ప్రపంచ ఫ్యాక్టరీగా ఇండియా: ప్రధాని మోదీ

ప్రపంచ ఫ్యాక్టరీగా ఇండియా: ప్రధాని మోదీ
  • ఫలించిన ‘వోకల్​ ఫర్​లోకల్’​ నినాదం: ప్రధాని మోదీ
  • ప్రపంచానికే ఇన్నోవేషన్​ హబ్​గా దేశం ఎదుగుతున్నది
  • శ్రామిక శక్తినుంచి ప్రపంచ శక్తిగా భారత్​ ఎదిగిందని వెల్లడి

న్యూఢిల్లీ: ఇండియన్​ ప్రొడక్ట్స్​కు  ప్రపంచవ్యాప్తంగా డిమాండ్​ పెరిగిందని, ఇప్పుడు దేశం ప్రపంచ కర్మాగారంగా ఎదుగుతున్నదని ప్రధాని మోదీ అన్నారు. తమ ‘వోకల్ ఫర్​లోకల్​’ నినాదం ఫలించిందని ఆనందం వ్యక్తంచేశారు.  

శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్‌‌‌‌ఎక్స్‌‌‌‌టీ కాన్‌‌‌‌క్లేవ్‌‌‌‌లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..భారత్‌‌‌‌ గురించి చాలా సానుకూల వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం దేశంవైపే ఆసక్తిగా చూస్తోందని, ప్రపంచ దేశాల ప్రజలు భారత్‌‌‌‌కు రావాలని కోరుకుంటున్నారని, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసు కోవాలని అనుకుంటున్నారని చెప్పారు. 

ప్రపంచానికి సున్నాను పరిచయం చేసిన భారత్​.. ఇప్పుడు అనంతమైన ఆవిష్కరణలకు వేదికగా మారిందని, అన్నింటికీ అనువైన పరిష్కారాలను ప్రపంచానికి అందిస్తోందని తెలిపారు. 

మనల్ని ఫారినర్స్​ ఫాలో అవుతున్నారు

భారత్​ అంటే ఇన్నేండ్లు ప్రపంచ దేశాలు కేవలం శ్రామిక శక్తిగా మాత్రమే చూశాయని, కానీ ప్రస్తుతం ప్రపంచ శక్తిగా దేశం ఎదిగిందని మోదీ తెలిపారు. ప్రపంచానికే మాన్యుఫాక్చరింగ్​ హబ్​గా మారిందని చెప్పారు.

సెమీకండక్టర్లు, విమాన వాహక నౌకల తయారీ వంటి వాటిలో వేగంగా అభివృద్ధి చెందుతూ.. ఆటోమొబైల్ ఉత్పత్తిదారుగా మారిందని అన్నారు. దేశంలో లభించే  మఖానా, మిల్లెట్స్, ఆయుష్ ప్రొడక్ట్స్​తోపాటు మనం పాటించే యోగా, ధ్యానం వంటి వాటిని ఫారినర్స్​ ఫాలో అవుతున్నారని వెల్లడించారు. 

వ్యవసాయ బడ్జెట్​ను త్వరగా అమలుచేయాలి

వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్ ప్రతిపాదనలను త్వరితగతిన అమలు చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కొత్త బడ్జెట్​పై చర్చలను ఆపి.. చర్యలపై దృష్టిసారించాలని సూచించారు. 

శనివారం నిర్వహించిన ‘అగ్రికల్చర్​ అండ్​ రూరల్​ప్రాస్పరిటీ’ వెబినార్​లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎన్డీయే నేతృత్వంలోని సర్కారు తన మూడో టర్మ్​లో ప్రవేశపెట్టిన  ఈ కొత్త బడ్జెట్ వికసిత్​ భారత్​ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. ​

బడ్జెట్​ అమలులో లోపాలు, అడ్డంకులను అధిగమించాలని సూచించారు. వ్యవసాయాన్ని వృద్ధికి మొదటి ఇంజిన్​గా పరిగణిస్తున్నామని, వ్యవసాయ వృద్ధి, గ్రామీణ శ్రేయస్సు సాధించాలనే జంట లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. వికసిత్​ భారత్​ లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని, ఏ రైతునూ వదిలిపెట్టకుండా ప్రతి అన్నదాతను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

‘‘మేం దేశ వ్యవసాయ సామర్థ్యాన్ని పెంచాం. దశాబ్దం క్రితం ఆహార ధాన్యాల ఉత్పత్తి 265 మిలియన్​ టన్నులు ఉంటే.. ఇప్పుడు దాన్ని 330 మిలియన్​ టన్నులకు పెంచాం. అలాగే, హార్టికల్చర్​ ప్రొడక్షన్​ కూడా 350 మిలియన్​ టన్నులకుపైగా పెరిగింది” అని వెల్లడించారు. 

కొత్త బడ్జెట్​లో ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన’ గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు, ఇది తమకు చాలా ముఖ్యమైన పథకమని చెప్పారు.  తక్కువ పంట దిగుబడి ఉన్న 100 జిల్లాలపై దృష్టిసారించేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని తెలిపారు.