డీప్​సీక్, చాట్ జీపీటీకి పోటీగా ..ఆర్నెల్లలో ఇండియా ఏఐ మోడల్

డీప్​సీక్, చాట్ జీపీటీకి పోటీగా ..ఆర్నెల్లలో ఇండియా ఏఐ మోడల్
  • డీప్​సీక్, చాట్ ​జీపీటీకి పోటీగా తెస్తాం: అశ్వినీ వైష్ణవ్​

న్యూఢిల్లీ:చైనా డీప్​సీక్​, అమెరికా చాట్ ​జీపీటీ వంటి జెనరేటివ్​ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​(ఏఐ) మోడల్​ను మనదేశమూ​ తయారు చేస్తోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ​ప్రకటించారు. నాలుగు నుంచి ఆరు నెలల్లోపు ఇది అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.  

చాట్​ జీపీటీకి పోటీగా వచ్చిన డీప్​సీక్​ఉచితంగా, వేగంగా సేవలు అందిస్తూ సంచలనంగా మారిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. డీప్​సీక్ ​దెబ్బకు ఎన్విడియా వంటి అమెరికా టెక్​ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. 

ఒడిశాలో జరిగిన ఉత్కర్ష్​ ఒడిశా  కాన్​క్లేవ్​లో మంత్రి మాట్లాడుతూ ఈ లార్జ్​లాంగ్వేజ్​ మోడల్ మన సాంస్కృతిక, భాషాపరమైన అవసరాలకు తగినట్టు తయారు చేస్తున్నామని, ఇందుకోసం ఇండియా ఏఐ కంప్యూట్​ ఫెసిలిటీ సహకారం అందిస్తోందని వెల్లడించారు. 

దీనికి 18,693 గ్రాఫిక్​ప్రాసెసింగ్​ యూనిట్లు (జీపీయూలు) ఉంటాయని వైష్ణవ్​ వెల్లడించారు. కనీసం ఆరు స్టార్టప్‌‌‌‌లకు ఏఐ మోడల్స్​ను తయారు చేస్తే సత్తా ఉందని అన్నారు. ‘‘దీని తయారీకి కామన్ ​కంప్యూట్​ ఫెసిలిటీ చాలా ముఖ్యం. అడ్వాన్స్ ఏఐను డెవెలప్​ చేయడానికి రీసెర్చర్లు, స్టార్టప్​లు, విద్యాసంస్థలకు భారీ కంప్యుటేషనల్​ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ​కావాలి. 

ఇండియా ఏఐ మిషన్​లో భాగంగా షేర్డ్​కంప్యూటింగ్​ వనరులను అందించాలని నిర్ణయించాం. దీనికి 19 వేల జీపీయూలను అమర్చాలని నిర్ణయించాం. ఇందులో  12,896 ఎన్విడియా హెచ్100 జీపీయూలు, 1,480 ఎన్విడియా హెచ్​200 జీపీయూలు ఉంటాయి. 

ఇవి అత్యంత శక్తిమంతమైన ఏఐ చిప్స్​. వీటిలో పది వేల జీపీయూలు ఇప్పటికిప్పుడు వాడకానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన వాటిని దశల వారీగా ఉపయోగంలోకి తీసుకువస్తాం. డీప్​సీక్​ కోసం కేవలం రెండు వేల జీపీయూలకు శిక్షణ ఇచ్చారు” అని ఆయన వివరించారు.

జీపీయూలకు సబ్సిడీ

అందుబాటు ధరల్లో జీపీయూలను తీసుకురావడానికి రీసెర్చర్లకు, విద్యాసంస్థలకు 40 శాతం సబ్సిడీ ఇస్తామని మంత్రి చెప్పారు. దీనివల్ల ఒక్కో జీపీయూ అవర్​కు రూ.100 మాత్రమే ఖర్చవుతుందని చెప్పారు. 

ఈ విషయంలో గ్లోబల్​ రేటు రూ.240 వరకు ఉందని, కంప్యూటర్​ పవర్​ యావరేజ్​ రేటు ఒక్కో జీపీయూ అవర్​కు రూ.115.85 వరకు ఉందని వివరించారు. అమెరికా నుంచి ఇండియాకు చిప్స్​  దిగుమతులపై ఆంక్షల గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. మనదేశం ఏడాదికి 50 వేల దాకా జీపీయూ చిప్స్​ను కొనొచ్చని చెప్పారు. 

మనపై అన్ని దేశాలకూ గౌరవం ఉంది కాబట్టి ఇండియా ఏఐ మిషన్​కు ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని మంత్రి వైష్ణవ్ స్పష్టం చేశారు. డేటా భద్రత గురించి స్పందిస్తూ లామా మాదిరే చైనా ఓపెన్​సోర్స్ ​ఏఐ  మోడల్ ​డీప్​సీక్ త్వరలోనే ఇండియా సర్వర్ల ద్వారా పనిచేస్తుందని వెల్లడించారు.