ముందుంది అసలు సవాల్.. హెడ్ కోచ్ గంభీర్‌‌‌‌కు పరీక్ష

ముందుంది అసలు సవాల్.. హెడ్ కోచ్ గంభీర్‌‌‌‌కు పరీక్ష

(వెలుగు స్పోర్ట్స్‌‌ డెస్క్‌‌): బెంగళూరులో పేస్ వికెట్‌‌పై.. పుణెలో స్పిన్‌‌ పిచ్‌‌పై  న్యూజిలాండ్‌‌ కొట్టిన దెబ్బతో టీమిండియా దిమ్మతిరిగింది. స్వదేశంలో ఏండ్లకు ఏండ్లు.. ఎదురైన ప్రత్యర్థినల్లా మట్టికరిపిస్తూ.. వరుసగా సిరీస్‌‌లు చుట్టేస్తున్న మనోళ్ల  జైత్రయాత్రకు బ్రేక్ పడింది. క్రికెట్‌‌లో ఇలాంటివి సహజమే. ఎంత గొప్ప రికార్డయినా ఎప్పుడో ఒకసారి బ్రేక్ అవ్వాల్సిందే. కానీ, న్యూజిలాండ్‌‌ చేతిలో ఘోర పరాజయం స్వదేశంలో ఇండియా జోరుకు అడ్డుకట్ట పడటమే కాకుండా మూడోసారి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్‌‌ చేరాలని అనుకుంటున్న జట్టు అవకాశాలను దెబ్బతీసింది. అలాగే,  టీమ్‌‌లోని పలువురు సీనియర్ల  ప్రభావంపై చర్చకు దారి తీసింది. 

ఒకవేళ ఇండియా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినా.. వయసు దృష్ట్యా వచ్చే రెండేండ్ల డబ్ల్యూటీసీ సైకిల్‌‌కు కెప్టెన్ రోహిత్‌‌ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్, జడేజా అందుబాటులో ఉంటారో లేరో చెప్పలేని పరిస్థితి. ఈ నలుగురితో పాటు తరచూ గాయాలకు గురవుతున్న మహ్మద్ షమీ కూడా కెరీర్‌‌‌‌ చివర్లో ఉన్నాడు. రాబోయే ఒకటి రెండేండ్లలో  టెస్టు జట్టులోని పలువురు వరల్డ్ క్లాస్ ప్లేయర్లు, మ్యాచ్‌‌ విన్నర్లు ఒకరి తర్వాత కెరీర్‌‌‌‌కు వీడ్కోలు పలకడం ఖాయం. జట్టు రూపాంతరం చెందుతున్న ఈ దశలో  మేటి ఆటగాళ్లకు సరితూగే కుర్రాళ్లను గుర్తించి, వారిని సానబెట్టే విషయంలో హెడ్  కోచ్‌‌గా గౌతమ్ గంభీర్‌‌ ముందు అది పెద్ద సవాల్‌‌ ఉండనుంది. 

బౌలింగ్‌‌లోనే ఇబ్బందులు
బ్యాటింగ్‌‌లో అనేక ఆప్షన్లు గంభీర్ ముందుండగా.. మంచి బౌలర్లను వెతకడమే సవాల్‌‌గా మారనుంది. పేస్ బౌలింగ్‌‌లో జట్టు ప్రస్తుతం బుమ్రాపైనే ఎక్కువ ఆధారపడుతోంది. మరో సీనియర్ షమీ రీఎంట్రీకి రెడీ అవుతున్నప్పటికీ తన పదేండ్ల అద్భుతమైన కెరీర్‌‌‌‌ చివర్లో ఉన్నాడు. షమీ స్థాయి ప్రభావం చూపలేకపోతున్నా  మహ్మద్ సిరాజ్‌‌, ఆకాశ్‌‌ దీప్ తమను తాము నిరూపించుకున్నారు. అయితే, మరో ఎండ్‌‌లో జస్‌‌ప్రీత్ బుమ్రా ఉండటంతోనే వీళ్ల పని సులువు అవుతోంది. వీళ్లకు బ్యాకప్ బౌలర్ల ఎంపిక కష్టతరం కానుంది. 

అవేశ్‌‌ ఖాన్‌‌, ఖలీల్ అహ్మద్‌‌లో వేగం ఉన్నా.. నిలకడ, ఫిట్‌‌నెస్‌‌ సమస్యగా మారింది. నవ్‌‌దీప్ సైనీలో పేస్ పడిపోగా.. మరో స్పీడ్‌‌స్టర్‌‌‌‌ ఉమ్రాన్ మాలిక్‌‌ జట్టు ‘దారి’ తప్పాడు. ఈ నేపథ్యంలో  మయాంక్‌‌ యాదవ్‌‌  ఫిట్‌‌నెస్‌‌ పెంచుకొని, టెస్టులకు ఎక్కువ కాలం అందుబాటులో ఉంటే తప్ప  బుమ్రా, షమీ స్థాయిలో ఇంకో బౌలర్‌‌‌‌ను చూడలేం. ప్రస్తుతం టెస్టు జట్టులో సీమ్ బౌలింగ్ ఆల్‌‌రౌండర్‌‌‌‌ హార్దిక్‌‌ పాండ్యా లేని లోటు కనిపిస్తోంది. తన వయసు తక్కువే అయినా గాయాల కారణంగా ఐదేండ్లుగా టెస్టులకు దూరమయ్యాడు. 

