిసి పని చేస్తున్నామని పేర్కొన్నారు. 

అలాగే యుద్ధంలో గాయపడి చికిత్స పొందుతోన్న వ్యక్తిని కూడా డిశ్చార్జ్ చేసి త్వరగా భారత్‎కు పంపాలని రష్యా అధికారులకు సూచించామని తెలిపారు. మాస్కోలోని రష్యన్ అధికారులతో పాటు న్యూఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయానికి ఈ విషయం గట్టిగా చెప్పామన్నారు. అలాగే, యుద్ధం కోసం రిక్రూట్ చేసుకున్న మిగిలిన భారతీయ పౌరులను కూడా త్వరగా ఇండియాకు పంపించాలని రష్యాను ఇండియా డిమాండ్ చేసింది.