
- పెట్టుబడిదారుల చూపు ఇండియా వైపు మళ్లింది: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించడం ఒకరకంగా మనకు మేలే చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఇండియా వైపే చూస్తున్నారన్నారు. దాన్ని అనుకూలంగా మార్చుకుని, పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. శనివారం పార్క్‌హయత్ హోటల్లో గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండియా లాటిన్‌అమెరికా, కరీబియన్ కంట్రీస్ బిజినెస్ కాన్క్లేవ్’ రెండో ఎడిషన్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తుందన్నారు.
రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటేలా ప్రత్యేక పాలసీని తీసుకొస్తున్నామని తెలిపారు. జహీరాబాద్ నిమ్జ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆరు అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయని వెల్లడించారు. రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులనూ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా ఇండస్ట్రియలిస్టులను ప్రోత్సహించాలని లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల అధికార ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సన్సిటీలోని గ్లెన్డేల్అకాడమీ నిర్వమించిన లీడర్షిప్ డే కార్యక్రమంలో మాట్లాడుతూ..స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు నాయకత్వ లక్షణాలను నేర్పించాలన్నారు. ప్రతి చిన్నారిలోనూ ఏదో ఒక ట్యాలెంట్ఉంటుందని, ఇతరులతో పోల్చి వారిపై ఒత్తిడి తేవొద్దని సూచించారు.