ప్రస్తుతం వన్డేలు, టీ20ల్లో కీలకంగా ఉన్న పాండ్యా టెస్టుల్లోకి తిరిగొస్తే మంచిదే. కానీ, వర్క్‌‌లోడ్ దృష్ట్యా మరో  సీమ్‌‌ బౌలింగ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌‌‌ జట్టుకు అవసరం. ఆస్ట్రేలియా టూర్‌‌‌‌కు ఎంపికైన ఏపీ కుర్రాడు నితీశ్‌‌ కుమార్ రెడ్డిని పాండ్యాకు బ్యాకప్‌‌ ఆప్షన్‌‌గా తీర్చిదిద్దుతున్నారు. కానీ, నితీశ్‌‌ తనను తాను నిరూపించుకోవడానికి కనీసం ఒకటి రెండేండ్లయినా పట్టొచ్చు. ఇక, జడేజా, అశ్విన్ స్థానాలను భర్తీ చేయడం గంభీర్‌‌‌‌, సెలెక్టర్లకు కత్తిమీద సాము కానుంది. జడేజా మాదిరిగా అక్షర్‌‌‌‌ మంచి ఆల్‌‌రౌండరే‌‌. కానీ, స్పిన్‌‌కు అనుకూలించని వికెట్లపై ప్రభావం చూపలేడు. అలాగే,  సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌‌, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో జడేజా మాదిరిగా బ్యాట్‌‌తో సత్తా చాటలేడు. పుణెలో 11 వికెట్లతో ఆకట్టుకున్న వాషింగ్టన్ సుందర్‌‌‌‌... సీనియర్ స్పిన్నర్‌‌‌‌ అశ్విన్‌‌కు పక్కా రీప్లేస్‌‌మెంట్‌‌ అనొచ్చు. బ్యాట్‌‌తోనూ సుందర్‌‌‌‌ మెప్పించగలడు. ఈ లెక్కన అశ్విన్‌‌–జడేజా తరం ముగిసిన తర్వాత సుందర్‌‌‌‌ ఒక్కడే స్పిన్ ఆల్‌‌రౌండర్‌‌ కానున్నాడు.

బ్యాటింగ్‌‌లో ఓకే కానీ..
సీనియర్ బ్యాటర్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె  టెస్టు టీమ్‌‌కు దూరమయ్యాక యశస్వి జైస్వాల్‌‌, శుభ్‌‌మన్ గిల్‌‌ వంటి కుర్రాళ్లు ఇప్పటికే కుదురుకున్నారు. రోహిత్‌‌ కూడా తప్పుకుంటే అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్‌‌, లెఫ్టాండర్ సాయి సుదర్శన్‌‌ రేసులో ఉన్నారు. 99 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌‌ల్లో 27 సెంచరీలు కొట్టి దాదాపు 50 సగటుతో ఉన్న ఈశ్వరన్‌‌కు మంచి భవిష్యత్తు ఉంది. కానీ, పెద్ద మ్యాచ్‌‌ల్లో, ఒత్తిడిలో  విఫలం అవుతాడనే ముద్ర అతనిపై ఉంది. ఇక, టీ20లు, వన్డేల్లో ఇప్పటికే సత్తా చాటిన గైక్వాడ్‌‌ దూకుడైన ఆట కొన్ని పరిస్థితుల్లో మాత్రమే జట్టుకు అవసరం అవుతుంది. 

అదే సమయంలో తమిళనాడుకు చెందిన లెఫ్టాండ్ బ్యాటర్ సాయి సుదర్శన్‌‌లో మంచి టెక్నిక్‌‌, టెంపర్‌‌‌‌మెంట్‌‌తో పాటు  భారీ స్కోర్లు చేసే ఆకలి ఉంది.  తను  మూడో నంబర్‌‌‌‌లో కూడా ఆడగలడు. ఇక, టెస్టుల్లో అత్యంత కీలకమైన నాలుగో నంబర్‌‌‌‌లో విరాట్‌‌ కోహ్లీ వారసుడిగా దేవదత్ పడిక్కల్‌‌ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే టెస్టు అరంగేట్రం చేసి ఫిఫ్టీతో ఆకట్టుకున్న పడిక్కల్‌‌లో టాలెంట్‌‌, టెక్నిక్‌‌ ఉన్నా.. అతనిలో  నిలకడ అవసరం. కీపర్ రిషబ్ పంత్‌‌కు రాబోయే పదేండ్లు తిరుగులేదనొచ్చు.  ఇప్పటికి ఐదు టెస్టుల్లో  అద్భుతంగా ఆడిన సర్ఫరాజ్ ఖాన్‌‌ అన్ని పరిస్థితుల్లో ఆరో నంబర్‌‌‌‌కు సరైనోడా? కాదా? అన్నది ఆస్ట్రేలియా టూర్‌‌‌‌లో తెలనుంది.