
న్యూఢిల్లీ: భారతదేశం 2024–-25 మార్కెటింగ్ సంవత్సరంలో (ఏప్రిల్ 8 వరకు) 2,87,204 టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. ఇందులో అత్యధికంగా 51,596 టన్నులు సోమాలియాకు ఎగుమతి అయ్యాయని ట్రేడ్ సంస్థ ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ (ఏఐఎస్‌టీఏ) బుధవారం తెలిపింది. సుమారు 17,837 టన్నుల చక్కెర ప్రస్తుతం లోడింగ్‌లో ఉందని పేర్కొంది. చక్కెర మార్కెటింగ్ సంవత్సరం అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది.
ప్రస్తుత మార్కెటింగ్ ఇయర్‌లో చక్కెర ఎగుమతులకు జనవరి 20, 2025 న అనుమతి ఇచ్చారు.10 లక్షల టన్నులు ఎగుమతి చేయడానికి వీలు కల్పించారు. ఇప్పటివరకు జరిగిన మొత్తం ఎగుమతులలో, అత్యధికంగా సోమాలియాకు 51,596 టన్నులు, ఆఫ్ఘనిస్తాన్‌కు 48,864 టన్నులు, శ్రీలంకకు 46,757 టన్నులు, లిబియాకు 30,729 టన్నులు ఎగుమతి అయ్యాయి. జిబౌటీకి 27,064 టన్నులు, యూఏఈకి 21,834 టన్నులు, టాంజానియాకు 21,141 టన్నులు, బంగ్లాదేశ్‌కు 5,589 టన్నులు, చైనాకు 5,427 టన్నుల చక్కెరను ఇండియా ఎగుమతి చేసింది.