- డిమాండ్‌కు సంబంధించిన సమస్యలు లేకపోలేదు: ఫైనాన్స్ మినిస్ట్రీ మంత్లీ రిపోర్ట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని, కానీ డిమాండ్‌కు సంబంధించిన సమస్యలు లేకపోలేదని ఫైనాన్స్ మినిస్ట్రీ తన సెప్టెంబర్ రిపోర్ట్‌లో పేర్కొంది. వ్యవసాయ రంగం పనితీరు మెరుగ్గా ఉందని, ఫెస్టివల్ సీజన్‌తో డిమాండ్ పుంజుకుంటుందని అంచనా వేసింది. ప్రభుత్వ ఖర్చులు పెరుగుతాయని, ఫలితంగా పెట్టుబడులు పెరుగుతాయని పేర్కొంది. వినియోగం పడిపోవడంతో పట్టణాల్లో డిమాండ్ తక్కువగా ఉందని తెలిపింది. ‘ జియో పొలిటికల్ టెన్షన్లతో కొన్ని అభివృద్ది చెందిన దేశాల మార్కెట్ల వాల్యుయేషన్స్ భారీగా పెరిగిపోయాయి. గ్లోబల్ ఎకానమీ ఇబ్బందుల్లో ఉంది.
వీటి ఎఫెక్ట్‌తో ఇండియా ఆర్థిక వృద్ధి నెమ్మదించొచ్చు’ అని మంత్లీ ఎకనామిక్ రివ్యూలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ పేర్కొంది. అసాధారణ వర్షాల కారణంగా కొన్ని కూరగాయల సప్లయ్ ఈ ఏడాది తగ్గిందని, దీంతో వరుసగా రెండు నెలల పాటు తక్కువగా నమోదైనా ఇన్‌ఫ్లేషన్, సెప్టెంబర్‌లో మళ్లీ పెరిగిందని వివరించింది. కొన్ని కూరగాయల ధరలను పక్కన పెడితే ఓవరాల్ ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్‌లోనే ఉందని ఫైనాన్స్ మినిస్ట్రీ రిపోర్ట్ పేర్కొంది.
డాలర్ మారకంలో రూపాయి నిలకడగా ఉందని, ఫారెక్స్ రిజర్వ్‌లు మొదటిసారిగా కిందటి నెలలో 700 బిలియన్ డాలర్లను టచ్ చేశాయని తెలిపింది. జాబ్ మార్కెట్‌కు సంబంధించి మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌లో ఉద్యోగాలు పెరుగుతున్నాయని తెలిపింది. కానీ, ఏఐ వలన జాబ్స్ పోవడం మొదలైందని, దీన్ని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 6.5 శాతం–7 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.