వార్‌పై రష్యాకు వ్యతిరేక తీర్మానం.. ఓటేయని భారత్

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగడాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి (యూఎన్) భద్రతా మండలిలో అమెరికా ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై 15 సభ్య దేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసి, ఆ దేశం దాడిని ఖండించాయి. అయితే భద్రతామండలిలో ఐదు శాశ్వత దేశాల్లో ఒకటైన రష్యా తన వీటో అధికారాన్ని ఉపయోగించి ఈ తీర్మానాన్ని తిరస్కరించింది. తాత్కాలిక సభ్య దేశంగా ఉన్న భారత్.. ఈ ఓటింగ్ లో ఏ పక్షానికీ మద్దతు తెలపలేదు. తమ ఓటు ఎవరికీ వేయకుండా ఉండడానికి కారణాన్ని యూఎన్ లో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ మూర్తి వివరించారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతున్న పరిణామాలపై భారత్ ను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. తక్షణం ఉక్రెయిన్ పై దాడిని నిలిపేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని కోరారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని సూచించారు. మనుషుల ప్రాణాలను బలితీసుకోవడం ద్వారా ఎటువంటి పరిష్కారమూ సాధ్యం కాదని అన్నారు. ఉక్రెయిన్ లో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్, పౌరుల రక్షణపై మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. యూఎన్ చార్టర్, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, ఇతర దేశాల భౌగోళిక సరిహద్దులు, సార్వభౌమత్వాన్ని గౌరవించి సభ్య దేశాలన్నీ నిర్మాణాత్మకమైన అడుగులు వేయాలని కోరారు. చర్చల ద్వారా మాత్రమే విభేదాలు, వివాదాలను పరిష్కరించుకోవాలని టీఎస్ మూర్తి చెప్పారు. ప్రస్తుతం ఉక్రెయిన్ విషయంలో దౌత్య పరమైన పరిష్కార మార్గాలను వదిలేయడం బాధాకరమని, ఇప్పటికైనా ఈ దిశగా ఆలోచించాలని కోరారు. ఈ అంశాలకు అవకాశమివ్వాలన్న ఉద్దేశంతో తాము ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.

ప్రపంచం గొంతు నొక్కలేరు

రష్యాకు వ్యతిరేకంగా అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ లో భారత్ తో పాటు చైనా, యూఏఈ కూడా తటస్థంగానే వ్యవహరించాయి. రష్యాను ఏకాకిగా చేయాలని భావించిన అమెరికా మరో దేశం అల్బేనియాతో కలిసి ఈ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించింది. మరోవైపు 193 సభ్యదేశాలు ఉన్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఈ ముసాయిదాను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. భద్రతామండలిలో రష్యా వీటో పవర్ ను ఉపయోగించి తీర్మానాన్ని అడ్డుకున్నప్పటికీ ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరి చేశామని వెస్ట్రన్ దేశాలు భావిస్తున్నాయి. అయితే తీర్మానాన్ని వీటో చేసినంత మాత్రాన.. ప్రపంచ దేశాల గొంతు నొక్కలేరని యూఎస్ రాయబారి లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్ అన్నారు. నిజాన్ని ఎప్పటికీ వీటో చేయలేరన్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఉక్రెయిన్‎కు మద్దతివ్వొద్దన్నారు.. కానీ మేమిస్తాం

రష్యా సైనికులను నిలదీసిన ఉక్రెయిన్ మహిళ

మిలిట‌‌‌‌రీ కాలేజీలో అడ్మిషన్స్​.. టీఎస్పీఎస్సీ ద్వారా అప్లికేషన్స్