రిజల్ట్ డే .. లోక్​సభ ఫలితాలపైనే పార్టీల భవిష్యత్!

రిజల్ట్ డే .. లోక్​సభ ఫలితాలపైనే పార్టీల భవిష్యత్!
  • కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్​ఎస్​ లీడర్లలో టెన్షన్​
  • తమ సర్కారు పనితీరుకు రెఫరెండం అన్న సీఎం రేవంత్
  • మెజారిటీ సీట్లు గెలిస్తే పార్టీ, పాలనపై మరింత పట్టు
  • ఎక్కువ సీట్లు తమవేనంటున్న బీజేపీ 
  • బీఆర్ఎస్‌‌కు వన్​ ఆర్​ నన్​ అంటున్న సర్వేలు
  • పది సీట్లకుపైనే వస్తాయని కేసీఆర్​ ధీమా

హైదరాబాద్, వెలుగు:  లోక్​సభ ఎన్నికల ఫలితాల కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. నాయకులంతా గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. లోలోపల టెన్షన్​పడ్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో వివిధ పార్టీల భవిష్యత్‌‌ను నిర్ణయించబోతుండడమే ఈ ఆందోళనకు కారణంగా విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రంలోని మెజార్టీ సీట్లలో గెలుపొందడం ద్వారా ప్రభుత్వంపై పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ 
యోచిస్తున్నది. కాంగ్రెస్‌‌ కంటే ఒక్క సీటైనా ఎక్కువ గెలిస్తే, రాష్ట్రంలో దూకుడు పెంచొచ్చని బీజేపీ అనుకుంటున్నది. ఇక, తాము కనీసం ఒక్క సీటులోనైనా గెలిస్తే, పరువు నిలబడుతుందని.. లేకుంటే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని బీఆర్‌‌‌‌ఎస్ భావిస్తున్నది. 

బీఆర్ఎస్​కు​ చావో రేవో​?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి, రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్​కు ఈ లోక్​సభ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్​ అంచనాలన్నీ రాష్ట్రంలో కాంగ్రెస్‌‌కు, బీజేపీకి నడుమనే ఫైట్ ఉందని.. బీఆర్‌‌‌‌ఎస్ ప్రభావం పెద్దగా లేదని తేల్చాయి.  బీఆర్‌‌‌‌ఎస్‌‌కు ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని అంచనా వేశాయి. కానీ, ఎగ్జిట్ పోల్స్ ఓ గ్యాంబ్లింగ్ అని బీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్ కొట్టి పారేయగా.. ఎగ్జిట్ పోల్స్‌‌తో తమకు సంబంధం లేదని, ఎగ్జాక్ట్‌‌ రిజల్ట్ కోసం తాము ఎదురు చూస్తున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 

తమకు పదికి తక్కువగాకుండా సీట్లు వస్తాయని, బీజేపీకి రాష్ట్రంలో వన్ ఆర్ నన్‌‌‌‌(ఒకటి లేదా సున్నా) సీట్లేనని కేసీఆర్ చెప్తున్నారు. కానీ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కే వన్ ఆర్ నన్ అని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పరిస్థితి ఏమిటన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది. ఎన్నికలకు ముందే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరారు. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది. కేంద్రంలో కూడా బీజేపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అదే నిజమైతే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, బీజేపీకి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ టార్గెట్‌‌‌‌గా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. 

పాలనకు రెఫరెండం అన్న రేవంత్

తెలంగాణలో కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు వస్తే పార్టీపై, పాలనపై ఇటు సీఎంగా అటు పీసీసీ చీఫ్ గా రేవంత్ మరింత పట్టు బిగించనున్నారు. ఈ ఎన్నికలు తమ వంద రోజుల పాలనకు రెఫరెండం అని ఎన్నికల ప్రచారంలో రేవంత్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆయన మూడు రోజుల క్రితం జరిగిన మీడియా చిట్​చాట్​లో కూడా ప్రస్తావిస్తూ.. ఆ మాటకు తాను ఇప్పటికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. కాంగ్రెస్​కు ఎక్కువ సీట్లు వస్తే తమ పాలనకు ప్రజల నుంచి ఆదరణ లభించినట్లు భావిస్తానన్నారు. తక్కువ సీట్లు వస్తే రోజుకు మరో రెండు గంటలు సీఎంగా ఎక్కువ కష్టపడుతానని రేవంత్ స్పష్టం చేశారు. బీజేపీకి రాష్ట్రంలో 4 నుంచి 5 సీట్లకు మించి రావని స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారని ఆయన తెలిపారు.  దీన్నిబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్​కు అత్యధిక సీట్లు రావడం పక్కా అనే ధీమాతో రేవంత్ ఉన్నారు. కానీ, కౌంటింగ్​కు సమయం దగ్గర పడడంతో రాష్ట్రంలో కాంగ్రెస్​కు ఎన్ని సీట్లు రావచ్చనే దానిపైనే ఇటు పార్టీ లీడర్లలో, అటు క్యాడర్​లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది.  

బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందా? 

రాష్ట్రంలో గతంలో బీజేపీకి ఎన్నడూ రానన్ని సీట్లు ఈసారి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. కేంద్రంలో కూడా తమ ప్రభుత్వమే వస్తుందన్న ఎగ్జిట్ పోల్ అంచనాలతో బీజేపీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు గెలిచి, ప్రజలు తమ వైపు ఉన్నారని చెప్పుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. కాంగ్రెస్ కంటే ఓ సీటు ఎక్కువే సాధిస్తామని కమలం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత మరింత దూకుడు పెంచి, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీకి ఇక్కడ మెజార్టీ సీట్లు వస్తే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెడ్తారని, పార్టీని ఇక్కడ బలోపేతం చేయడానికి మరింత ప్రయత్నిస్తారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.