- క్రూడ్ పామ్, సోయాబిన్, సన్‌ఫ్లవర్ ఆయిల్స్‌పై 5.5 శాతం నుంచి 27.5 శాతానికి దిగుమతి సుంకం పెంపు
- గ్లోబల్‌గాపెరుగుతున్నడిమాండ్
- గత నెల రోజుల్లో 17 శాతం వరకు పెరిగిన రేట్లు
- కిందటేడాది దీపావళి టైమ్‌తో పోలిస్తే 32 శాతం వరకు అప్
న్యూఢిల్లీ: వంటనూనె ధరలు ఇప్పటిలో తగ్గేటట్టు కనిపించడం లేదు. ప్రభుత్వం కిందటి నెల 16 న పామ్, సోయాబిన్, సన్‌ఫ్లవర్ క్రూడాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 5.5 శాతం నుంచి 27.5 శాతానికి పెంచింది. అంతేకాకుండా రిఫైన్డ్ వంటనూనె దిగుమతులపై కూడా సుంకాన్ని 13.7 శాతం నుంచి 35.75 శాతానికి పెంచింది. దీంతో పాటు గ్లోబల్‌గా వీటికి ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. గత నెల రోజుల్లో పామ్ ఆయిల్ ధరలు 10.6 శాతం, సోయాబిన్ ఆయిల్ ధరలు 16.8 శాతం, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు 12.3 శాతం పెరిగాయి. దేశంలో వంట నూనెల రేట్లు మరికొన్ని నెలల పాటు గరిష్టాల్లోనే ఉంటాయని ఫుడ్ మినిస్ట్రీ అధికారులు చెబుతున్నారు.
మనకు అవసరమయ్యే వంటనూనెలో 58 శాతాన్ని దిగుమతుల ద్వారానే చేరుకుంటున్నాం. దీంతో గ్లోబల్‌గా రేట్లు పెరిగినా, ఇంపోర్ట్ డ్యూటీ పెరిగినా రిటైల్ ధరల్లో మార్పుంటుందని గుర్తుంచుకోవాలి. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈఏ) విడుదల చేసిన డేటా ప్రకారం, గ్లోబల్‌గా క్రూడ్ పామ్ ఆయిల్ ధర టన్నుకు 1,145 డాలర్లు (సుమారు రూ.95 వేలు) పలుకుతోంది. సోయాబిన్ ఆయిల్ ధర టన్నుకు 1,160 డాలర్లు (రూ.96 వేలు), సన్ ఫ్లవర్ ఆయిల్ ధర టన్నుకు 1,165 డాలర్లు(రూ.96,700) గా ఉంది. కిందటేడాది ఇదే టైమ్‌తో పోలిస్తే క్రూడ్ పామ్ ఆయిల్ రేట్లు 32 శాతం పెరగగా, సోయాబిన్ ఆయిల్ ధరలు 18 శాతం,సన్‌ఫ్లవర్ ఆయిల్ రేటు 26 శాతం ఎగిశాయి.
సుంకాలు పెంచాక రేట్లు పైకి
కిందటి నెలలో వంట నూనెల దిగుమతులపై ప్రభుత్వం సుంకాలను పెంచింది. దీంతో ఈ ఏడాది ఆగస్టు వరకు నిలకడగా ఉన్న వంట వీటి ధరలు, సెప్టెంబర్ నుంచి పెరుగుతున్నాయి. కన్జూమర్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన డేటా ప్రకారం, ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీ పెంచకముందు ఆవనూనె రేటు లీటర్‌కు రూ.135 ఉండగా, ఈ నెల 24 నాటికి రూ.181కి, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర లీటర్‌కు రూ.126 నుంచి రూ.148 కి పెరిగాయి.
సోయాబిన్ ఆయిల్ ధర లీటర్‌కు రూ.143 దగ్గర కొనసాగుతోంది. ప్రస్తుత ఆయిల్ ఇయర్ (నవంబర్ 2023– అక్టోబర్ 2024) లో వంట నూనె దిగుమతులు 1.65 కోట్ల టన్నులుగా రికార్డ్ అవుతాయని ఎస్‌ఈఏ అంచనా వేస్తోంది. అంతకు ముందు ఆయిల్ ఇయర్‌లో వంటనూనె దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 17 శాతం పెరిగి 1.47 కోట్ల టన్నులకు చేరుకున్నాయి. అప్పుడు దిగుమతి సుంకాలు తక్కువగా ఉండడంతో ఇంపోర్ట్స్ పెరిగాయి. కాగా, వంట నూనెల వినియోగంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఇండియా కొనసాగుతోంది. వెజిటెబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్‌లో టాప్‌లో ఉంది. ఇండియాలో ఆవనూనె, సోయాబిన్ నూనె, వేరుశెనగ నూనె ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి.
దిగుమతులు తగ్గించేందుకు..
దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వ సంస్థలు నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్‌లు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రైతుల నుంచి మద్ధతు ధరకే 28 లక్షల టన్నుల సోయాబిన్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ సంస్థలు ఇప్పటికే హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ రైతుల నుంచి రబీ సీజన్‌లో 12 లక్షల టన్నుల ఆవాలను కొనుగోలు చేశాయి.
మరోవైపు సప్లయ్ తక్కువగా ఉండడంతో పామ్ ఆయిల్ ధరలు గ్లోబల్‌గా పెరుగుతున్నాయి. దీంతో ఇండియా, చైనా వంటి దేశాల్లో ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ ఆయిల్ ధరలు ఈ నెలలో ఇప్పటి వరకు 12.7 శాతం పెరిగాయి. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌ల్యాండ్‌లలో వీటి ప్రొడక్షన్ తగ్గుతుందని అంచనా.