పండుగ సీజన్‌‌లో ‌‌ఈ–కామర్స్​ అమ్మకాల విలువ రూ.1.17 లక్షల కోట్లు

పండుగ సీజన్‌‌లో ‌‌ఈ–కామర్స్​ అమ్మకాల విలువ  రూ.1.17 లక్షల కోట్లు
  • చిన్న సిటీలలో పెరుగుతున్న ఆన్‌‌లైన్ షాపింగ్
  • మెట్రోల్లో ప్రీమియం హోమ్‌‌ అప్లియెన్స్‌‌లు, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌‌లకు డిమాండ్ 

న్యూఢిల్లీ: ఆన్‌‌లైన్ షాపింగ్ కంపెనీలు ఈ ఏడాది ఫుల్ ఖుషీగా ఉన్నాయి. ఈ ఏడాది పండుగ సీజన్‌‌లో అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్ వంటి కంపెనీలు భారీగా లాభపడ్డాయి. ఈ–కామర్స్ కంపెనీలు తాజా పండుగ సీజన్‌‌లో ఏకంగా 14 బిలియన్ డాలర్ల (రూ.1.17 లక్ష కోట్ల)  విలువైన గూడ్స్‌‌ను అమ్మాయని అంచనా.  ప్రతి ఏడాది సెప్టెంబర్‌‌‌‌ 15 నుంచి అక్టోబర్ 31 వరకు ఫెస్టివల్ సీజన్ కొనసాగుతుంది. ఈ టైమ్‌‌లో అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్ వంటి ఈ–కామర్స్‌‌ కంపెనీలు భారీ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించాయి. 

టైర్ 2 సిటీల నుంచి ఈ–కామర్స్ కంపెనీలకు ఆర్డర్లు పెరిగాయని, ఫలితంగా వీటి గ్రాస్ మర్చండైజ్‌‌ వాల్యూ (జీఎంవీ) భారీగా పెరిగిందని రెడ్‌‌సీర్  స్ట్రాటజీ కన్సల్టెంట్‌‌  లేటెస్ట్‌‌ రిపోర్ట్‌‌లో పేర్కొంది. ఆన్‌‌లైన్ షాపర్లు పెద్దగా పెరగకపోయినా,  వీరు చేసే సగటు ఖర్చు మాత్రం కిందటేడాది పండుగ సీజన్‌‌తో పోలిస్తే 5–6 శాతం పెరిగిందని తెలిపింది. ముఖ్యంగా హైఎండ్‌‌ ఎలక్ట్రానిక్ వస్తువులు, హోమ్ అప్లియెన్స్‌‌లకు మెట్రో సిటీలలో ఫుల్ డిమాండ్ కనిపించిందని  వివరించింది. అదే చిన్న  సిటీలలో మాత్రం తక్కువ ధరల్లో దొరికే క్లాత్స్‌‌, బ్యూటీ ప్రొడక్ట్‌‌లకు డిమాండ్ కనిపించిందని  తెలిపింది.  

ఈ ఏడాది పండుగ సీజన్‌‌లో ఆన్‌‌లైన్ షాపింగ్ ట్రెండ్ ఇలా..

టైర్ 2 సిటీలలో ఆన్‌‌లైన్ షాపింగ్ పెరిగింది. రెడ్‌‌సీర్‌‌‌‌ రిపోర్ట్ ప్రకారం,   కిందటేడాది పండుగ సీజన్‌‌తో పోలిస్తే  ఈ ఏడాది పండుగ సీజన్‌‌లో టైర్ 2 సిటీలలో వినియోగం 13 శాతం ఎక్కువగా నమోదైంది. ఈ–కామర్స్ కంపెనీలు డిస్కౌంట్‌‌లు, ప్రమోషన్లతో ఆకట్టుకోవడంతో  కన్జూమర్ల కొనుగోళ్లు పెరిగాయి. ఫలితంగా ఈ–కామర్స్ కంపెనీల జీఎంవీ కూడా పెరిగింది. 

చిన్న పట్టణాల్లో  ఫ్యాషన్ (క్లాత్స్‌‌, షూస్‌‌, యాక్సెసరీస్ వంటివి) కేటగిరీ  టాప్‌‌లో కొనసాగుతోంది. ఎత్నిక్ వేర్‌‌‌‌, యాక్సెసరీస్‌‌, జ్యుయెలరీ, మహిళల యాక్సెసరీలకు డిమాండ్ ఎక్కువగా కనిపించింది. ఫ్యాషన్ కేటగిరీ సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంగా వృద్ధి చెందింది. మెట్రో సిటీలలో బ్రాండెడ్‌‌ ప్రొడక్ట్‌‌లకు డిమాండ్ కనిపించింది. ఆన్‌‌లైన్ షాపింగ్ పెరుగుతుండడంతో డైరెక్ట్‌‌గా కన్జూమర్లకు అమ్ముతున్న కంపెనీలు కూడా  లాభపడుతున్నాయని రెడ్​సీర్​ రిపోర్ట్​ వివరించింది. 

ఏసీలు వంటి అప్లియెన్స్‌‌లకు , ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్‌‌లకు  ఈ ఏడాది పండుగ సీజన్‌‌లో డిమాండ్ పెరిగింది. క్విక్ కామర్స్ కంపెనీలు వీటిని డెలివరీ చేయడానికి ముందుకొచ్చాయి.   పండుగ డిమాండ్‌‌ను చేరుకోవడానికి ఎక్స్‌‌ట్రా టైమ్ పనిచేయాల్సి వచ్చింది. కిరాయేతర ప్రొడక్ట్‌‌ల సేల్స్‌‌ కూడా పెరిగాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు సిటీలలో వీటి సేల్స్ ఎక్కువగా జరిగాయి.

‘ఈ  ఏడాది పండుగ సీజన్‌‌లో  టైర్‌‌‌‌ 2 కస్టమర్ల  వినియోగ శక్తిని  చూశాం. వీరు ఆన్‌‌లైన్ షాపింగ్‌‌కు  అలవాటు పడుతున్నారు, నమ్ముతున్నారు. క్విక్ కామర్స్‌‌ సర్వీస్‌‌లు విస్తరిస్తుండడంతో ప్రొడక్ట్‌‌ల డెలివరీలో మార్పులు వచ్చాయి. 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నాయి. ’ అని రెడ్‌‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్‌‌ అసోసియేట్ పార్టనర్‌‌‌‌ కుశాల్‌‌ భట్నాగర్‌‌‌‌ అన్నారు. ఫెస్టివల్​ సీజన్​ కోసం కంపెనీలు పెద్ద ఎత్తున వర్కర్లను కూడా నియమించుకున్నాయి.