‘‘మత్తు వదలారా నిద్దుర మత్తు వదలారా.. ముందుచూపు లేని వాడు ఎందునకు కొరగాడు.. సోమరియై కునుకువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు..’’ అని శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో ఓ పాట ఉంది.. మొద్దుగా నిద్రిస్తున్న భీముడికి శ్రీకృష్ణుడు చురకలంటిస్తూ తట్టి లేపుతున్న పాట అది.. ఇంతకీ ఈ పాట గురించి ఇప్పుడెందుకు అని అనుకుంటున్నారా..ఎందుకంటే ఇటీవల జరిపిన అధ్యయనాల్లో ప్రపంచంలో సోమరి దేశాలు పెరిగిపోతున్నాయని తేలింది. అత్యంత సోమరితనం ఉన్న దేశాల లిస్టును కూడా ప్రకటించారు. అసలు సోమరి దేశాలేమిటి?.. ఎలా వీటిని నిర్ధారిస్తారు? అని డౌట్స్ వస్తున్నాయి కదా.. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..
మానవ ఆరోగ్యంపై పరిశోధనలు చేస్తున్న కాలిఫోర్నియాకు చెందిన పరిశోధనా సంస్థ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ జరిపిన పరిశోధనల్లో అశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టింది. ప్రపంచ దేశాల్లో ప్రజల సోమరితనాన్ని బట్టి సోమరి దేశాల లిస్టును తయారు చేశారు ఈ యూనివర్సిటీ పరిశోధకులు.
ప్రపంచంలోని 46 దేశాల నుంచి మొత్తం 70వేల మందిని ఈ అధ్యయనాల్లో పరిశీలించారు. స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి రోజూ వారు ఫిజికల్ గా నడుస్తున్న అడుగులను బట్టి ఈ పరిశోధనలను ముందుకు సాగించారు. ఈ స్టడీ నేచర్ అనే జర్నల్ లో ప్రచురించబడింది. ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో ఫిజికల్ యాక్టివిటీస్ లో ఉన్న అసమానతలను ఈ అధ్యయనాలు బయటపెట్టాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆయా దేశాల్లో ప్రజలు తక్కువగా నడుస్తున్నారని.. ఇది వారి సోమరి తనాన్ని సూచిస్తుంది. ఈ స్టడీ ఆయా దేశాలకు ర్యాంకులు కూడా ప్రకటించింది.
నడకలో వెనకబడ్డ దేశాల లిస్ట్
ఇండోనేషియా ఫస్ట్
నడకలో వెనకబడ్డ (సోమరి) దేశాల్లో ఇండోనేషియా ఫస్ట్.. ఇక్కడి ప్రజలు రోజుకు సరాసరి 3వేల 513 అడుగులు మాత్రమే నడుస్తున్నారట. ఇందుకు కారణం పట్టణీకరణ అంటున్నారు పరిశోధకులు. అక్కడి మౌళిక వసతులు తక్కువగా నడిచే విధంగా ఉన్నాయట. దీంతో ఆనారోగ్యం పెరిగిపోయే అవకాశం ఉందంటున్నారు. ఇండోనేషియన్ ప్రజల్లో ఫిజికల్ యాక్టవిటీస్ పెంచేందుకు ప్రజల ఆరోగ్య ఆవిష్కరణలు జరగాలని రీసెర్చర్లు అంటున్నారు.
రెండోది సౌదీ అరేబియా
సౌదీ ప్రజలు సగటున రోజుకు 3వేల 807 అడుగులు నడుస్తున్నారట. అక్కడి వేడి వాతావరణం, అక్కడి సాంప్రదాయం ఇందుకు కారణం అంటున్నారు. ఈ కంట్రీలో ప్రజలు ఎక్కువగా ఇళ్లలోనే ఉంటారట. సమ్మర్ లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. రోజంతా ఇంట్లోనే నిశ్చలంగా పడి వుంటారట. ప్రజల్లో ఫిజికల్ యాక్టివిటీ , అవుట్ డోర్ వ్యాయామంపై ప్రజల్లో అవగాహన పెంచెందుకు అక్కడి ప్రభుత్వం కృషి చేస్తుందట.
మలేషియా
మలేషియాలో ప్రజలు రోజుకు సగటున 3వేల 963 అడుగులు వేస్తున్నారట. మలేషియాలో కూడా పట్టణీకరణే ఇందుకు కారణం అంటున్నారు పరిశోధకులు. అక్కడి అన్ని పట్టణాల్లో భారీ ట్రాఫిక్.. ప్రజలను వాకింగ్ లెస్ గా చేస్తున్నాయట. మలేషియాలో శారీరక శ్రమను పెంచేందుకు నడక, పాదచారులకు అనుకూలమైన మౌలిక సదుపాయాలను కల్పించే లక్ష్యంతో ప్రజారోగ్య కార్యక్రమాలు నిర్వహించాలని నివేదికలు చెబుతున్నాయి.
ఫిలిప్పీన్స్
ఫిలిప్పీన్స్ లో రోజుకు 4వేల 008 అడుగులు మాత్రమే నడుస్తారట అక్కడి ప్రజలు. అందుకు తక్కువ చురుకైన దేశాలలో ఒకటిగా నిలిచింది. దీనికి పట్టణీకరణ, సామాజిక, ఆర్థిక అంశాలు ప్రధాన కారణాలు అంటున్నారు పరిశోధకులు. మనీలా, సెబు వంటి నగరాలు అధిక ట్రాఫిక్ రద్దీ , లిమిటెడ్ పెడస్ట్రియన్ సదుపాయాల వల్ల కూడా ఇలా జరుగుతుందట. ఫిలిప్పీన్స్‌లోని ప్రజల్లో శారీరక శ్రమ, నడక , సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని నిపుణులు సూచించారు.
సౌతాఫ్రికా
సౌతాఫ్రికాలో..సగటున రోజువారీగా 4వేల 105 అడుగులు పడతాయట. నడకలో వెనకబడ్డ దేశాల జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. ఆ దేశంలో భౌగోళిక పరిస్థితి, ఆర్థిక అసమానతలు శారీరక శ్రమపై ప్రభావం చూపుతున్నాయట. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది.
ఈజిప్ట్
రోజుకు సగటున 4వేల315 అడుగులతో ప్రపంచంలోని అత్యంత నిష్క్రియాత్మక దేశాల జాబితాలో ఈజిప్ట్ కూడా ఉంది. వేడి వాతావరణం ,పట్టణీకరణ, ట్రాఫిక్ రద్దీ ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి.
బ్రెజిల్
శారీరక శ్రమ విషయంలో బ్రెజిల్ తక్కువ ర్యాంక్ లో నే ఉంది. ఇక్కడి ప్రజలు రోజుకు సగటున 4వేల 289 అడుగులు నడుస్తారట. సావో పాలో, రియో డి జెనీరో వంటి పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే ప్రజల్లో తక్కువ యాక్టివిటీ ఉంటుంది. ప్రజారోగ్య ప్రచారం ద్వారా బ్రెజిలియన్లలో మరింత శారీరక శ్రమను పెంచాలని నివేదికలు చెపుతున్నాయి.
ఇండియా
ఇక ఇండియా విషయానికి వస్తే.. ప్రపంచంలోని అత్యంత నిష్క్రియ దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. రోజువారీగా సగటున ఒక్కొక్కరు 4వేల297 అడుగులు వేస్తారని అధ్యయనాలు వెల్లడించాయి. పట్టణీకరణ , జీవనశైలి మార్పులు భారతీయులలో లో యాక్టివిటీకి కారకాలుగా ఉన్నాయని అధ్యయనం పేర్కొంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో నివాసితులు నడక కంటే మోటారు రవాణాపై ఆధారపడుతున్నారని.. ఇళ్లలో ఉండేవారి శారీరక శ్రమ గణనీయంగా తగ్గుతుందని నివేదిక పేర్కొంది.
మెక్సికో
మెక్సికో ప్రపంచంలోని తక్కువ చురుకైన దేశాలలో ఒకటిగా ఉంది. పట్టణీకరణ, సామాజిక-ఆర్థిక అంశాలు ఇందుకు కారణంగా నివేదికలు చెబుతున్నాయి. మెక్సికో సిటీ , గ్వాడలజారా వంటి దేశాల్లోని అనేక నగరాలు అధిక ట్రాఫిక్ రద్దీ , లిమిటెడ్ వాకింగ్ ఫెసిలిటీస్ సమస్యలను అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్నారు. మెక్సికో శ్రామికశక్తిలో ఎక్కువ భాగం ఉత్పాదకత రంగంలో పనిచేస్తున్నారని మూలాలు పేర్కొంటున్నాయి.
అమెరికా
యునైటెడ్ స్టేట్స్ లో రోజుకు సగటున 4వేల 774 అడుగులతో 10వ స్థానంలో ఉంది. తక్కువ యాక్టివిటీ గల దేశాల్లో యూఎస్ కొంచెం మెరుగ్గానే ఉంది. అభివృద్ధి చెందిన దేశంగా ఉన్నప్పటికీ, కూర్చొని చేసే ఉద్యోగాల వల్ల కార్లు ఎక్కువగా వినియోగించడం అక్కడి ప్రజల్లో తక్కువ శారీరక శ్రమకు కారణమవుతున్నాయట. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ వంటి నగరాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందట. పబ్లిక్ హెల్త్ పాలసీలు వర్క్‌ప్లేస్ వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లను ప్రోత్సహించడం ద్వారా అమెరికన్లలో రోజువారీ నడకను పెంచుతాయని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు నివేదిక లో వెల్లడించారు.